విజయం మనదే! | - | Sakshi
Sakshi News home page

విజయం మనదే!

Published Sun, May 26 2024 3:30 AM | Last Updated on Sun, May 26 2024 10:00 AM

-

పోలింగ్‌ ఫలితాలపై లెక్కలువేసుకుంటున్న ప్రధాన పార్టీలు

తమ స్థానాలు ‘పది’లమంటున్న వైఎస్సార్‌సీపీ

పరువు నిలుపుకుంటామంటున్న టీడీపీ

జనసేన, బీజేపీ స్థానాల్లో గెలుపు అసాధ్యమే

ఓటు బదిలీ కాలేదంటున్న రాజకీయ పరిశీలకులు

వైఎస్సార్‌సీపీ ఖాతాలోకే కడప,రాజంపేట పార్లమెంటు స్థానాలు

సాక్షి ప్రతినిధి, కడప: ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగలో ఓటర్లు పోటాపోటీగా పాల్గొన్నారు. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఫలితం కోసం జూన్‌ 4వరకు వేచి ఉండక తప్పదు. అయినప్పటికీ ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. మేమే గెలుస్తామంటూ ఎవరికి వారు ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. బూత్‌ల వారీగా ఓట్లు గణన చేస్తున్నారు. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలోని పది సీట్లు పదిలమని వైఎస్సార్‌సీపీ విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, పరువు నిలుపుకునే స్థాయిలో సీట్లు దక్కుతాయని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఓటు బదిలీపై ఆశలు పెట్టుకున్న జనసేన, బీజేపీలకు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా నిరాశే మిగలనుంది. కాగా, కడప, రాజంపేట పార్లమెంటు స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలో మరోమారు జమ కానున్నాయి.

ఎన్నికల పొత్తులో భాగంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఏకమై తలపడ్డాయి. ఆ కారణంగానే ముందంజలోకి వచ్చామని టీడీపీ భావిస్తుండగా అదే పొత్తు ప్రతిబంధకంగా మారిందని వైఎస్సార్‌సీపీ అంచనా వేస్తోంది. పైగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఒంటరిని చేసి ముప్పేట దాడి చేయడం కూడా జిల్లా వాసులకు మింగుడు పడలేదని తెలుస్తోంది. దీంతో జిల్లాలో ఉన్న సంప్రదాయ ఓటర్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమకు అండగా నిలిచారని వైఎస్సార్‌సీపీ సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తోంది. ఈ క్రమంలో అన్ని స్థానాలు పదిలపర్చుకుంటామని మరోమారు 2019 ఫలితాలు పునరావృతం కాగలవని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కడప, రాజంపేట పార్లమెంటు స్థానాలతో పాటు 10 శాసనసభ స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే జమ కానున్నట్లు పలువురు వివరిస్తున్నారు.

ఖాతా తెరుస్తాం.. పరువునిలుపుకుంటామంటున్న టీడీపీ
గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా టీడీపీకి దక్కలేదు. అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఖాతా తెరుస్తాం, పరువు నిలుపుకునే స్థాయిలో సీట్లు సాధిస్తామని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి అసెంబ్లీ స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చామని చెప్పుకొస్తున్నారు. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వరుసగా ఓడిపోయిన నేపథ్యంలో ఈమారు అనుకూలత ఉందని టీడీపీ భావిస్తోంది.

 పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఎన్నికల సమయంలో మినహా స్థానికంగా లేకపోవడంతో పాటు రెడ్డి, ముస్లిం, క్రిష్టియన్‌ మైనార్టీ, ఎస్సీ ఓటర్లు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారని గెలుపు అసాధ్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కమలాపురంలో టీడీపీ అభ్యర్థిగా పుత్తా నరసింహారెడ్డి వరుసగా పరాజయం పాలయ్యారు. ఈమారు సానుభూతితో గట్టెక్కగలమని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. తీరా అభ్యర్థిత్వం పుత్తా నరసింహారెడ్డికి కాకుండా ఆయన తనయుడు కృష్ణచైతన్యరెడ్డికి కేటాయించారు. పైగా టీడీపీ విజయం కోసం పనిచేస్తారని భావించిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, కాశీభట్ల సాయినాథశర్మ ఇరువురు వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. ఈక్రమంలో మెజార్టీ తథ్యమని భావించిన కమలాపురం మండలంలో టీడీపీకి భారీగా గండిపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సన్నగిల్లిన వరద ఆశలు...
మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి ప్రొద్దుటూరుపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఈమారు విజయకేతనం ఎగురవేస్తామనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎన్నికలు సమీపించే కొద్ది వారి ఆశలకు తూట్లు పడ్డాయి. పోలింగ్‌లో మహిళలు గణనీయంగా పాల్గొనడంతో మరింతగా చచ్చుబడిపోయారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. గతంతో పోలిస్తే దాదాపు 2.6 శాతం ఓటింగ్‌ పెరిగింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, కొత్త ఓటర్ల కారణంగా ఓటింగ్‌ పెరిగిందని దీంతో మరోమారు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాదరెడ్డి విజయం సాధిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాయచోటిలో ఇలాంటి ఆశలే పెట్టుకున్న టీడీపీకి ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు ప్రతిబంధకంగా నిలిచినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి గట్టిపోటీకి మాత్రమే పరిమితం అయ్యారని, ఓటు బదిలీ ఆశించిన స్థాయిలో కాలేదని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ మూలె సుధీర్‌రెడ్డి విజయానికి ఢోకా లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కడపలో టీడీపీకి నిరాశే..
కడప అసెంబ్లీపై తెలుగుదేశం పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో అనేక వివాదాస్పద వ్యవహారాలు తెరపైకి వచ్చాయి. మత విద్వేషాలను పురిగొల్పారు. సామాజిక సమీకరణల్లో భాగంగా అనేక ఎత్తుగడలను అవలంబించారు. ముస్లిం మైనార్టీల ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మైనార్టీ నాయకున్ని తెరపైకి తెచ్చారు. ఎన్నికల ముందు ఏమేమి చేయాలో అన్ని రకాలుగా చేశారు. అయినప్పటికీ 65.27 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైంది. మొత్తం ఓటర్లలో సుమారు 33శాతం పైగా ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు. ముస్లిం మైనార్టీ, క్రిష్టియన్‌ మైనార్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలు ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారని ఆ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రెడ్డి సామాజికవర్గంలో, వలస వచ్చిన వారిలో, కాపు సామాజికవర్గంలో టీడీపీకి కాస్త సానుకూలత లభించినట్లు పలువురు వివరిస్తున్నారు. ఎటుచూసినా టీడీపీకి గెలుపు అంత సులువు కాదనే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

పార్లమెంటు అభ్యర్థుల విజయం ఏకపక్షమే.. 
కడప, రాజంపేట వైఎస్సార్‌సీపీ పార్లమెంటు ఫలితాలు ఏకపక్షంగా ఉండనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కడప ఎంపీ పరిధిలో 1989 నుంచి వైఎస్‌ కుటుంబం ఆధిపత్యమే కొనసాగుతోంది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి ఎంపీ అయ్యింది మొదలు ఇప్పటి వరకూ ఆ కుటుంబ సభ్యులే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 2014లో తొలిసారి పోటీ చేసిన వైఎస్‌ అవినాష్‌రెడ్డికి 55.95 శాతం ఓట్లు లభించాయి. అప్పట్లో 1,90,323 ఓట్లు మెజార్టీ లభించగా, రెండవసారి 2019లో 63.79 శాతం ఓట్ల శాతంతో 3,80,726 ఓట్ల మెజార్టీ దక్కింది. 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మరోమారు పోటీ చేసిన ఆయన హ్యాట్రిక్‌ విజయం సొంతం చేసుకోనున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిపాజిట్టు కోల్పోనున్నట్లు పరిశీలకుల అభిప్రాయం. రాజంపేట నుంచి ఇప్పటికే వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రెండుసార్లు విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సైతం ఈమారు హ్యాటిక్ర్‌ విజయం దక్కించుకోనున్నట్లు స్పష్టమవుతోంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మిథున్‌రెడ్డికి భారీ మెజార్టీ దక్కనున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలు మాత్రం గెలుపు విషయంలో ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తుండటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement