తిరుమలాయపాలెం (ఖమ్మం జిల్లా)/ తాండూరు (వికారాబాద్ జిల్లా): బాగా చదువుకోవాలని టీచర్ మందలించడంతో మనస్తాపం చెందిన ఓ ఇంటర్ విద్యార్థి, చెడు సావాసాలకు వెళ్లొద్దంటూ తండ్రి హెచ్చరించడంతో అవమానంగా భావించిన ఓ టెన్త్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో వేర్వేరు చోట్ల శనివారం జరిగిన ఈ ఘటనల వివరాలిలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని హైదర్‌సాయిపేటకు చెందిన గుగులోత్ కృష్ణ – రమి కుమారుడు విష్ణు(17) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చేరాడు. ఈనెల 7న టీసీ, ఇతర సర్టిఫికెట్ల కోసం తండ్రి కృష్ణతో కలిసి పదో తరగతి చదివిన పాఠశాలకు వచ్చాడు. ఈ క్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ పదో తరగతిలో ప్రవర్తన సరిగ్గా లేదని చెబుతూ ఇంటర్‌లోనైనా బాగా చదువుకోవాలని విష్ణును మందలించారు.
తండ్రి, ఉపాధ్యాయుల ముందే తనను అవమానించారని భావించిన విష్ణు మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయాన గడ్డి మందు తాగాడు. కాసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలించారు. వైద్యం చేసినా లాభం లేదని అక్కడి వైద్యులు చెప్పడంతో తిరిగి ఖమ్మం తీసుకురాగా ఆరోగ్యం విషమించి శనివారం మృతిచెందాడు.
తండ్రి మందలించాడని...
తాండూరు మండల పరిధిలోని జినుగుర్తి గ్రామానికి చెందిన కంబంలి నర్సింలు, యాదమ్మల కుతూరు(15).. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇంటి పక్కనే ఉండే ఓ బాలుడితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన తండ్రి.. పాఠశాలకు వెళ్లి అందరిముందూ బాలికపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీన్ని అవమానంగా భావించిన బాలిక ఇంట్లో ఉన్న మాత్రలు మింగింది. అస్వస్థతకు గురైన ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. యాదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment