బానకచెర్ల(పాములపాడు): తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం ఇష్టం లేక సయ్యద్ ఫరూక్‌బాషా(20)అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని భానకచెర్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సయ్యద్ ఫరూక్‌బాషా ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామానికి చెందిన వాడు.నాలుగు నెలల క్రితం కర్నూలు పట్టణానికి చెందిన యువతితో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిశ్చయించారు. వివాహం ఇష్టం లేక ఈనెల 15న పాములపాడు మండలం భానకచెర్ల గ్రామంలో ఉన్న తన అక్క, బావచాంద్‌బాషల వద్దకు వచ్చాడు. తనకు కుదిర్చిన వివాహం ఇష్టం లేదని తన అక్క బావలకు తెలిపారు. ఉదయమే ఊరికి వెళ్తున్నానని చెప్పి బయలు దేరాడు. వేంపెంట గ్రామం వద్ద పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని కుటుంబీకులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. స్థలం వివరాలు చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు భానకచెర్ల గ్రామం చుట్టూ గాలించారు. చివరకు సాయంత్రం వేంపెంట వద్ద విగతజీవిగా కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి తండ్రి ఖాజామొహిద్దిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.