చెన్నై మత్స్యకారులు బరితెగించారు. ఎప్పటిలాగే మన సముద్ర తీర ప్రాంతం వైపు చొరబడ్డారు. అక్రమంగా మత్స్య సంపదను దోచుకుపోతున్నారు. పెద్ద పెద్ద బోట్లలో వచ్చి వేటాడటాన్ని మనవాళ్లు గుర్తించారు. సినిమాను తలపించే విధంగా నడిసంద్రంలో చెన్నై సోనాబోట్లను వెంటాడారు. తీరం నుంచి మెరైన్ పోలీసులు, మత్స్యకారులు, మత్స్యశాఖ సిబ్బంది 10 కిలో మీటర్లు సముద్రంలో ప్రయాణించి పెద్ద పెద్ద బోట్లతో నిబంధనలు అతిక్రమించి వేటాడుతున్న 16 బోట్లను వెంబడించి తరిమికొట్టారు. దీంతో వారు తోక ముడిచి వలలను వదిలి ఉడాయించారు. ఈ ఘటన బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొత్తపట్నం తీరంలో చోటుచేసుకుంది.
కొత్తపట్నం: గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరం వెంబడి చెన్నై సోనా బోట్లు నిబంధలకు విరుద్ధంగా వేట సాగిస్తున్నాయి. తీరానికి అతి దగ్గరలో 100 మీటర్ల దూరంలో తమిళనాడు మత్స్యకారులు వేట చేయడం పరిపాటిగా మారింది. వారి బోట్లు 40 అడుగుల ఎత్తులో, మన బోట్లు ఐదు అడుగుల ఎత్తులో ఉండటంతో వారిని స్థానిక మత్స్యకారులు కట్టడి చేయడం కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారులు, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పరిష్కారం కాలేదు.
బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో..
వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో చెన్నై సోనా బోట్లు అదుపు చేశారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు పెద్ద బోట్లలో తీరానికి దగ్గరగా వచ్చి మా సంపద కొల్లగొడుతున్నారని స్థానిక మత్స్యకారులు గత ఏడాది డిసెంబర్ 30న బాలినేని దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన కె.పల్లెపాలెం తీరానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. నిజాంపట్నంలో సోనా బోటును బాడుగకు తీసుకొచ్చి చెన్నై మత్స్యకారులు వేటాడుతున్న ప్రాంతానికి వెళ్లి భయపెట్టాలని, వారిని అక్కడ వేటాడకుండా చేయాలని, ఆ బోటుకు ఎంత ఖర్చయినా తాను పెట్టుకుంటానని జేడీ ఆవుల చంద్రశేఖరరెడ్డిని ఆదేశించారు.
తాజా వివాదం ఇలా..
బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు మత్స్యశాఖ అధికారులు స్పందించారు. నిజాంపట్నం నుంచి సోనా బోటును కొత్తపట్నం తీసుకొచ్చే సమయంలో గుండాయపాలెం వచ్చే సరికి ఇంజన్ చెడిపోయి అక్కడే ఉండిపోయింది. దీంతో మత్స్యకార జేడీ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మూడు ఫైబర్ బోట్లను సిద్ధం చేసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రంలో గస్తీ తిరిగారు. మత్స్యకారులు, మెరైన్ సిబ్బంది, మత్స్యశాఖ అధికారులు సముద్రంలో 10 కిలో మీటర్ల దూరంలో వేటాడుతున్న చెన్నై సోనా బోట్ల సమీపానికి చేరుకున్నారు.
అప్పుడు 16 బోట్లు వేటాడుతున్నాయి. వారి దగ్గరకు వెళ్లే కొద్దీ వారు వలలను వదిలేసి వేగంగా తమ ప్రాంతానికి తిరిగి వెళ్లడం ప్రారంభించారు. వారి వెంటబడి మరో 10 కిలో మీటర్ల దూరం తరిమి కొట్టారు. వారు వదిలి పెట్టి వెళ్లిన వలలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సముద్రంలో బోటు ద్వారా వెళ్లిన వారిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు సముద్ర తీర మత్స్యకార్మిక యూనియన్ అధ్యక్షుడు గొల్లపోతు నాగార్జున, జిల్లా మత్స్య శాఖ సహకార సంఘం అధ్యక్షుడు వాయల శ్రీనివాసరావు, కాపులు తంబు వెంకటేశ్వర్లు, సింగోతు వెంకటేశ్వర్లు, సైకం పోతురాజు, సొసైటీ అధ్యక్షుడు గొల్లపోతు పేరయ్య, పెదసింగు వెంకటేశ్వర్లు, కొక్కిలగడ్డ చిన్న లక్ష్మణ, మెరైన్ సీఐ కట్టా శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఏడీ ఉషాకిరణ్, ఎఫ్‌డీవో ఆషా, విలేజి ఫిషరీస్ అసిస్టెంట్లు, సాగర్ మిత్రలు, మెరైన్ పోలీసులు, మత్స్యకార సిబ్బంది ఉన్నారు.
వారానికి ఒక రోజు సముద్రంలో గస్తీ
వారానికి ఒక రోజు సముద్రంలో బోట్ల ద్వారా గస్తీ తిరిగితే చెన్నై బోట్లు మన ప్రాంతానికి రావటానికి భయపడతాయి. మన మత్స్య సంపద కోల్పోము. బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో మత్స్యకారులకు మంచి జరిగింది. ఆయనకు కృతజ్ఞతలు.
– గొల్లపోతు నాగార్జున, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు మత్స్యకార్మిక యూనియన్ అధ్యక్షుడు
బోట్ల ద్వారా ఎప్పుడూ తరిమికొట్టలేదు
సోనా బోట్లను తరిమి కొట్టండి అని బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులకు మంచి సూచనలు ఇచ్చారు. ఇటువంటి ప్రయత్నం గతంలో ఎప్పుడూ చేయలేదు. ఆయన సొంత నగదు ఇస్తానని భరోసా ఇవ్వటం మత్స్యకారులకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా తరచూ బోట్ల ద్వారా సోనా బోట్లను వెంటాడితే స్థానిక మత్స్యకారులకు మేలు జరుగుతుంది.
– వాయల శ్రీనివాసరావు, మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment