Dipa
-
యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించి...
సిర్పూర్ (టి): అతడికి అప్పటికే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. ఆ యువతి ప్రేమకు నిరాకరించడంతో నేరుగా ఇంట్లోకి వెళ్లి ఆమెకు పురుగుల మందు తాగించి పరారయ్యాడు. తొలుత ఆత్మహత్యగా భావించినప్పటికీ ఓ పదేళ్ల చిన్నారి చెప్పిన సాక్ష్యంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్‌పేటకు చెందిన బుదే విట్టు, జీవనకళ దంపతుల కుమార్తె బుదే దీప (19) ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన దంద్రె జోగాజీ, దుమన్‌బాయిల కుమారుడు కమలాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజులుగా కమలాకర్ ప్రేమ పేరుతో దీప వెంటపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17న ఆదివారం సాయంత్రం యువతి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులను భయపెట్టి బయటికి పంపించాడు. తనను ప్రేమించాలని లేకుంటే నిన్ను, నీ కుటుంబం మొత్తాన్నీ చంపుతానని దీపను బెదిరించాడు. అయినప్పటికీ ఆమె ఒప్పుకోకపోవడంతో వెంట తెచ్చుకున్న పురుగుల మందును బలవంతంగా ఆమెకు తాగించి పరారయ్యాడు. దీప కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువతిని మొదట సిర్పూర్(టి) ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో కాగజ్‌నగర్‌కు.. అక్కడి నుంచి మంచిర్యాలకు ఆ తర్వాత మెరుగైన చికిత్సకోసం కరీంనగర్‌కు తరలించారు. సోమవారం కరీంనగర్లో దీప మృతి చెందింది. దీపది ఆత్మహత్యగా భావించిన కుటుంబ సభ్యులు పోస్టుమార్టం కోసం సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే దీపకు కమలాకర్ బలవంతంగా పురుగుల మందు తాగించిన విషయం ఓ పదేళ్ల చిన్నారి ద్వారా మంగళవారం వెలుగులోకి వచ్చింది. దీంతో సామాజిక ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలో స్థానికులు నిందితుడిపై దాడికి యత్నించారు. కౌటాల సీఐ సాదిక్‌పాషా, ఎస్సై రమేశ్ వారికి నచ్చజెప్పారు. పోలీసులు ఆస్పత్రిలోనే చిన్నారిని విచారించి పూర్తి వివరాలు సేకరించారు. మృతురాలి సోదరుడు బుదే రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
మా అత్తకు శశికళ చెడ్డపేరు తెచ్చారు
చెన్నై: జయలలిత వారసురాలిని తానేనని, పోయెస్ గార్డెన్ బంగ్లా తనకే చెందాలని ఆమె మేనకోడలు దీప అన్నారు. శశికళ నటరాజన్‌పై అవినీతి కేసులున్నాయని, అన్నా డీఎంకే పార్టీని నడపడానికి ఆమె సరైన వ్యక్తి కాదని జాతీయ మీడియాతో చెప్పారు. శశికళపై ఉన్న అవినీతి కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దీప గుర్తు చేశారు. ప్రజలు ఆమెను నాయకురాలిగా కోరుకోవడం లేదని చెప్పారు. గొప్ప నాయకురాలైన జయలలితకు శశికళ చెడ్డపేరు తెచ్చారని అన్నారు. జయలలిత తన ఆస్తులకు సంబంధించి వీలునామా రాయకపోవడంతో ఎవరికి దక్కుతాయనేది ప్రశ్నగా మారింది. జయలలిత మరణానంతరం పోయెస్ గార్డెన్ ఇంట్లో ఆమె స్నేహతురాలు శశికళ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో దీప స్పందించారు. శశికళ పన్నిన కుట్ర వల్లే తమ కుటుంబం అత్తకు దూరమైందని ఆరోపించారు. ఇదిలావుండగా, జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి స్వాధీనం చేసి.. ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని ఆమె సోదరి కుమార్తె అమృత డిమాండ్ చేసిన విషయం విదితమే. జయలలితకు స్వయానా సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మి దంపతుల కూతురు దీప కాగా.. జయ సొంత చెల్లెలు కుమార్తె అమృత. -
రాజకీయాల్లోకి జయ మేనకోడలు
చెన్నై: రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వస్తానని జయలలిత అన్న కుమార్తె దీప వెల్లడించారు. శశికళ పన్నిన కుట్ర వల్లే తమ కుటుంబం అత్తకు దూరమైందని శనివారం ఆమె ఆరోపించారు. తన తల్లిదండ్రులు అత్తతో కలిసి పోయెస్ గార్డెన్‌లోనే ఉండేవారని, తాను అక్కడే పుట్టానని తెలిపారు. శశికళ ప్రవేశంతో పోయెస్ గార్డెన్ నుంచి బయటకు రాక తప్పలేదని పేర్కొన్నారు. అత్త అనారోగ్య సమయంలో సరైన వైద్య చికిత్సలు, సపర్యలు అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్తను కలిసేందుకు అపోలోకు వెళ్లినప్పుడు, అత్త సమాధి వద్ద అంజలి ఘటించేందుకు వెళ్లినప్పుడు కూడా శశికళ అవమానించారని చెప్పారు. శశికళను పార్టీ పగ్గాలు చేపట్టాలని అన్నాడీఎంకే నేతలు కోరడంపై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి విషయాలను ప్రజల నిర్ణయానికే వదిలేయాలని అన్నారు. పార్టీ ప్రజానాడిని తెలుసుకుని ప్రవర్తించాలని సూచించారు. జయలలితే శశికళను లేదా కుటుంబీకుల్లో ఒకరిని పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరారనే వ్యాఖ్యలను ఖండించారు. -
చెప్పకుండా ప్రేమ పెళ్లి చేసుకుందని..
నల్లొండ: మూడేళ్ల పాటు ప్రేమలో మునగితేలిన ఓ జంట.. ఇంట్లో తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆర్య సమాజ్ లో వివాహం చేసుకుంది. గురువారం అచ్చూ సినీ ఫక్కీలో జరిగిన యవతి కిడ్నాప్ ఉదంతం జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సుందర్ నగర్ కు చెందిన గుంటిపల్లి నరేందర్(21), విద్యానగర్ కు చెందిన దీప(20) గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీప చదువు(బీ-ఫార్మసీ) పూర్తవడంతో ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పారు. దీప తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి నిరాకరించారు. దీంతో గత నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజ్ లో ప్రేమ జంట ఒక్కటైంది. అనంతరం తమకు రక్షణ కల్పించాలంటూ జిల్లా ఎస్పీని యువజంట ఆశ్రయించింది. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో కాపురం పెట్టిన నరేందర్-దీపలు శుభకార్యం కోసం గురువారం పట్టణానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న దీప తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున నరేందర్ ఇంటికి చేరుకుని ఆందోళన చేశారు. కొద్దిసేపటికి 20 మంది గుర్తు తెలియని దుండగులు నరేందర్ ఇంటిపై దాడి చేసి కుటుంబసభ్యులను చితక్కొట్టారు. దీపను కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. దీంతో నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీప ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. -
అత్యంత స్ఫూర్తిదాయక మహిళగా దీప
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. తాజా సర్వేలో అత్యంత స్ఫూర్తిదాయక భారత మహిళగా పేరు తెచ్చుకుంది. షాదీ.కామ్ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో ఈ విషయం తేలింది. ‘ఇటీవలి కాలంలో మీలో స్ఫూర్తి పెంచిన భారత మహిళ ఎవరు’ అని అడిగిన ప్రశ్నకు 33.7 శాతం మంది దీపకే ఓటేశారు. ఈ సర్వేలో మొత్తం 12,500 మంది పాల్గొన్నారు. రెండో స్థానంలో 27.4 శాతంతో రెజ్లర్ సాక్షి మలిక్ నిలిచింది. అయితే ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి మహిళగా నిలిచి రికార్డు సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వైపు కేవలం 6.2 శాతం మందే మొగ్గు చూపారు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా ఆకర్షిస్తున్న మహిళగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ (36.3 శాతం) నిలిచారు. నటి ప్రియాంక చోప్రా (31.2), టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (17.4) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.