అప్పుల బాధ తాళలేక ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదిలాబాద్ : అప్పుల బాధ తాళలేక ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు...ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామానికి చెందిన రైతు మేకల పంచుభూమన్న(53) శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖరీఫ్‌లో పత్తి, వరి సాగు చేయగా విద్యుత్ కోతల కారణంగా నీరందక అవి ఎండిపోయాయి. రబీలో నువ్వు పంట సాగు చేయగా గడ్డి విపరీతంగా మొలకెత్తింది. కలుపు తొలగించగా.. కరెంటు కష్టాలు వెంటాడాయి. ఎండలు తీవ్రమై పంటకు నీరందక ఎండిపోయింది. బ్యాంకులో రూ.లక్ష, తెలిసిన వారినుంచి రూ.లక్ష అప్పులతో అప్పులపాలయ్యాడు. అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన పంచు భూమన్న తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భూమన్నకు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై సక్రియానాయక్ తెలిపారు.
(లోకేశ్వరం)