సాక్షి, ఒంగోలు: జిల్లాలో శనగ రైతులు భగ్గుమంటున్నారు. రుణాల మాఫీ అమలులో సర్కారు దోబూచులాటపై విరుచుకుపడుతున్నారు. ఆర్భాటపు ప్రకటనలతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోన్న అధికారపార్టీ నేతల మెడపై కత్తి పెట్టేందుకు సిద్ధమయ్యారు. తాజాగా, జిల్లాకు చెందిన శనగ పంట రైతులు ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించడం చర్చనీయాంశమైంది.
కొన్ని మాసాలుగా శనగ రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈవిషయంపై అనేకమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు. అయితే, వారికి ఎక్కడా స్పష్టత లభించలేదు. పైగా, వారు కోల్డ్‌స్టోరేజీల్లో దాచుకున్న శనగల నిల్వలను బహిరంగ వేలం వేసి రుణాల రికవరీ చేస్తామని బ్యాంకర్లు నోటీసులిచ్చారు.
ఈనెల 25వ తేదీ నుంచి 29 వరకు జిల్లాలో రుణాలు తీసుకుని బకాయి పడిన రైతులకు చెందిన 17 లక్షల క్వింటాళ్ల శనగలను బహిరంగ వేలం వేస్తామని బ్యాంకర్లు ప్రకటించడంతో వ్యవహారం రాజుకుంది. ఇదేవిషయంపై కిందటి నెల 27న వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రవాణామంత్రి శిద్ధా రాఘవరావుతో పాటు తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరాం నేతృత్వంలో రైతులు ముఖ్యమంత్రిని కలిశారు. వారంలో సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీనిచ్చినా ఫలితం దక్కలేదు.
నోరువిప్పని అధికార పార్టీ నేతలు..
శనగ రైతులంతా టీడీపీకి ఓట్లేసి గెలిపించాలని.. గిట్టుబాటు ధరపై న్యాయం చేస్తామని అన్ని జిల్లాల్లో ఆపార్టీ నేతలు ఎన్నికల సమయాన విస్తృత ప్రచారం చేశారు. అప్పట్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికొచ్చినప్పుడు శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతు రుణమాఫీపై స్పష్టమైన హామీనిచ్చారు. ప్రస్తుతం అధికారం చేపట్టాక కూడా వారిని ఆదుకునే ప్రయత్నాల్లో ఆపార్టీ ప్రజాప్రతినిధులు వెనుకంజ వేస్తున్నారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాలోని నరసరావుపేట డివిజన్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో శనగ పంటను రైతులు సాగుచేస్తున్నారు.
సరైన గిట్టుబాటు ధర లేక ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో మొత్తం 30 లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వలున్నాయి. అందులో ప్రకాశం జిల్లాలోనే 20 లక్షల క్వింటాళ్లు నిల్వలుండటం గమనార్హం. ఏటా సీజన్ ప్రారంభంలో క్వింటాలు రూ.5 వేలకు పైగానే ధరపలికే శనగలు... సరుకు చేతికొచ్చే నాటికి క్వింటాలు రూ.2600 దిగజారింది. గిట్టుబాటు కాని ధరకు అమ్ముకోలేక, నిల్వలను కోల్డ్‌స్టోరే జ్‌ల్లోనే ఉంచుకున్నారు. స్టోరేజీల్లో ఉన్న సరుకు నిల్వలకు బ్యాంకర్లు అప్పటి ధరపై 75 శాతం రుణాలిచ్చారు. ప్రస్తుతం తీసుకున్న రుణాలకన్నా ..నిల్వచేసుకున్న సరుకుకు విలువ తక్కువగా ఉండటంతో.. మిగిలిన సొమ్ము వెంటనే చెల్లించాలని బ్యాంకర్లు రైతులను ఒత్తిడి చేస్తున్నారు.
రెండేళ్లుగా శనగల నిల్వలు పేరుకుపోవడంతో రుణాల రికవరీ చేయని రైతులపై బ్యాంకర్లు వేలం నోటీసులిచ్చారు. ఇప్పటికే జిల్లాలో 2 వేల మంది రైతుల శనగలను రుణాల రికవరీ పేరిట వేలం వేశారు. తాజాగా, ఈనెల 25 నుంచి అత్యధిక మంది రైతుల శనగలను వేలం వేసేందుకు బ్యాంకర్లు సంసిద్ధం కావడంతో.. భగ్గుమన్న రైతాంగం వ్యవసాయ మంత్రి ఇంటిని చుట్టుముట్టాల్సి వచ్చిందని ప్రకాశం జిల్లా శనగ రైతుసంఘం అధ్యక్షుడు నాగ బోయిన రంగారావు తెలిపారు.
వేలం నిలిపివేతపై కలెక్టర్‌కు ఆదేశాలు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించిన క్రమంలో బాధిత రైతులు బ్యాంకర్ల వేలం నోటీసులను చూపించారు. వ్యవసాయ రుణాల మాఫీ అమలుపై జాప్యంతో పాటు తాము పండించిన శనగలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. శనగల గిట్టుబాటు ధరపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. ఈవిషయంలో కేంద్రసహకారం కోరతామని చెప్పగా.. ఆయన సమాధానంపై రైతులు శాంతించలేదు. అనంతరం వారంతా కలిసి చిలకలూరిపేట - ఒంగోలు జాతీయ రహదారిపై బైఠాయించగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకాశం జిల్లా కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే బ్యాంకర్లను పిలిపించి వేలం ప్రక్రియను నిలువరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
శనగ రైతుపై వేలం వేటు
Published Mon, Sep 22 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM
Advertisement