నగరంలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన సజ్జర సురేష్(52) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ఖమ్మం అర్బన్: నగరంలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన సజ్జర సురేష్(52) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన ప్రకారం... పాండురంగాపురంలోని తన ఇంటి నుంచి సురేష్ శుక్రవారం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఖమ్మం-ఇల్లెందు రోడ్డులోని గణేష్ టౌన్‌షిప్ ఎదురుగాగల ఖాళీ స్థలంలో నిశ్చల స్థితిలో ఉన్న ఇతనిని శనివారం ఉదయం పశువుల కాపరులు చూశారు. చేతిలో పెన్ను, పక్కన వార్తాపత్రిక, పురుగు మందు డబ్బా ఉన్నాయి. వార్తాపత్రికపై ’ధనలక్ష్మి... నీకు అన్యాయం చేస్తున్నా’ అని రాసి ఉంది.
సెల్ ఫోన్ నంబర్ కూడా వేసి ఉంది. కాపరుల ద్వారా సమాచారమందుకున్న స్థానికులు అతడిని గుర్తించి కుటుంబీకులకు తెలిపారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహితురాలైన పెద్ద కూతురు అమెరికాలో ఉంటోంది. ఇతను గతంలో నగరంలోని ప్రముఖ స్వీట్ షాపులో భాగస్వామిగా ఉన్నాడని, ఆ తరువాత అక్కడే కొంతకాలంపాటు పనిచేశాడని, ప్రస్తుతం అక్కడ మానేసి ఖాళీగా ఉంటున్నాడని తెలిసింది. ఇతను పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.