వ్యవసాయం అనుకూలించక అప్పుల పాలై ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
వరంగల్: వ్యవసాయం అనుకూలించక అప్పుల పాలై ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్మెట మండలంలోని అంకుషాపూర్ గ్రామ ఫరిది మాన్‌సింగ్‌తండాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. తండాకు చెందిన లకావత్ లక్ష్మణ్(35) తనకున్న ఎకరం వ్యవసాయ భూమిలో గత మాసంలో నాలుగు బోర్లు వేశాడు. మూడు బోర్లలో చుక్క నీరు కూడా రాలేదు. ఒక్క దానిలో కొద్దిగా మాత్రమే నీళ్లు వచ్చాయి. బోర్ల కోసం సుమారు రూ.లక్ష వరకు అప్పులయ్యాయి. దీనికి తోడు కొన్ని సంవత్సరాలుగా పంటలు సక్రమంగా పండకపోవడంతో సుమారు రూ.2 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పులు ఎలా తీర్చలా.. అని తరచూ భార్య రేణుకతో వాపోయేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపం చెంది బుధవారం రాత్రి వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రేణుక, కుమార్తె రాజేశ్వరి, కొడుకు రుపేశ్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై్స జలగం లక్ష్మణ్‌రావు తెలిపారు.
(నర్మెట)