breaking news
Urea Crisis
-
ఎరువు కోసం రైతన్న ఏకరువు!
రైతన్న దేశానికి వెన్నెముకగా నిలుస్తున్నాడని ఎంత చెప్పుకుంటున్నా వ్యవసాయానికి సంబంధించి తనకు మౌలిక సదుపాయాల భరోసా ఇవ్వకపోతే ఎలా అనే ప్రశ్నలొస్తున్నాయి. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియా కోసం అన్నదాత పడిగాపులు అంతాఇంతా కావు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాకా అని చెప్పుకుంటున్న కుప్పంలోనూ ఎరువు కోసం కర్షకులు ఏకరువు పెడుతున్న దుస్థితి నెలకొంటోంది. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితులు లేవు. అయితే అప్పటి రైతన్న కష్టాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పోకడలు కారణమవుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, క్రిమిసంహారకాల వాడకం పెరుగుతుండడం వల్ల సాగుభూమి క్రమంగా సారం కోల్పోతుందని చాలా నివేదికలు చెబుతున్నాయి. పంటల దిగుబడి పెంచాలంటే సహజ ఎరువులు వాడాలని అధికారాలు ఎంత ఊదరగొడుతున్నా అందుకు సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడంతో ఆ లక్ష్యం నీరుగారుతోంది. రైతులు ఏ పంట వేసినా దాదాపు యూరియా వాడకం తప్పనిసరైంది. కానీ సాగుకు సరిపడా యూరియా తయారీలో యాంత్రాంగాలు జాప్యం చేస్తున్నాయనే వాదనలున్నాయి. అందుకు కొన్ని కారణాలను కింద తెలియజేశాం.ఎంత అవసరమో ముందే తెలిసినా..యూరియా పంట దిగుబడి పెంచడంలో, ఆహార భద్రతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వాలు తరచు దీని తయారీ ప్లాంట్లను స్థాపించడంలో లేదా ఇప్పటికే ఉన్న వాటిలో ఉత్పాదకతను పెంచడంలో గణనీయమైన జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయి. దాంతో రైతులకు పంట సమయానికి ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు తప్పడంలేదు. ప్రతి ఏడాది ఎంత మొత్తంలో ఎరువులు అవసరం అవుతాయో ముందే నిర్ధారించుకున్న ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ఎరువులు తయారు చేయాలి లేదా దిగుమతి చేసుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ గోదాముల్లో ఎరువులు నిల్వ ఉంచి అవసరాలకు తగ్గట్టుగా వెంటనే సరఫరా చేసే వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎరువుల తయారీలో, వాటి సరఫరాలో జాప్యానికి చాలానే కారణాలున్నాయి.అడపాదడపా నిధులుయూరియా తయారీ అనేది మూలధన ఆధారిత ప్రక్రియ. కొత్తగా ఎరువుల కర్మాగారాన్ని నిర్మించడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. దాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకురావడానికి చాలా ఏళ్లు పట్టవచ్చు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే పరిమిత ఆర్థిక వసతులతో పోరాడుతున్నాయి. ఫలితంగా ఇటువంటి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం కష్టమవుతుంది. బడ్జెట్లో వ్యవసాయానికి అడపాదడపా కేటాయించిన మొత్తం నిధుల నుంచి ఇలాంటి ప్రాజెక్ట్‌లకు ఖర్చు చేయడం సవాలుగా కూడుకుంటోంది.సబ్సిడీ భారంనిర్మాణ వ్యయంతోపాటు యూరియా తయారీకి భారీగా సబ్సిడీ ఇస్తున్నారు. భారత్ వంటి దేశాల్లో రైతులు యూరియాను దాని వాస్తవ ఉత్పత్తి వ్యయంలో కొంత ధరలకే కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని ప్రభుత్వం రాయితీలతో పూడుస్తోంది. దేశీయంగా ఉత్పాదకతను పెంచితే అందుకు అనుగుణంగా ప్రైవేట్ కంపెనీలకు అధిక సబ్సిడీ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వాలకు భారం. ఇంకొన్ని కంపెనీలు డీఏపీ, పొటాష్..వంటి ఇతర కృత్రిమ ఎరువుల తయారీకి యూరియాను దారి మళ్లిస్తున్నాయి. ఆయా ఎరువులపై మార్జిన్లు అధికం ఉండడం, వాటికి మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుండడంతో ఈమేరకు అక్రమాలకు పాల్పడుతున్నాయి.