![Former Indian Captain And Coach Rahul Dravid Comments On Team India In Mega Events](/styles/webp/s3/article_images/2024/08/23/Rahul-Dravid.jpg.webp?itok=ghl4-9fN)
మెగా ఈవెంట్స్‌లో ఫలితాలు అనుకూలంగా వస్తాయి.. భారత జట్టు మాజీ కోచ్ ద్రవిడ్ వ్యాఖ్య
ముంబై: మెగా ఈవెంట్లలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లకు కొన్నిసార్లు ప్రదర్శనతో పాటు కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలని భారత మాజీ కెపె్టన్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ‘సియెట్’ సంస్థ అందించే వార్షిక క్రికెట్ అవార్డుల్లో ద్రవిడ్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ పురస్కారం లభించింది. ఈ అవార్డుల కార్యక్రమం సందర్భంగా ద్రవిడ్ తన అనుభవాలను వివరించాడు. ద్రవిడ్ ఏమన్నాడంటే
‘గతేడాది భారత్ వన్డే ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియాకు అనూహ్యంగా టైటిల్ పోరులో ఆ్రస్టేలియా చేతిలో పరాజయం ఎదురైంది. ఓ ఆరు నెలల తిరిగేసరికి... ఈ ఏడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ డెత్ ఓవర్లలో కనబరిచిన అద్భుత పోరాటంతో దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి టి20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు సందర్బాల్లోనూ కెపె్టన్‌గా రోహిత్, కోచ్‌గా నేను ఉన్నాను. మాకు టి20 ప్రపంచకప్ టైటిల్‌కు మధ్య దక్షిణాఫ్రికా అడ్డుగా ఉంది. అయితే ఆటతోపాటు కొంచెం అదృష్టం కలసిరావడంతో కప్‌తో ఆనందం మా వశమైంది. ఎంత చేసినా ఆ రోజు మనది కావాలంటే రవ్వంత అదృష్టం కూడా మనతో ఉండాలి.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 30 బంతుల్లో 30 పరుగుల సమీకరణం ప్రత్యరి్థకే అనుకూలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత చిత్తంతో అనుకున్న ప్రణాళికను కెపె్టన్ రోహిత్ అమలు చేయాలి. ఎవరో ఒకరు మా ప్రయత్నాలకు కలిసి రావాలి. చివరకు సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ రూపంలో అదృష్టం మా పక్షాన నిలిచింది. ఈ క్యాచ్ తుది ఫలితాన్ని మావైపునకు తిప్పింది. కానీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరిగిన నవంబర్ 19న మాత్రం ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ శతకం శతకోటికిపైగా భారతీయుల కలల్ని కల్లలు చేసింది.
టి20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు రిటైర్మెంట్ ఇచి్చనప్పటికీ యువ బ్యాటర్లు వారి స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇకముందు కూడా భారత క్రికెట్ వెలిగిపోతుంది. ప్రస్తుతం దేశంలో నాణ్యమైన అకాడమీలు, మెరుగైన మౌలిక వసతులు, లీగ్‌లతో అపార అవకాశాలు యువ క్రికెటర్ల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తున్నాయి’ అని ద్రవిడ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment