kothapatnam
-
నడిసంద్రంలో బిగ్ ఫైట్.. చెన్నై బోట్లను తరిమేశారు!
చెన్నై మత్స్యకారులు బరితెగించారు. ఎప్పటిలాగే మన సముద్ర తీర ప్రాంతం వైపు చొరబడ్డారు. అక్రమంగా మత్స్య సంపదను దోచుకుపోతున్నారు. పెద్ద పెద్ద బోట్లలో వచ్చి వేటాడటాన్ని మనవాళ్లు గుర్తించారు. సినిమాను తలపించే విధంగా నడిసంద్రంలో చెన్నై సోనాబోట్లను వెంటాడారు. తీరం నుంచి మెరైన్ పోలీసులు, మత్స్యకారులు, మత్స్యశాఖ సిబ్బంది 10 కిలో మీటర్లు సముద్రంలో ప్రయాణించి పెద్ద పెద్ద బోట్లతో నిబంధనలు అతిక్రమించి వేటాడుతున్న 16 బోట్లను వెంబడించి తరిమికొట్టారు. దీంతో వారు తోక ముడిచి వలలను వదిలి ఉడాయించారు. ఈ ఘటన బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొత్తపట్నం తీరంలో చోటుచేసుకుంది. కొత్తపట్నం: గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరం వెంబడి చెన్నై సోనా బోట్లు నిబంధలకు విరుద్ధంగా వేట సాగిస్తున్నాయి. తీరానికి అతి దగ్గరలో 100 మీటర్ల దూరంలో తమిళనాడు మత్స్యకారులు వేట చేయడం పరిపాటిగా మారింది. వారి బోట్లు 40 అడుగుల ఎత్తులో, మన బోట్లు ఐదు అడుగుల ఎత్తులో ఉండటంతో వారిని స్థానిక మత్స్యకారులు కట్టడి చేయడం కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారులు, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పరిష్కారం కాలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో.. వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో చెన్నై సోనా బోట్లు అదుపు చేశారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు పెద్ద బోట్లలో తీరానికి దగ్గరగా వచ్చి మా సంపద కొల్లగొడుతున్నారని స్థానిక మత్స్యకారులు గత ఏడాది డిసెంబర్ 30న బాలినేని దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన కె.పల్లెపాలెం తీరానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. నిజాంపట్నంలో సోనా బోటును బాడుగకు తీసుకొచ్చి చెన్నై మత్స్యకారులు వేటాడుతున్న ప్రాంతానికి వెళ్లి భయపెట్టాలని, వారిని అక్కడ వేటాడకుండా చేయాలని, ఆ బోటుకు ఎంత ఖర్చయినా తాను పెట్టుకుంటానని జేడీ ఆవుల చంద్రశేఖరరెడ్డిని ఆదేశించారు. తాజా వివాదం ఇలా.. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు మత్స్యశాఖ అధికారులు స్పందించారు. నిజాంపట్నం నుంచి సోనా బోటును కొత్తపట్నం తీసుకొచ్చే సమయంలో గుండాయపాలెం వచ్చే సరికి ఇంజన్ చెడిపోయి అక్కడే ఉండిపోయింది. దీంతో మత్స్యకార జేడీ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మూడు ఫైబర్ బోట్లను సిద్ధం చేసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రంలో గస్తీ తిరిగారు. మత్స్యకారులు, మెరైన్ సిబ్బంది, మత్స్యశాఖ అధికారులు సముద్రంలో 10 కిలో మీటర్ల దూరంలో వేటాడుతున్న చెన్నై సోనా బోట్ల సమీపానికి చేరుకున్నారు. అప్పుడు 16 బోట్లు వేటాడుతున్నాయి. వారి దగ్గరకు వెళ్లే కొద్దీ వారు వలలను వదిలేసి వేగంగా తమ ప్రాంతానికి తిరిగి వెళ్లడం ప్రారంభించారు. వారి వెంటబడి మరో 10 కిలో మీటర్ల దూరం తరిమి కొట్టారు. వారు వదిలి పెట్టి వెళ్లిన వలలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సముద్రంలో బోటు ద్వారా వెళ్లిన వారిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు సముద్ర తీర మత్స్యకార్మిక యూనియన్ అధ్యక్షుడు గొల్లపోతు నాగార్జున, జిల్లా మత్స్య శాఖ సహకార సంఘం అధ్యక్షుడు వాయల శ్రీనివాసరావు, కాపులు తంబు వెంకటేశ్వర్లు, సింగోతు వెంకటేశ్వర్లు, సైకం పోతురాజు, సొసైటీ అధ్యక్షుడు గొల్లపోతు పేరయ్య, పెదసింగు వెంకటేశ్వర్లు, కొక్కిలగడ్డ చిన్న లక్ష్మణ, మెరైన్ సీఐ కట్టా శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఏడీ ఉషాకిరణ్, ఎఫ్‌డీవో ఆషా, విలేజి ఫిషరీస్ అసిస్టెంట్లు, సాగర్ మిత్రలు, మెరైన్ పోలీసులు, మత్స్యకార సిబ్బంది ఉన్నారు. వారానికి