ప్రాజెక్ట్‌ల తాత్సారంకొన్నిసార్లు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ బ్యూరోక్రటిక్ నిబంధనల కారణంగా యూరియా ప్రాజెక్టుల అమలుకు చాలా ఆలస్యం అవుతుంది. భూసేకరణ, పర్యావరణ అనుమతులు పొందడం, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు రావడం, కఠిన నిబంధనలు పాటించడం వంటి చర్యలతో ఏళ్లకుఏళ్లు ఈ ప్రక్రియ వాయిదా పడుతోంది. అంతేగాక రసాయనాలు, ఎరువులు, పర్యావరణం, పెట్రోలియం (గ్యాస్ సరఫరా కోసం), ఫైనాన్స్ వంటి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లోపిస్తుంది. ఏదైనా విభాగంలో ఆలస్యం జరిగితే మొత్తం ప్రాజెక్టు పురోగతి ఆగిపోతుంది.అంతర్జాతీయ మార్కెట్లు..స్వల్పకాలిక వ్యవసాయ అవసరాలను తీర్చడానికి అనేక ప్రభుత్వాలు దేశీయ ఉత్పాదకతపై పెట్టుబడులు పెట్టడానికి బదులుగా యూరియాను దిగుమతి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఇది మరింత ఖర్చుకు దారితీస్తుంది. అయితే కొత్తగా ప్రాజెక్ట్ స్థాపించి సరఫరా చేయడానికి బదులుగా ఇది సరళమైన విధానంగా కూడా కనిపిస్తుంది. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు మరింత పెరుగుతున్నాయి. అయితే, ఎరువుల దిగుమతిపై ఆధారపడటం దీర్ఘకాలిక బలహీనతలను సృష్టిస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆంక్షలు లేదా ధరల అస్థిరత కారణంగా ఏదైనా ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడినప్పుడు అసలు సమస్య గుర్తుకొస్తుంది. ఇది దేశీయ వ్యవసాయ ఉత్పాదకతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.లాభదాయకంగా చేయవచ్చు.. కానీ..యూరియా ఉత్పత్తి సహజ వాయువు లభ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీన్ని ఫీడ్‌స్టాక్‌గా ఉపయోగిస్తారు. అనేక దేశాల్లో సహజ వాయువు కొరత ఉంది. ఒకవేళ దిగుమతి చేసుకోవాలన్నా ఖరీదుతో కూడుకుంది. సహజవాయువు సమృద్ధిగా ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా యూరియా ఉత్పత్తిని ఆర్థికంగా లాభదాయకం చేయవచ్చు. గ్యాస్ సరఫరాలో అంతరాయాలు లేదా అననుకూల ధరల ఒప్పందాలు ఉత్పత్తిని నిలిపేస్తున్నాయి. కొత్త ప్లాంట్ ఏర్పాటును ఆలస్యం చేస్తున్నాయి.ఇప్పుడేం చేయాలంటే..ప్రభుత్వాలు సంప్రదాయ యూరియా వాడకానికి దూరంగా నేల ఆరోగ్యం, పర్యావరణ సుస్థిరతపై అవగాహన పెంపొందించే ప్రయత్నాలను మరింత పెంచాలి. నానో యూరియా, బయో ఫెర్టిలైజర్స్, సేంద్రియ ఎరువులు వాడకం వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించేలా రైతు సమావేశాలు ఏర్పాటు చేయాలి. యూరియా వాడకంతో పోలిస్తే ఖర్చులు తగ్గుతూ దిగుబడి స్థిరంగా ఉన్నా రైతులు ఇలాంటి ప్రత్యామ్నాయాలవైపు చూసే అవకాశం ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత సాయంతో సంప్రదాయ యూరియాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గాలేమిటో అధికారులు, పరిశోధకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు? -
యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే భారీ వితరణ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నదే. అయితే తన నియోజకవర్గంలోని రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Batthula Laxma Reddy), ఆయన కుటుంబసభ్యులు భారీ విరాళం అందించారు. ఇటీవల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భావించారు. కానీ రిసెప్షన్‌ను రద్దు చేసుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ (Revanth Reddy)ను లక్ష్మారెడ్డి కలిసి రూ.2కోట్ల చెక్ అందజేశారు. తాను అందించిన వితరణతో లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందించాలని సీఎంను ఆయన కోరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబసభ్యులను సీఎం రేవంత్ అభినందించారు. -
ఇది అత్యవసర చర్చ.. సిద్ధంగా ఉంటే రేపటిదాకా ఎందుకు?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రైతుల సమస్యలపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబడుతోంది. రైతుల సమస్య, యూరియా అంశాలపై చర్చించాలంటూ వైఎ్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. యూరియా కొరత సమస్య తీర్చాలని, పంటకు గిట్టుబాటు ధర సమస్య పరిష్కరించాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులతో అధికార సభ్యులు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ ఆందోళనల నడుమ మండలిని కాసేపు చైర్మన్ వాయిదా వేశారు. అయితే.. రైతాంగం సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమని, ఆ చర్చ రేపు నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో.. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రైతులకు అత్యవసరమైన చర్చ. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఈరోజు చర్చించవచ్చు కదా. రేపటిదాకా వాయిదా వేయడం ఎందుకు?. రైతాంగం తరఫున వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది. గత ఐదేళ్లుగా ఎప్పుడైనా రైతులు ఇలా రోడ్డెక్కి ఆందోళన చేశారా?. మా హయాంలో రైతులకు ఎలాంటి సమస్య ఎదురవ్వలేదు. యూరియా కోసం ఎన్నడూ ఆందోళనలు జరగలేదు. రైతులు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అందుకే రైతుల సమస్యలపై చర్చించాలని మేం కోరుతున్నాం. రైతాంగం తరపున చర్చించడానికి రేపటిదాకా ఎందుకు?. ఈరోజే చర్చిస్తే తప్పేముంది. ఇప్పుడే సమస్య వచ్చింది కాబట్టే చర్చించమని కోరుతున్నాం అని బొత్స డిమాండ్ చేశారు. -
అస్తవ్యస్తంగా కూటమి పాలన: వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, వైఎఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఏ ఒక్క వర్గానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. కడపలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. గ్రామ సచివాల వ్యవస్థను పూర్తిగా నిర్వీరం చేశారు. రైతు భరోస కేంద్రాల ద్వారా రైతుకు అందాల్సిన యూరియాను అందించడం లేదు. సకాలంలో యూరియా ఎరువులు అందగా రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది..మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. గతంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించేవారు. రైతులను ప్రభుత్వం ముంచుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. గ్యాంబ్లింగ్ పేకాట జూదం కూటమి నాయకులు దగ్గరుండి నడిపిస్తున్నారు అని అన్నారాయన. -
మీ వల్లే యూరియా కొరత..’: చంద్రబాబు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో యూరియా కొరతపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మరోసారి తన మార్క్ కుట్రకు తెరతీశారు. ఈ కుట్రలో కలెక్టర్లను బలిచేసినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఎరువుల కొరత అనే మాట వినిపించలేదు. కానీ ప్రస్తుతం అదే వ్యవస్థ, అదే అధికారులు ఉన్నా, రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. బ్లాక్ మార్కెట్ దందా పెరిగిపోవడంతో రైతులు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో యూరియా కొరత ఉందనే విషయాన్ని అంగీకరించారు. అయితే చేతిలో ఉన్న సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం. ఇవన్నీ మ్యాన్ మెడ్ సమస్యలే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. ఈ క్రమంలో.. యూరియా సరఫరా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయలేకపోయాం అgటూ యూరియ కొరత అంశాన్ని చంద్రబాబు కలెక్టర్లపై తోసేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో సమావేశంలో పాల్గొన్న కలెక్టరు సైతం కంగుతిన్నారు. క్రెడిట్లు కొట్టేయడంలో ఆరితేరిన చంద్రబాబు.. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు మాత్రం అవతలి వాళ్లపై నెట్టేయడంలో సిద్ధహస్తుడనే విషయం మరోసారి రుజువైందని విశ్లేషకులు అంటున్నారు. -
