విజయనగరం: ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయి దక్కదేమోనన్న అనుమానంతో అమ్మాయి తండ్రి దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తిని కత్తితో బెదిరించి, కిడ్నాప్ చేసిన కేసులో ఐదుగురు నిందితులను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పట్టణ డీఎస్పీ పి. అనిల్ కుమార్ మంగళవారం వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన పటిమీడ శివసూర్య అనే యువకుడు విజయనగరంలోని బంగారం దుకాణంలో పనిచేస్తూ ఆ షాపు ఎదురుగా ఉన్న నావెల్టీ షాపు యజమాని నరపత్‌సింగ్ పురోహిత్ కుమార్తె పూజ అనే అమ్మాయిని ప్రేమించి మేనెలలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు.
అది నచ్చని పూజ తండ్రి కోర్టులో కుమార్తె కనిపించడం లేదని, స్వరాష్ట్రమైన రాజస్థాన్ కోర్టులో సెర్చ్ వారెంట్ దాఖలు చేశారు. అక్కడి కోర్టు ఆదేశాలతో రాజస్థాన్ పోలీసులు రాజాం వచ్చి, స్థానిక పోలీసుల సహకారంతో నిందితుడు పటిమీడ శివసూర్య ఇంటికి వెళ్లి, అతను ఇంట్లో లేని సమయంలో పూజను తమతో తీసుకెళ్లారు. భార్య పూజను పోలీసులు తీసుకెళ్లడానికి నరపత్‌సింగ్ కారణమని భావించిన శివసూర్య..తన తండ్రి శ్రీరామ్మూర్తి, వారి దగ్గర పనిచేసే ముంగరి హరికృష్ణ, అతని స్నేహితుడు వంశీ, బావ తర్లాడ విశ్వేశ్వరరావుల సహకారంతో మూడు మోటారు సైకిళ్లపై ఆగస్టు 15న విజయనగరం వచ్చి, ముందుగా నరపత్ సింగ్ ఇంటికి వెళ్లారు. అక్కడ తాళం వేసి ఉండడం గమనించి మెయిన్‌రోడ్డులో ఉన్న నావెల్టీ షాపు వద్దకు వచ్చి చూడగా షాపు గేటుకు తాళం వేసి ఉండడం గమనించారు.
అయితే షాపులో కొంతమంది వ్యక్తులు ఉండడం గమనించి, గేటు తాళాలు పగులగొట్టి, నరపత్ సింగ్, కుటుంబ సభ్యుల గురించి ప్రశ్నించారు. షాపులో ఉన్నవారు తమకు తెలియదని చెప్పడంతో అక్కడ ఉన్న దుండారాం చౌదరి అలియాస్ రమేష్ అనే వ్యక్తిని కత్తితో బెదిరించి, ఇనుపరాడ్లతో కొట్టారు. వారిని అడ్డుకునేందుకు దినేష్ దివాశి అనే వ్యక్తి ప్రయతి్నంచగా అతనిని కూడా కొట్టి దుండారాం చౌదరిని తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఈ విషయమై అక్కడే షాపువద్ద ఉన్న గౌతం పురోహిత్ డయల్100కి ఫోన్ చేసి వివరించారు. దీంతో వన్‌టౌన్ సీఐ జె.మురళి ఆధ్వర్యంలో ఎస్సైలు ఐ.దుర్గాప్రసాద్ కృష్ణప్రసాద్‌లు రెండు బృందాలుగా సీసీ కెమెరాలను పర్యవేక్షించి నిందితులను 24 గంటల వ్యవధిలో పట్టుకుని కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన ఎస్సైలు, ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్టు డీఎస్పీ అనిల్ కుమార్ వివరించారు
Comments
Please login to add a commentAdd a comment