
మరో 14 మంది రైతుల ఆత్మహత్య
అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆది, సోమవారాల్లో మరో 14 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు
పాలమూరు జిల్లాలోనే ఐదుగురు బలవన్మరణం
నల్లగొండలో నలుగురు.. కరీంనగర్‌లో ఇద్దరు
అప్పులు, పంటలపై దిగులే ప్రధాన కారణాలు
సాక్షి నెట్‌వర్క్ : అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆది, సోమవారాల్లో మరో 14 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. పాలమూరు జిల్లాలో ఐదుగురు, నల్లగొండ జిల్లాలో నలుగురు, కరీంనగర్‌లో ఇద్దరు, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు తీసుకున్నారు.
మహబూబ్‌నగర్.. ప్రాణాలు తీస్తున్న అప్పులు
పాలమూరు జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వకు చెందిన కందనూలు రాములు (65)కు రెండెకరాల పొలం ఉంది. మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. పంట కోసం దాదాపు రూ.4.50 లక్షలు అప్పు చేశాడు. పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో సోమవారం పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇటిక్యాల మండలం ఉదండాపురానికి చెందిన జయంతి(32).. నాలుగెకరాల్లో పత్తి, మిరప పంటలను సాగు చేసింది.
పంటలు చేతికందలేదు. దాదాపు రూ.పది లక్షల అప్పులయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక దిగులు చెంది పురుగుల మందు తాగి చనిపోయింది. కొందుర్గు మండలం ఎల్కగూడలో చాకలి యాదయ్య, యాదమ్మ(54) దంపతులు తమకు ఉన్న రెండెకరాల పొలంతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. పంటలు రాక అప్పుల పాలయ్యారు. దీంతో యాదమ్మ ఆదివారం రాత్రి ఒంటికి నిప్పటించుకుని చనిపోయింది. మల్దకల్‌కు చెందిన లక్ష్మమ్మ (52) పత్తి, మిరప, కంది, ఆముదం పంటలు సాగు చేస్తోంది. రూ.ఐదు లక్షలకు పైగా అప్పులు చేసింది. వాటిని ఎలా తీర్చాలనే దిగులుతో ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. మల్లెందొడ్డికి చెందిన యల్లప్ప (32) నాలుగెకరాలు కౌలు తీసుకుని పత్తి, వేరుశనగ వేశాడు. పంటలు దెబ్బతినడంతో మనస్తాపానికి గుైరె పొలంలో పురుగు మందు తాగాడు.
నల్లగొండ.. పంట చేలల్లో మృత్యుఘోష
నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం జాలుతండాకు చెందిన ధరావత్ శంకర్(40) తనకున్న మూడు ఎకరాలతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప సాగు చేశాడు. నీరు లేక మిరప ఎండింది. పెట్టుబడుల కోసం రూ.4 లక్షలు అప్పుచేశాడు. ఆదివారం అప్పుల వాళ్లు వచ్చి వేధించడంతో అదే రోజు రాత్రి మిరపతోట వద్దకు వెళ్లి పురుగుల మందు చనిపోయాడు. చిలుకూరు మండలం నారాయణపురానికి చెందిన బూర ధనమూర్తి (40).. రూ.1.50 లక్షల అప్పు చేసి బోరు బావి తవ్వించాడు. చుక్కనీరు పడలేదు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 23న వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. కేతేపల్లి మండలం బీమారానికి చెందిన మాదాసు లింగయ్య(55) పత్తి, వరి పంటలకు పెట్టుబడుల కోసం రూ.5 లక్షలు అప్పు చేశాడు. పంటలు అంతంతే ఉండడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి చనిపోయాడు. పెద్దవూర మండలం తునికినూతలలో కొర్ర భిక్ష(55) పంటల కోసం రూ.2 లక్షల అప్పులు చేశాడు. ఆ అప్పులు తీరవనే బాధతో చేనుకు వెళ్లి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కరీంనగర్.. దిగుబడి రాదేమోనని
కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నానికి చెందిన కాసారపు సత్తయ్య(40) మూడెకరాల భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వరి వేయగా ఎండిపోరుుంది. రూ.3.50 లక్షల అప్పులయ్యాయి. దీంతో ఈనెల 22న పొలం వద్దే క్రిమిసంహారక మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మరణించాడు. కాటారం మండలం జాదారావుపేటలో కోట లచ్చయ్య (30)కు రెండేళ్లుగా ఆశించిన దిగుబడి రాలేదు. రూ.3.80 లక్షల అప్పులపై బెంగతో ఉరేసుకున్నాడు.
మెదక్..:చిన్నశంకరంపేట మండలం శాలిపేటకు చెందిన భల్యాల ఎల్లం(34) రూ.60 వేలతో బోర్లు వేశాడు. కానీ చుక్కనీరు రాలేదు. వేసినా మొక్కజొన్న కూడా ఎండిపోవడంతో ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు.
వరంగల్..:డోర్నకల్ మండలం తొడేళ్లగూడెంలో చెక్కల ఉపేంద్ర(33) తన భర్తతో కలిసి పత్తి సాగు చేస్తోంది. పెట్టుబడుల కోసం రూ.2.30 లక్షల అప్పులు చేశారు. దీంతో ఉపేంద్ర చేనులో పురుగుల మందు తాగి చనిపోయింది.
రంగారెడ్డి..:మర్పల్లి మండలం బూచన్‌పల్లిలో పాండయ్య ఎకరం పొలంలో పెసర, మినుము సాగు చేయగా ఎండిపోయాయి. రూ.2.4 లక్షల అప్పులయ్యాయి. దీంతో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.