యూరియా కోసం సకుటుంబ సపరివారం
సిరిసిల్ల/ఓదెల: అన్నదాతలు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల కష్టాలు చెప్పలేనివిగా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్షాప్ వద్ద శుక్రవారం కుటుంబ సభ్యులు క్యూౖ లెన్లో నిల్చున్నారు. సిరిసిల్ల శివారులోని చిన్నబోనాలకు చెందిన పడిగే ఎల్లయ్య, మణెమ్మ దంపతులు తమ కూతురు రమ్యతో కలిసి తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒకే బస్తా ఇస్తుండడంతో తాము సాగుచేసిన ఐదు ఎకరాలలోని వరిపొలానికి ఎటూ సరిపోవని ముగ్గురు లైన్లో ఉండి మూడు యూరియా బస్తాలకు టోకెన్ పొందారు. ఓదెల తహసీల్ ముట్టడిఓదెలకు చెందిన రైతులు దాదాపు 100 మంది యూరియా కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. స్థానిక ఫర్టిలైజర్‌షాపు యజ మాని బ్లాక్‌లో విక్రయిస్తున్నాడంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఏఈవోలు సైతం టోకెన్లు స రిగా ఇవ్వడం లేదన్నారు. గంటల తరబడి క్యూౖ లెన్లో ఎదురుచూస్తుంటే స్టాక్ లేదంటూ కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ ప్రభుత్వంలో ఈ కష్టాల్లేవ్: రైతులు
సాక్షి, కృష్ణా: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు ఎరువుల కొరత(Urea Crisis) అనే మాటే వినిపించలేదు. కానీ ఇప్పుడు అదే వ్యవస్థ.. అదే అధికారులు ఉన్నా.. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. బ్లాక్ మార్కెట్ దందాతో నిస్సహాయంగా మిగిలిపోయారు. దీంతో రైతులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉయ్యూరు మండలం ముదునూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) వద్ద పడిగాపులు పడుతున్న రైతులు కొందరిని సాక్షి పలకరించింది. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్‌పై వాళ్లు దుమ్మెత్తిపోశారు. ‘‘అర్ధరాత్రి నుంచి సొసైటీ గేట్ ఎదురు పడిగాపులు కాస్తున్నాం. మొదటి కోట యూరియా ఇంకా వెయ్యలేదు. రైతు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం చేయటం దుర్భరంగా మారింది.బ్లాక్‌లో యూరియా రూ.800 పైగా అమ్ముతున్నారు. 10 ఎకరాలకు 2 కట్టలు ఇస్తున్నారు. యూరియా కోసం ఇంతకు ముందెప్పుడూ రోడ్లపైకి ఎప్పుడు రాలేదు. జగన్ ప్రభుత్వంలోనూ ఈ పరిస్థితి లేదు. సకాలంలో ఎరువులు, పంట సాయం అందేవి. ఇప్పుడు యూరియా వాడితే చంద్రబాబు క్యాన్సర్ వచ్చింది అంటున్నాడు. చంద్రబాబుకు రైతులు అంటే అంత చులకన?. ఇకనైనా ప్రభుత్వం రైతును ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న అవస్థలపై తాజాగా ప్రెస్మీట్లో కూటమి సర్కార్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Press Meet On Urea Troubles) చురకలంటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ యూరియా కొరత రాలేదు. అధికారులు కూడా రైతుల పక్షాన ఉండేవారు. ఇప్పుడు మాత్రం యూరియాను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించి, రూ. 250 కోట్ల స్కాం చేశారు. రైతులు బారులు తీరుతున్నారు, కానీ అధికార పార్టీ క్యాడర్‌కు మాత్రం యూరియా బస్తాలు సిద్ధంగా ఉన్నాయి. MSP (మద్దతు ధర) కూడా ఇవ్వకుండా, రైతులను ఆత్మహత్యల దిశగా నెట్టుతున్నారు. మేము తిరిగి అధికారంలోకి వస్తే, ఈ దందా అంతా బయటపెడతాం. రైతులకు న్యాయం చేస్తాం అని అన్నారాయన. గత వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాల) ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో అదే అధికారులు ఉండి, అదే వ్యవస్థ ఉండి.. అప్పుడు లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది? అని చంద్రబాబును నిలదీశారాయన. ఇదీ చదవండి: ఎరువులు అందిస్తే ఏ రైతూ రోడ్డెక్కడు: వైఎస్ జగన్