రాజకీయాల్లోకి జయ మేనకోడలు
చెన్నై: రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వస్తానని జయలలిత అన్న కుమార్తె దీప వెల్లడించారు. శశికళ పన్నిన కుట్ర వల్లే తమ కుటుంబం అత్తకు దూరమైందని శనివారం ఆమె ఆరోపించారు. తన తల్లిదండ్రులు అత్తతో కలిసి పోయెస్ గార్డెన్‌లోనే ఉండేవారని, తాను అక్కడే పుట్టానని తెలిపారు. శశికళ ప్రవేశంతో పోయెస్ గార్డెన్ నుంచి బయటకు రాక తప్పలేదని పేర్కొన్నారు. అత్త అనారోగ్య సమయంలో సరైన వైద్య చికిత్సలు, సపర్యలు అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అత్తను కలిసేందుకు అపోలోకు వెళ్లినప్పుడు, అత్త సమాధి వద్ద అంజలి ఘటించేందుకు వెళ్లినప్పుడు కూడా శశికళ అవమానించారని చెప్పారు. శశికళను పార్టీ పగ్గాలు చేపట్టాలని అన్నాడీఎంకే నేతలు కోరడంపై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి విషయాలను ప్రజల నిర్ణయానికే వదిలేయాలని అన్నారు. పార్టీ ప్రజానాడిని తెలుసుకుని ప్రవర్తించాలని సూచించారు. జయలలితే శశికళను లేదా కుటుంబీకుల్లో ఒకరిని పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరారనే వ్యాఖ్యలను ఖండించారు.