ఒక రోజు సముద్రంలో గస్తీ వారానికి ఒక రోజు సముద్రంలో బోట్ల ద్వారా గస్తీ తిరిగితే చెన్నై బోట్లు మన ప్రాంతానికి రావటానికి భయపడతాయి. మన మత్స్య సంపద కోల్పోము. బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో మత్స్యకారులకు మంచి జరిగింది. ఆయనకు కృతజ్ఞతలు. – గొల్లపోతు నాగార్జున, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు మత్స్యకార్మిక యూనియన్ అధ్యక్షుడు బోట్ల ద్వారా ఎప్పుడూ తరిమికొట్టలేదు సోనా బోట్లను తరిమి కొట్టండి అని బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులకు మంచి సూచనలు ఇచ్చారు. ఇటువంటి ప్రయత్నం గతంలో ఎప్పుడూ చేయలేదు. ఆయన సొంత నగదు ఇస్తానని భరోసా ఇవ్వటం మత్స్యకారులకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా తరచూ బోట్ల ద్వారా సోనా బోట్లను వెంటాడితే స్థానిక మత్స్యకారులకు మేలు జరుగుతుంది. – వాయల శ్రీనివాసరావు, మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు -
బీటెక్ విద్యార్థిని ప్రేమవివాహం.. గ్రామంలోకి వచ్చి బలవంతంగా..
సాక్షి, ప్రకాశం(కొత్తపట్నం): వారు ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ అమ్మాయి కన్నవారికి నచ్చలేదు.. వెంటనే అమ్మాయి ఆచూకీ కనుగొని బలవంతంగా తీసుకెళ్లడానికి యత్నించగా గ్రామస్తులు అడ్డుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారందరినీ అదుపులోనికి తీసుకున్నారు. వివరాలు.. తమిళనాడుకు చెందిన జీవిత శివకుమారి గూడురు కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. కొత్తపట్నం మండలం గుండమాల గ్రామానికి చెందిన కారాని రాజేష్ తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శినానికి వెళ్లాడు. అదే సమయంలో చెన్నై నుంచి వారి బంధువులతో జీవిత శివకుమారి కూడా దర్శినానికి వచ్చింది. ఇలా ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమదాకా దారి తీసింది. ఇటీవల సింగరాయకొండలో వివాహం చేసుకున్నారు. తరువాత కొత్తపట్నం పోలీస స్టేషన్‌కు వచ్చి తమకు ప్రాణహాని ఉందని రక్షించాలని వేడుకున్నారు. అప్పటికే యువతి తల్లిదండ్రులు గూడూరు పోలీస్ స్టేషన్లో తమ కుమార్తె అదృశ్యం అయిందని ఫిర్యాదు చేశారు. వారు కొత్తపట్నంలో ఉన్నారని తెలుసుకున్న గూడూరు టూటౌన్ ఎస్సై, కొత్తపట్నం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇద్దరినీ తీసికెళతానని చెప్పాడు. వెంటనే గుండమాల గ్రామస్తులు కలుగచేసుకుని ఇద్దరూ మేజర్లు అయితే ఎలా తీసికెళతారని ప్రశ్నించారు. దీంతో ఏమీ చేయలేక ఎస్సై వెనుతిరిగాడు. అయితే వారం రోజుల తరువాత మళ్లీ కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇద్దరూ గూడూరు రావాలని కోరాడు. కానీ యువతి నిరాకరించడంతో ఆయన వెళ్లిపోయాడు. ఈ క్రమంలో గత నెల అక్టోబర్ 19న సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో చర్చిలో వివాహం చేసుకున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం గూడూరు నుంచి 30 మంది వాహనాల్లో వచ్చి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసికెళ్లారు. గ్రామస్తులు అడ్డగించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ కారాని జయరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దారిలోనే వారిని పోలీసులు అడ్డగించి ఒంగోలు టూటౌన్‌కు తీసుకొచ్చారు. అయితే పెండ్లి కుమార్తె తండ్రి కారాని శ్రీను.. కొత్తపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. తమ కోడలను ఆమె మేనమామలు భాస్కర్‌రెడ్డి, భరత్‌రెడ్డి మరి కొంత మంది బలవంతగా తీసికెళ్లారని యువకుని తండ్రి ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో ఎస్సై కొక్కిలగడ్డ మధుసూదన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అక్కడో మాట.. ఇక్కడో మాట.. అచ్చెన్న దొంగాట!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘వాడు(మామిడి గోవిందరావు) వచ్చి చంద్రబాబు నాయుడుకు ఒక చెక్కు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అది తీసుకున్నాడు. చెక్కు కాదు వాడు ఆస్తి రాసి ఇమ్మను. పార్టీ వాడుకుంటుంది. మామిడి గోవిందరావుకు టిక్కెట్టా... ఆ ఆలోచన ఎందుకు. కలలో కూడా అది ఉహిస్తారా... నా ప్రయత్నం ఏమిటంటే వాడు కూడా నీకు ఉపయోగపడతాడని, నీ చేతిలో పెట్టాలని నా ప్రయత్నం. నా ఆలోచన అదే. నేననేది వాడు చేయకపోయినా ఫర్వాలేదు. మన వెనక తిరిగినట్టు ఉంటే పార్టీ బలంగా ఉందన్న ఆ మెసేజ్ వెళతాది కదా?’ మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా నిమ్మాడలో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్న మాటలివి.’ చదవండి: గోరంట్ల మాధవ్ వీడియో అంశం: చెత్త వ్యూహంతో టీడీపీ దెబ్బ తిందా? ‘నువ్వేమీ బాధపడొద్దు. అక్కడ అలా అనక తప్పలేదు. నీకు ఎందుకు నేనున్నాను. కలమట వెంకటరమణ గురించి పట్టించుకోకు. నీ పని నువ్వు చేసుకో...’ మామిడి గోవిందరావుతో అదే కింజరాపు అచ్చెన్నాయుడు అన్న మాటలివి. పాతపట్నంలో టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోంది. ఎవరు ఎవర్ని ప్రోత్సహిస్తున్నారో, ఎవరు ఎవర్ని వాడుకుంటారో, అగ్ర నేతల మధ్య ఏ నేత బలి పశువు అవుతారో అంతు చిక్కని విధంగా తయారైంది. 2024 ఎన్నికల్లో తనకే టిక్కెట్ వస్తుందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ధీమాతో ఉన్నారు. తనకున్న సందేహాలను పార్టీ సమావేశాల్లోనూ, నిమ్మాడలోనూ నివృత్తి చేసుకున్నారు. కానీ అదే నియోజకవర్గంలో పార్టీ టిక్కెట్ రేసులో నేనున్నాంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి, సామాజిక వేత్త మామిడి గోవిందరావు దూకుడు చూపిస్తున్నారు. గెలుపోటములు పక్కన పెడితే కలమటను పక్కకు తప్పించడమే లక్ష్యంగా మామిడి జోరు చూపిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ తరఫున తిరుగుతున్నారు. కలమట వెంకటరమణకు ధీటుగా శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. పార్టీలు మారే కలమటను ఎవరు నమ్ముతారని, ఆయనైతే చిత్తు చిత్తుగా ఓడిపోతారంటూ మామిడి తనదైన శైలిలో పార్టీలో బలం పెంచుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా మామిడి గోవిందరావు తరచూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలవడం, సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీ ఫండ్ కోసం లక్షల రూపాయలు అందజేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా అచ్చెన్నాయుడు చెప్పినట్టుగా ఫండ్ కోసం మామిడి గోవిందరావును వాడుకుంటున్నారా? లేదంటే అచ్చెన్నాయుడును ఓవర్ టేక్ చేసి ముందు చూపుతో మామిడి గోవిందరావే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు రాక మానవు. అచ్చెన్నాయుడు అన్నట్టుగా మామిడి గోవిందరావును వాడుకోవడానికే తిప్పుకుంటున్నారని, ఎన్నికలు వచ్చాక కలమట వెంకటరమణ కోసం పనిచేయమని చెబుతారని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఓ వర్గం భావిస్తోంది. మరోవైపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని మామిడి గోవిందరావు వ్యూహాత్మకంగా లోకేష్‌తో సంబంధాలు పెట్టుకుని ఉండవచ్చనే అనుమానం మరో వర్గం వ్యక్తం చేస్తోంది. అచ్చెన్నాయుడు, లోకేష్ మధ్య పెద్దగా సంబంధాల్లేవని, అవకాశం వచ్చినప్పుడుల్లా పార్టీని, లోకేష్‌ను బజారు కీడ్చేలా మాట్లాడుతున్న అచ్చెన్నాయుడును నమ్మే పరిస్థితి లేదని, ఆయన చెప్పిన విధంగా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదని ఆ వర్గం భావిస్తోంది. అచ్చెన్నాయుడు విషయంలో అవకాశం కోసం లోకేష్ ఎదురు చూస్తున్నారని, అదను చూశాక దెబ్బ కొడతారని ఆ వర్గం గట్టిగా నమ్ముతోంది. అందుకనే అచ్చెన్నాయుడ్ని కాదని నేరుగా లోకేష్‌తో మామిడి గోవిందరావు సత్సంబంధాలు నెరుపుతున్నారనే వాదన ఉంది. అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తున్న కలమట వెంకటరమణను కాదని తనకే టిక్కెట్ ఇస్తారన్న బలమైన నమ్మకంతో ఖర్చుకు వెనకాడకుండా మామిడి ఆరాటపడుతున్నారని టీడీపీ నేతలంటున్నారు. మొత్తానికి పాతపట్నం టీడీపీలో టీడీపీ మాస్టర్ ప్లాన్ నడుస్తోంది. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మరో నేత మామిడి గోవిందరావు మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. పథకం ప్రకారం కూరలో కరివేపాకులా మామిడిని వాడుకుంటారా? లేదంటే కలమట వెంకటరమణను పక్కన పెట్టి మామిడికి సీటు ఇస్తారా? అన్నది వేచి చూడాలి. -
కొత్తపట్నం తీరప్రాంతంలో ఫిష్షింగ్ హార్బర్
సాక్షి, ఒంగోలు: జిల్లాలోని పది మండలాల పరిధిలో 102 కిలో మీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి 75 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల మత్స్యకారులు సముద్ర వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. మొత్తంగా 88 వేల మంది సముద్ర తీరం వెంబడి జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో 39 మెకనైజ్డ్ బోట్లు, మోటరైజ్డ్ బోట్లు 2,200, తెప్పలు 620 వరకు ఉన్నాయి. నెరవేరనున్న మత్స్యకారుల కల జిల్లా మత్స్యకారుల ఏళ్లనాటి కల వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నెరవేరనుంది. అందుకు జిల్లా కేంద్రం ఒంగోలుకు అతి సమీపంలో ఉన్న కొత్తపట్నం సముద్ర తీరం వేదిక కానుంది. మత్స్యకారుల సంప్రదాయ వృత్తి సముద్రపు వేటకు అనువైన వసతులు లేక జిల్లా మత్స్యకారులు నానా అవస్థలు పడుతున్నారు. మత్స్య పారిశ్రామికవేత్తలు, మత్స్యకార సంఘాల నేతలు ఎప్పటి నుంచో ఆశిస్తున్న కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఫిష్షింగ్ హార్బర్లలో జిల్లాలోని కొత్తపట్నంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేవు. నిజాంపట్నం వెళ్తున్న మత్స్య పారిశ్రామికవేత్తలు జిల్లాలోని సముద్ర తీరంలో మెకనైజ్డ్ బోట్లు (మర పడవలు) నిలుపుకునేందుకు హార్బర్ లేకపోవడంతో జిల్లాలోని మత్స్య పారిశ్రామిక వేత్తలు పక్క జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని ఫిష్షింగ్ హార్బర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. సముద్రంలో మూడు రకాల పడవలతో మత్స్య సంపద కోసం వేట సాగిస్తారు. వాటిలో ఒకటి తెరచాపలు, తెడ్ల సాయంతో సంప్రదాయ కొయ్య తెప్పల (కంట్రీ బోట్లు)తో వేట సాగిస్తారు. రెండోది ఆ కొయ్య తెప్పలకే మోటారు అమర్చి వేగంగా సముద్రంలోకి వెళ్లి వేట సాగించటం. ఈ రెండు రకాల బోట్లలో తెల్లవారు జామున వేటకు వెళ్తే మధ్యాహ్నానికో, సాయంత్రానికో తిరిగి ఇంటికి చేరుకోవాల్సిందే. అంతకు మించి సముద్రంలో ఉంటే మత్స్యకారులకు అన్నపానీయాలు ఉండవు. ఇక మూడో రకం మెకనైజ్డ్ బోట్లు. ఈ బోట్లలో రెండు, మూడు నెలలపాటు సముద్రంలో వేట కొనసాగించే విధంగా అన్నీ సమకూర్చుకొని సముద్రంలోకి వెళ్లవచ్చు. ఆ బోటులోనే ఉండేందుకు, పట్టిన మత్స్య సంపదను నిల్వ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఇలాంటి ఒక్కో బోటులో ఏడు నుంచి పది మంది వరకు మత్స్యకారులు వేట సాగించేందుకు వీలుంటుంది. అలాంటి మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేందుకు జిల్లాలో ఫిష్షింగ్ హార్బర్ లేక ఓడరేవు నుంచి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్లో నిలుపుకొంటున్నారు. సముద్రంలో వేటకు వెళ్లాలంటే మన జిల్లా నుంచి మత్స్యకారులు నిజాంపట్నం వెళ్లి అక్కడి నుంచి బోటులో సముద్రంలోకి వెళ్తారు. సముద్ర నియంత్రణ చట్టం ప్రకారం తీరం నుంచి ఆరు కిలో మీటర్లు అవతలే ఈ బోట్లు వేట సాగించాలి. ఉపాధి మెరుగుపడే అవకాశం జిల్లాలో ఫిష్షింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునే అవకాశం ఉంటే మత్స్య పారిశ్రామికవేత్తలు అలాంటి బోట్లు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తారు. జిల్లాలో ఆ అవకాశం లేకపోవడంతో