నిన్న (ఆగస్ట్ 21) జరిగిన సియెట్ రేటింగ్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ గెలవడానికి జై షా, అజిత్ అగార్కర్, రాహుల్ ద్రవిడ్ చాలా తోడ్పడ్డారని అన్నాడు. ఈ ముగ్గురిని మూల స్తంభాలతో పోల్చాడు. జట్టు మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి సత్ఫలితాలు సాధించేందుకు ఈ మూడు స్తంభాలు తోడ్పడ్డాయని తెలిపాడు. నేను నా టీమ్ వరల్డ్‌కప్ సాధించడానికి ఈ ముగ్గురే కీలకమని ఆకాశానికెత్తాడు. జట్టుగా మేం రాణించడానికి ఆ ముగ్గురు ఇచ్చిన స్వేచ్ఛనే కారణమని తెలిపాడు.
తన కెప్టెన్సీ గురించి హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. తాను ఆషామాషీగా ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలవలేదని, కెప్టెన్‌గా ఇంతటితో ఆగేది లేదని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ టైటిళ్లు సాధించడమే తన లక్ష్యమని చెప్పకనే చెప్పాడు.
కాగా, నిన్న జరిగిన ఫంక్షన్‌లో రోహిత్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు లభించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. మెన్స్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, యశస్వి జైస్వాల్ మెన్స్ టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ మెన్స్ టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు.
బౌలర్ల విషయానికొస్తే.. మహ్మద్ షమీ మెన్స్ వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ మెన్స్ టెస్ట్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, టీమ్ సౌథీ మెన్స్ టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment