చెప్పకుండా ప్రేమ పెళ్లి చేసుకుందని..
Published Thu, Dec 8 2016 6:58 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లొండ: మూడేళ్ల పాటు ప్రేమలో మునగితేలిన ఓ జంట.. ఇంట్లో తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆర్య సమాజ్ లో వివాహం చేసుకుంది. గురువారం అచ్చూ సినీ ఫక్కీలో జరిగిన యవతి కిడ్నాప్ ఉదంతం జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సుందర్ నగర్ కు చెందిన గుంటిపల్లి నరేందర్(21), విద్యానగర్ కు చెందిన దీప(20) గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీప చదువు(బీ-ఫార్మసీ) పూర్తవడంతో ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పారు.
దీప తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి నిరాకరించారు. దీంతో గత నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజ్ లో ప్రేమ జంట ఒక్కటైంది.
అనంతరం తమకు రక్షణ కల్పించాలంటూ జిల్లా ఎస్పీని యువజంట ఆశ్రయించింది. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో కాపురం పెట్టిన నరేందర్-దీపలు శుభకార్యం కోసం గురువారం పట్టణానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న దీప తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున నరేందర్ ఇంటికి చేరుకుని ఆందోళన చేశారు.
కొద్దిసేపటికి 20 మంది గుర్తు తెలియని దుండగులు నరేందర్ ఇంటిపై దాడి చేసి కుటుంబసభ్యులను చితక్కొట్టారు. దీపను కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. దీంతో నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీప ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.
Advertisement
Advertisement