కేవలం 39 మెకనైజ్డ్ బోట్లు మాత్రమే ఉన్నాయి. అదే ఇక్కడైతే వందల సంఖ్యలో బోట్లు కొనేందుకు అనేక మంది ముందుకొస్తారు. ఫలితంగా వేలాది మంది మత్స్యకార్మికులకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 26 వేల మంది సముద్రంలో వేటకు వెళ్తారు. అందులో కూడా దాదాపు 10 వేల మంది పక్క జిల్లాలు, చెన్నై, ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలసలు వెళ్తుంటారు. ఇక్కడే హార్బర్ ఏర్పాటు చేస్తే వలసలు వెళ్లాల్సిన పని ఉండదు. అంతేకాకుండా ప్రస్తుతం వేటకు వెళ్లే వారి సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మత్స్యకారులకు పూర్తి స్థాయిలో ఉపాధి: కొత్తపట్నం సముద్ర తీరంలో హార్బర్ ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు పూర్తి స్థాయిలో ఉపాధి దొరుకుతుంది. పక్క జిల్లాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఉన్న మత్స్య పారిశ్రామికవేత్తల కంటే ఇంకా ఎక్కువ మంది మెకనైజ్డ్ బోట్లలో వేట సాగించేందుకు ఆసక్తి చూపుతారు. దీనిద్వారా అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పడతాయి. మత్స్యకార యువత, మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మత్స్య సంపద ఉత్పత్తి కూడా ఐదు నుంచి పదిరెట్లు పెరిగే అవకాశం ఉంది. – ఆవుల చంద్రశేఖరరెడ్డి, జేడీ, మత్స్య శాఖ -
బాటిల్ మహల్
సాక్షి, ఒంగోలు: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కాలుష్య కారకాల్లో ప్లాస్టిక్ ఒకటి.. భూతాపాన్ని మరింతగా పెంచుతున్న ఈభూతం.. మానవ మనుగడకే మంట పెడుతోంది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రక్రియకు పునాదులు పడినా.. ఆచరణ అంతంతమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ప్రజలకు అవగాహన కల్పించేలా కొత్తపట్నం బీచ్‌లోని ఓ రిసార్ట్ నిర్వాహకులు భావించారు. వినూత్న రీతిలో ప్లాస్టిక్ బాటిల్ హౌస్ నిర్మించారు. కొత్తపట్నం బీచ్‌కు వచ్చే పర్యాటకులు తాగి పడేసిన 6,500 ఖాళీ సీసాలను ఇందుకువినియోగించారు. బాటిల్ మూతలను ఇంటి లోపలి భాగం గచ్చుపై వృత్తాకారంలో ఆకర్షణీయంగా పేర్చారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచిస్తూ చేపట్టిన ఈ నిర్మాణం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది చదవండి : కొండా.. కోనల్లో.. లోయల్లో.. -
ఈ భోజనం మాకొద్దు
సాక్షి, ఆలూరు (ప్రకాశం):‘ఈ పాడు భోజనం మాకొద్దు, మురిగిపోయిన గుడ్లు అలసలే వద్దు, తిరిగి తీసుకెళ్లండి’ అని ఆలూరు పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. భోజనం సక్రమంగా లేదని, కూరలు రుచిగా లేవని, వండిన గుడ్లు దుర్వాస వస్తున్నాయంటూ విద్యార్థులు ఆహారాన్ని కింద పడేయడం పరిపాటిగా మారింది. మంగళవారం ఎంపీడీఓ పి.సుజాత బూత్‌ల పరిశీలన కోసం వచ్చిన సందర్భంగా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో మధ్యాహ్నం భోజనం వచ్చింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ భోజనం బాగులేదని, చెడిపోయిన గుడ్లు పంపిస్తున్నారని, కూర రుచికరంగా లేదని కాంట్రాక్టరుకు ఇచ్చినప్పటి నుంచి ఇదే విధంగా కొనసాగుతోందని ఎంపీడీఓ దృష్టికి తీసికెళ్లారు. నాశిరకం భోజనం వండిపెడుతున్నారని, తాజా భోజనం వండిపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై నివేదిక తయారుచేసి జిల్లా అధికారుల దృష్టికి తీసికెళ్లతానని చెప్పారు. అనంతరం ఆలూరులో పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. పోలింగ్ బూత్‌లో విద్యుత్ ఉందా, ర్యాంపులు, తాగునీరు, మరుగుదొడ్లు ఉన్నాయా? లేదా? అని పరిశీలించారు. లేని వాటికి వెంటనే వేయించాలని ఆయా హెచ్ఎంలను ఆదేశింశారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం ఎల్వీఎన్ రమేష్, తోట రంగారావు, దొడ్ల రాజుగోపాల్‌రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
ఒక్క ఎకరా పండితే ఒట్టు..!
సాక్షి, కొత్తపట్నం (ప్రకాశం): భూమాత ఘోషిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో విత్తన విత్తు భూమిలోనే ఎండిపోయింది. పైకి అరకొరగా వచ్చిన మొక్కలు ఎదుగులేక చతికిలబడిపోతున్నాయి. ఫలితంగా మండలంలో వేల ఎకరాల్లో శనగ రైతులు కోట్లలో నష్టాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నామని, కానీ ఇలాంటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ తాము చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక్క గింజ కూడా రైతులు చేతికి రాలేదు. ఎన్నో ఆశలతో ఎంతో వ్యయప్రయాసలకోర్చి వేలకు వేలకు పెట్టుబడులు పెట్టిన రైతులకు ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భూతాపం..రైతులకు శాపం.. మండలంలో ఎక్కువగా సాగయ్యే పంటల్లో శనగ ఒకటి. ఇక్కడి ఇసుక భూముల్లో శనగ పంట వేలాది ఎకరాల్లో సాగు చేశారు. మండల పరిధిలోని ఆలూరు, గాదెపాలెం, కొత్తపట్నం, అల్లూరు, గవళ్లపాలెం, చింతల, రాజుపాలెం, ఈతముక్కల, మడనూరు, సంకువానికుంట గ్రామాల్లో సుమారు 8250 ఎకరాల్లో ఈ ఏడాది శనగ సాగు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నా రైతులు ఎంతో సాహసం చేసి ఎన్నో వ్యయప్రయాసలకొర్చి శనగ సాగు చేశారు. ఎకరాకు శనగ సాగుకు దుక్కి దున్నడం, విత్తనాలు ఎదపెట్టడం, ఎరువులు, కూలీ..ఇలా మొత్తం రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చయింది. కౌలు రైతులకు కౌలు అదనపు ఖర్చు. అయితే పంట వేసిన నాటి నుంచి ఒక్క చినుకు వర్షం కూడా కురవకపోవడంతో మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మొక్క కూడా బయటకు రాలేదు. అరకొరగా వచ్చిన మొక్క సైతం నీటి తడులు లేక ఎదుగుదల నిలిచిపోయింది. దీంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పంటను పశువులకు మేతగా వదిలేశారు. 8 వేల ఎకరాల్లో శనగ సాగు చేస్తే కనీసం ఒక్క గింజ కూడా చేతికి రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మండలంలోనే రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. పరిహారం ఎక్కడ..? పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి వ్యవసాయాధికారులు పొలాలకు వెళ్లి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రైతులకు నష్టపరిహారం విడుదల కాలేదు. దీంతో ప్రభుత్వం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల ఎకరాల్లో పంట నష్టపోయి మండలంలో కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లినా మా గురించి పట్టించుకునే వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నామని, కానీ గింజ కూడా చేతికి రాకుండా లేనంతగా ఎప్పుడూ లేదని, ఇలాంటి గడ్డు పరిస్థితులను తామెప్పుడూ చూడలేదని రైతులు పేర్కొంటున్నారు. బీమా అయినా వస్తుందా..? మండలంలోని 8 వేల ఎకరాల్లో శనగ సాగు చేసిన రైతుల్లో కొంత మంది బీమా కోసం ఎకరాకు రూ.330 ప్రీమియం చెల్లించారు. ఫసల్ బీమా పథకం కి,ద పంటనష్టం వాటిల్లితే ఎకరాకు రూ.22 వేల వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఇంత వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అసలు వస్తుందో రాదో కూడా అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వ్యవసాయాధికారి సుచిరితను వివరణ కోరగా.. మండలంలో సాగు చేసిన శనగ పంట పూర్తిగా నష్టపోయింది వాస్తవమేనన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు నష్టపోయిన పంట జాబితాను సిద్ధం చేసి పంపించామని తెలిపారు. ఫసల్ బీమా కింద ప్రీమియ, చెల్లించిన రైతులకు బీమా నగదు చెల్లించేలా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గింజ కూడా చేతికి రాలేదు నాలుగు ఎకరాల్లో శనగ సాగు చేశాను. మొత్తం రూ.50 వేల వరకు ఖర్చయింది. వేసిన పంట వేసినట్లే ఎండిపోయింది. గింజ కూడా చేతికి రాని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అధికారులన్నా గుర్తించి శనగ రైతులను ఆదుకోవాలి. - రాము, అల్లూరు అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు వ్యవసాయం మానేసి కూలి పనులకు వెళ్లడం మేలనిపిస్తుంది. వేలకు వేలు ఖర్చు చేస్తే రూపాయికి కూడా చేతికి రాలేదు. పంట మొత్తం పూర్తిగా నష్టపోయా. పంటల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. అధికారులు స్పందించి నష్టపరిహార, చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. - చిరుతోటి విద్యాసాగర్ -
నిమజ్జనం.. కలవరం!
