crop weives
-
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం
పులివెందుల : అప్పులవాళ్ల ఒత్తిడి ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఆర్. తుమ్మలపల్లెలో సోమవారం ఉదయం జరిగింది. రామచంద్రారెడ్డి (50) అనే రైతు అప్పుల బాధ భరించలేక తనకున్న ఆరెకరాల భూమిని విక్రయించాడు. సోమవారం ఉదయం భూముల రిజిస్ట్రేషన్ ఉండగా ఆదివారం రాత్రి నుంచే అప్పులవాళ్ల ఒత్తిడి అధికమైంది. దాంతో మానసిక ఒత్తిడికి గురైన రామచంద్రారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతణ్ణి పులివెందుల ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రైతు రామచంద్రారెడ్డికి భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జగిత్యాల: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. చల్గల్ గ్రామానికి చెందిన కోల నాగయ్య(48) తనకున్న తన భూమితో పాటు రెండెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. పైరు గింజ దశకు చేరుకున్న సమయంలో నీరు అడుగంటడంతో పొలం ఎండిపోయింది. పెట్టుబడులు, పిల్లల పెళ్లిళ్ల కోసం రూ.5 లక్షల దాకా అప్పు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెందాడు. బుధవారం రాత్రి పొలం వద్ద పురుగుల మందు తాగాడు. ఇదే మండలం బాలెపల్లిలో బేతి సుధాకర్‌రెడ్డి(40) నాలుగెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల భూగర్భ జలాలు అడుగంటాయి. కళ్లముందే పంట ఎండిపోతుండడంతో మనస్తాపం చెందాడు. ఇతనికి రూ.10 లక్షల వరకు అప్పు ఉంది. ఎలా తీర్చాలనే బెంగతో బుధవారం రాత్రి మొక్కజొన్న చేను వద్ద పురుగు మందు తాగి ప్రాణం విడిచాడు. ఇతనికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఆదిలాబాద్ : అప్పుల బాధ తాళలేక ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు...ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామానికి చెందిన రైతు మేకల పంచుభూమన్న(53) శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖరీఫ్‌లో పత్తి, వరి సాగు చేయగా విద్యుత్ కోతల కారణంగా నీరందక అవి ఎండిపోయాయి. రబీలో నువ్వు పంట సాగు చేయగా గడ్డి విపరీతంగా మొలకెత్తింది. కలుపు తొలగించగా.. కరెంటు కష్టాలు వెంటాడాయి. ఎండలు తీవ్రమై పంటకు నీరందక ఎండిపోయింది. బ్యాంకులో రూ.లక్ష, తెలిసిన వారినుంచి రూ.లక్ష అప్పులతో అప్పులపాలయ్యాడు. అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన పంచు భూమన్న తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భూమన్నకు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై సక్రియానాయక్ తెలిపారు. (లోకేశ్వరం)