
పురుగు మందుల ధరల పరుగు
- భారీగా పెంచిన కంపెనీలు
- ఆందోళనలో రైతులు
యలమంచిలి : పురుగుమందు కంపెనీలు ధరలు పెంపుతో ‘మూలిగే నక్కమీద తాటికాయ వేసిన’ చందంగా తయారైంది రైతుల పరిస్థితి. వర్షాల్లేక ఖరీఫ్ సాగు నిరాశాజనకంగా ఉంది. ఎట్టకేలకు ఇటీవల అల్పపీడన ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో రైతులు సాగు పనులకు వీలు చిక్కిందని రైతులు సంబరపడుతున్నారు. కానీ పురుగు మందుల ధరలు పెరుగుదల చూసి దిగులు చెందుతున్నారు.
ఇప్పటికే వరి నారుకు, ఇతర వాణిజ్య పంటలకు తెగుళ్ల నివారణకు వీటి అవసరం ఉంది. పొరుగు జిల్లాల కంటే జిల్లాలో పురుగు మందుల ధరలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో కొంతమంది పెద్ద రైతులు పక్క జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో వీటిని కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. సన్న, చిన్నకారు రైతులు గత్యంతరం లేక పెంచిన ధరలకే కొనుగోలు చేస్తున్నారు. దీనికి నకిలీ పురుగు మందులు తోడయ్యాయి. వీటిని వాడితే అటు పురుగులు చావక, ఇటు పంటలను కాపాడుకోలేక సతమతమవుతున్న పరిస్థితులున్నాయి.
జిల్లాలో ఏటా రూ.200 కోట్ల వరకు పురుగు మందుల విక్రయం జరుగుతోంది. వరితో పాటు వాణిజ్య పంటలకు వచ్చే తెగుళ్లు, చీడపీడల నివారణకు పురుగు మందులను రైతులు వాడుతున్నారు. కొంతమంది జిల్లాస్థాయిలో సిండికేట్ అయి ధరలను పెంచి విక్రయిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు దీనిపై సరిగ్గా దృష్టి సారించడం లేదని అంటున్నారు. పురుగు మందుల ధరలు పెంచకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.