ప్రకాశం, కొత్తపట్నం: ఒంగోలు నగరానికి సమీపంలో ఉన్న కొత్త పట్నం బీచ్ అంటే అందరికీ ఇష్టమే. అయితే తీరంలో వసతుల లేమితో పర్యాటకులతో పాటు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు ఎంలాంటి చర్యలు తీసుకోవడంలేదు. సముద్ర స్నానాకి వచ్చిన వారు ఉప్పు నీటి బట్టలతోనే తిరిగి ఇంటి బాట పడుతున్నారు. మంచి నీటితో స్నానం చేద్దామన్నా వసతి లేక తడి బట్టలతో అలాగే ఉండిపోతున్నారు. ఒంగోలు నగరం చుట్టు పక్కల గ్రామాల నుంచి కొత్తపట్నం బీచ్‌కు నిత్యం వేలాది మంది వస్తుంటారు. సెలవు దినాల్లో అయితే తాకిడి ఎక్కువగా ఉంటుంది. కార్తీక పౌర్ణమిలో నెలరోజులు, రంజాన్, బక్రీద్ వివిధ రకాల పండగలకు కూడా తీరం జనసంద్రంగా మారుతుంది. కొంత మంది బీచ్‌కు వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో సేదతీరుతుంటారు. అధికారులు కూడా కుటుంబ సభ్యులతో వస్తుంటారు. కానీ బీచ్‌లో ఎలాంటి సౌకర్యాలు కనిపించవు. బహిర్భూమికి వెళ్లాలంటే మరుగుదొడ్లు ఉపయోగంలో లేవు. ఉన్నా వాటికి తాళాలు వేసి ఉంచుతున్నారు. అత్యవసర సమయాల్లో మహిళలు ఆరుబయట మలవిసర్జన చేయాల్సిన దారుణ సందర్భాలు అనేకం. ఇక మహిళలు దుస్తులు మార్చుకోవడానికి, స్నానం చేయడానికి కూడా ఇబ్బందులే. చీరలు అడ్డం పడ్డుకుని స్నానం చేస్తున్న దుస్థితి కొత్తపట్నం బీచ్‌లో కొనసాగుతోంది. ఈ సమస్యను అనేక సార్లు అధికారులు దృష్టికి తీసికెళ్లినా పట్టించుకోవడంలేదని భక్తులంటున్నారు. 21 రోజులు.. వినాయ చవితి అనంతరం వేలాది విగ్రహాలు నిమజ్జనానికి కొత్తపట్నం బీచ్‌కు తరలివస్తుంటాయి. పండగ రోజు నుంచి 21 రోజులు పాటు నిమజ్జన ఘట్టం కొనసాగుతుంది. ఒక్కో వినాయకుడి వెంబడి ట్రాక్టుర్లు, లారీలు, ఆటోల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అలాగే సూరారెడ్డిపాలెం వైపు నుంచి ఈతముక్కల బీచ్‌కు వస్తారు. ఈ బీచ్ దగ్గర కూడా కనీసం వసతులు కల్పించలేదని భక్తులు వాపోతున్నారు. కొత్తపట్నం, ఈతముక్కల బీచ్‌లకు ఈ ఏడాది సుమారు 1200 గణేష్ విగ్రహాలు రానున్నట్లు అంచినవేస్తున్నారు. వాటి వెంట 1.50 లక్షల మంది భక్తులు సముద్రస్నానానికి రానున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. బీచ్ కాదు చెత్త కుప్పలవాడ తీరం వెంబడి పారిశుద్ధ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీచ్ రోడ్డు పొడవునా వలలు, పడవలు తీయకుండా అడ్డంగా ఉంచుతున్నారు. పది రోజుల నుంచి చాపలు పడటం వల్ల తీరం అంతా దుర్వాసన వస్తోంది. బ్లీచింగ్, సున్నం చల్లితే భక్తులకు ఇబ్బందులు ఉండవు. అలాగే పిచ్చి చెట్లు, కాగితాలు పేరుకుపోయాయి. పడవలు, వలలు తొలగించకపోతే విగ్రహాలను సముద్రంలోనికి తీసికెళ్లడానికి వీలుండదని భక్తులు చెబుతున్నారు. అవి తొలగిస్తే ట్రాఫిక్‌కు అంతరాయం కలగుకుండా భక్తులు త్వరగా వెళ్లడానికి వీలుంటుందని భక్తులు చెబుతున్నారు. -
ఒంగోలులో విషాదం: విద్యార్థుల గల్లంతు
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం బీచ్‌కు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ ఘటన జిల్లాలోని కొత్తపట్నం బీచ్‌లో గురువారం వెలుగుచూసింది. పది మంది విద్యార్థులు నేటి ఉదయం కొత్తపట్నం బీచ్‌లో విహారయత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి గల్లంతయ్యారు. గల్లంతయిన ఇద్దరిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మహ్మద్ అక్బర్ అల్తాఫ్ మృతదేహం లభించగా, ఒంగోలు ఎన్ఆర్ఐ కళాశాలలో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న నాగ పవన్ ఆచూకీ లభ్యంకాలేదు. నాగ పవన్ కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆక్రమణలో ప్రభుత్వ ఆసుపత్రి స్థలం
► ఎకరా స్థలాన్ని ఆక్రమించుకొని కట్టడాలు నిర్మించిన ఆక్రమణదారులు ► కళ్ల ముందే కట్టడాలు కడుతుంటే ప్రేక్షక పాత్ర వహించిన వైద్య సిబ్భంది ► సబ్‌సెంటర్‌ను ఆక్రమించుకున్న ఆక్రమణదారులు కొత్తపట్నం: ప్రభుత్వ స్థలాన్ని కాపాడిల్సిన ప్రజలే వైద్యశాల స్థలాన్ని ఆక్రమించున్నారు. పర్మినెంట్ కట్టడాలు నిర్మించుకున్నారు. వచ్చిన డాక్టర్లు పట్టించుకోవపోవడం ఆక్రమణదారులకు అడ్డుఅదుపు లేకుండ పోయింది. ప్రాధమిక స్థాయిలోనే చర్యలు తీసుకొనివుంటే హాస్పిటల్ స్థలం ఆక్రమణకు గురయ్యేది కాదని గ్రామస్తులు అంటున్నారు. కొత్తపట్నంలో మండల ఆరోగ్య కేంద్రానికి సర్వేనెంబర్ 1391లో రెండు ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించారు. అప్పటి కలెక్టర్ సునీల్‌శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. కొలతలు కొలిచి హద్దు రాళ్లు కూడ వేయటం జరిగింది. కొంత మంది ఆక్రమణదారులు సుమారు ఎకరా స్థలాన్ని ఆక్రమణ చేసుకొని పెద్ద షెడ్డును ఏర్పాటు చేసుకుంటే స్థానిక డాక్టర్లు కనిసం ఆక్రమణదారులకు నోటీసులు కూడ జారీ చేయకపోవటం స్థానికలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పంచాయతీ శాఖ అధికారులు ఇంటి పన్నులు కూడ వారికి హక్కు కల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతి రోజు డాక్టర్లు హాస్పిట్లకు వస్తుంటారు, వారి కళ్ల ముందే నిర్మిస్తుంటే కనీసం జిల్లా అధికారులకు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించకుండ నిర్లక్ష్యం వ్వహరించారు. అంతేకాక వైద్యశాల ముందు భాగాన్ని ఆక్రమించుకొని ఇనుప తీగతో పెన్సింగ్ వేసుకున్నాడాక్టర్లు పట్టించుకోలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. పలు సార్లుఈ విషయాన్ని వైద్య అధికారుల దృష్టికి తీసికెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. ఆక్రమణలో రెడ్డిపాలెం సబ్‌సెంటర్: కొత్తపట్నం రెడ్డిపాలెంలో సబ్‌సెంటర్ పూర్తిగా ఆక్రమణకు గురయ్యింది. బిల్డింగ్‌లో కొందరు నివాసం ఉంటున్నారు. వారికి పంచాయతీ అధికారులు గతంలో ఇంటి పన్నులు కూడ ఇచ్చి నివాస హక్కు కల్పించారు. ఆక్రమణదారులను ఖాళీ చేయమని అడిగితే ఆక్రమణదారులు మాకు హక్కుందని కోర్టులో పిటీషన్ వేశారు. ఈ స్థలాన్ని అప్పటిలో ఒక దాత సర్వే నెంబర్ 1429బిలో సుమారు 50 గదులు స్థలాన్ని ఉచితంగా సబ్సెంటర్కు బహుకరించారు. 30 సంవత్సరాలుదాక శిథిలావస్థకు చేరింది. ఇదే అదునుగా ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారు. జిల్లా అధికారులు స్పందించి మండల ఆరోగ్యకేంద్రం ఆస్తులను స్వాధీనం చేసుకోవలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. -
ట్రాక్టర్ బోల్తా: 10 మందికి గాయాలు
కొత్తపట్నం మండలం గుత్తికుండవారిపాలెంలో శుక్రవారం గణేష్ నిమజ్జనానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఆ ఘటనలో 10 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. దాంతో ఆ వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.