‘చావు తప్ప మరో దారి లేదు’ | Land Seized Madhya Pradesh Farmer Couple Drinks Pesticide | Sakshi
Sakshi News home page

దళిత దంపతులపై జులుం

Published Thu, Jul 16 2020 8:38 AM | Last Updated on Thu, Jul 16 2020 9:10 AM

Land Seized Madhya Pradesh Farmer Couple Drinks Pesticide - Sakshi

భోపాల్‌: చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌తో నాశనం చేయడం చూసి ఆ దళిత దంపతులు తట్టుకోలేకపోయారు. సొంత బిడ్డను చంపుతున్నట్లే భావించారు. ఆ ఘోరాన్ని చూడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. రామ్‌ కుమార్‌ అహిర్వార్‌, సావిత్రి దేవి దంపతులు కొన్నేళ్లుగా రెండు బిఘాల(5.5 ఎకరాలు) ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2018లో ప్రభుత్వం ఆ భూమిని ఓ కాలేజీ కోసం కేటాయించింది. దాంతో ఆ భూమిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు రామ్‌ కుమార్‌ దంపతులకు సూచించారు. కానీ వాళ్లు అంగీకరించకపోవడంతో.. రెండు రోజుల క్రితం రాష్ట్ర రెవెన్యూ అధికారులు పోలీసులతో వచ్చి భూమిని ఖాళీ చేయాల్సిందిగా రామ్‌ కుమార్‌ దంపతులను బెదిరించారు. 

ఈ క్రమంలో బుల్డోజర్‌తో వారి పంటను నాశనం చేసే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు, రామ్‌ కుమార్‌ దంపతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ‘మాకు మూడు లక్షల రూపాయల అప్పు ఉంది. దాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటే.. మేం ఎలా బతకాలి. చావు తప్ప మాకు వేరే దారి లేదు’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా రామ్‌ కుమార్‌ మీద దాడి చేశారు. అడ్డుకోబోయిన సావిత్రి దేవిని అసభ్యకరమైన మాటలతో అవమానించారు. చివరకు బుల్డోజర్‌తో పంటను నాశనం చేసేందుకు ప్రయత్నించారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన ఆ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రామ్‌కుమార్‌ దంపతుల మీద దాడి చేసిన పోలీసులకు జిల్లా కలెక్టర్‌ క్లీన్‌చీట్‌ ఇవ్వడం మరింత వివాదాస్పదంగా మారింది. (మృతదేహం ‍కళ్లు పీక్కుతిన్న చీమలు!)

దాంతో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నింటికంటే ముందుగా పోలీసులకు క్లీన్‌చీట్‌ ఇచ్చిన కలెక్టర్‌ను, ఎస్పీని సస్పెండ్‌ చేశారు. తల్లిదండ్రులను కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలను కూడా పోలీసులు అవమానించారు. అవతలకు ఈడ్చిపారేశారు. ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ సీఎం కమల్‌నాథ్‌ రాష్ట్రంలో జంగిల్‌రాజా పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ‘దళిత దంపతుల మీద పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఏంటిది జంగిల్‌ రాజా. ఒకవేళ వారు ప్రభుత్వ భూమినే సాగు చేస్తున్నారనుకుందా. దాన్ని చట్టబద్దంగా పరిష్కరించుకోవాలి. అంతకాని జాలీ, దయ లేకుండా ఆ దంపతులను, వారి పిల్లలను కొట్టడం న్యాయం కాదు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.(కమల్‌ను కాపాడిన ‘కరోనా’)

దీని గురించి ప్రభుత్వ అధికారులను ప్రశ్నించగా.. ‘లోకల్‌ గ్యాంగ్‌స్టర్‌ ఒకడు దాదాపు 4.5 బిఘాల(12.5ఎకరాలు) భూమిని ఆక్రమించుకున్నాడు. రామ్‌ విలాస్‌ దందపతులను వాడుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు అప్పులపాలైన రామ్‌ విలాస్‌ దంపతులను వాడుకుంటున్నాడు’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement