గ్రామానికి చెందిన కొందరు నీచంగా దుర్భాషలాడారని మనస్తాపానికి గురైన మహిళ బలవన్మరణానికి పాల్పడింది.
పురుగుల మందు తాగి మహిళ బలవన్మరణం
నిందితుడిని ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన
పోలీసులకు ఫిర్యాదు..
కేసు నమోదు
ఆత్మకూర్(ఎస్)
గ్రామానికి చెందిన కొందరు నీచంగా దుర్భాషలాడారని మనస్తాపానికి గురైన మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండల కేంద్రంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొంపెల్లి గోపయ్య,వీరమ్మల కూతురు లక్ష్మమ్మ(40)కు మోతె మండలం రాఘవపుర ం గ్రామానికి చెందిన గడ్డమీది మల్లయ్యతో వివాహం జరిగింది. 16 సంవత్సరాల క్రితం భర్తతో పాటు వచ్చి ఆమె ఆత్మకూర్‌లో కాపురం ఉంటున్నది.
10 నెలల క్రితం భర్త మల్లయ్య అనారోగ్యంలో మరణించాడు. ఇటీవల గ్రామానికి ఉప్పుల గుర్వయ్య,శ్రీశైలం,ముల్కలపల్లి రజినీకాంత్, ముల్కలపల్లి వెంకటమ్మలు తనపట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, దుర్భాషలాడుతున్నారని ఈ నెల 8న లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి పంపించారు. తిరిగి మరోమారు వారు సోమవారం సాయంత్రం కూడా లక్ష్మమ్మ పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో మనస్తాపానికి గురైంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి పురుగులమందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.
నిందితులను శిక్షించాలని నిరసన
లక్ష్మమ్మ మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు గ్రామానికి చెందిన ఉప్పుల గురువయ్య ఇంటిఎదుట ఆందోళనకు దిగారు. మాటలతో హింసించడం మూలంగానే లక్ష్మమ్మ మృతిచెందిందని ఆరపించారు. ఆమె కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకుని పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుమారుడు సురేష్ ఫిర్యాదు మేరకు లక్ష్మమ్మను దుర్భాషలాడిన నలుగురిపై కేసు నమోదు చేస్తున్నట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ బండి అంతిరెడ్డి ప్రకటించారు. దీంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.