Sea shore
-
గాడ్జిల్లా గుడ్డేం కాదు!
వైరల్: జపాన్ తీరానికి కొట్టుకొచ్చిన వస్తువు ఒకదాని గురించి.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసే ఉంటుంది. బాగా మట్టికొట్టుకుపోయి.. లేత పసుపురంగులో బంతి ఆకారంలో ఉన్న ఆ వస్తువు ఏంటన్నదానిపై చర్చలు జరిగాయి. స్పై బెలూన్ అని, ఒక అడుగు ముందుకు వేసి కొందరైతే గాడ్జిల్లా గుడ్డు అంటూ చర్చించుకున్నారు కూడా. ఇదిలా ఉంటే.. హమామత్సు ప్రాంతం ఈ పరిణామంతో భయాందోళనకు గురైంది. అయితే.. ఎక్స్‌రే పరీక్ష ద్వారా ఇదేం పేలుడు పదార్థం కాదని అధికారులు నిర్ధారించారు. అంతేకాదు అది స్క్రాప్ మెటల్ అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. బహుశా సముద్రతీరంలో ఉపయోగించే వస్తువు అయ్యి ఉంటుందని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు అధికారులు. -
నడిసంద్రంలో బిగ్ ఫైట్.. చెన్నై బోట్లను తరిమేశారు!
చెన్నై మత్స్యకారులు బరితెగించారు. ఎప్పటిలాగే మన సముద్ర తీర ప్రాంతం వైపు చొరబడ్డారు. అక్రమంగా మత్స్య సంపదను దోచుకుపోతున్నారు. పెద్ద పెద్ద బోట్లలో వచ్చి వేటాడటాన్ని మనవాళ్లు గుర్తించారు. సినిమాను తలపించే విధంగా నడిసంద్రంలో చెన్నై సోనాబోట్లను వెంటాడారు. తీరం నుంచి మెరైన్ పోలీసులు, మత్స్యకారులు, మత్స్యశాఖ సిబ్బంది 10 కిలో మీటర్లు సముద్రంలో ప్రయాణించి పెద్ద పెద్ద బోట్లతో నిబంధనలు అతిక్రమించి వేటాడుతున్న 16 బోట్లను వెంబడించి తరిమికొట్టారు. దీంతో వారు తోక ముడిచి వలలను వదిలి ఉడాయించారు. ఈ ఘటన బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొత్తపట్నం తీరంలో చోటుచేసుకుంది. కొత్తపట్నం: గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరం వెంబడి చెన్నై సోనా బోట్లు నిబంధలకు విరుద్ధంగా వేట సాగిస్తున్నాయి. తీరానికి అతి దగ్గరలో 100 మీటర్ల దూరంలో తమిళనాడు మత్స్యకారులు వేట చేయడం పరిపాటిగా మారింది. వారి బోట్లు 40 అడుగుల ఎత్తులో, మన బోట్లు ఐదు అడుగుల ఎత్తులో ఉండటంతో వారిని స్థానిక మత్స్యకారులు కట్టడి చేయడం కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారులు, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పరిష్కారం కాలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో.. వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో చెన్నై సోనా బోట్లు అదుపు చేశారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు పెద్ద బోట్లలో తీరానికి దగ్గరగా వచ్చి మా సంపద కొల్లగొడుతున్నారని స్థానిక మత్స్యకారులు గత ఏడాది డిసెంబర్ 30న బాలినేని దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన కె.పల్లెపాలెం తీరానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. నిజాంపట్నంలో సోనా బోటును బాడుగకు తీసుకొచ్చి చెన్నై మత్స్యకారులు వేటాడుతున్న ప్రాంతానికి వెళ్లి భయపెట్టాలని, వారిని అక్కడ వేటాడకుండా చేయాలని, ఆ బోటుకు ఎంత ఖర్చయినా తాను పెట్టుకుంటానని జేడీ ఆవుల చంద్రశేఖరరెడ్డిని ఆదేశించారు. తాజా వివాదం ఇలా.. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు మత్స్యశాఖ అధికారులు స్పందించారు. నిజాంపట్నం నుంచి సోనా బోటును కొత్తపట్నం తీసుకొచ్చే సమయంలో గుండాయపాలెం వచ్చే సరికి ఇంజన్ చెడిపోయి అక్కడే ఉండిపోయింది. దీంతో మత్స్యకార జేడీ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మూడు ఫైబర్ బోట్లను సిద్ధం చేసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రంలో గస్తీ తిరిగారు. మత్స్యకారులు, మెరైన్ సిబ్బంది, మత్స్యశాఖ అధికారులు సముద్రంలో 10 కిలో మీటర్ల దూరంలో వేటాడుతున్న చెన్నై సోనా బోట్ల సమీపానికి చేరుకున్నారు. అప్పుడు 16 బోట్లు వేటాడుతున్నాయి. వారి దగ్గరకు వెళ్లే కొద్దీ వారు వలలను వదిలేసి వేగంగా తమ ప్రాంతానికి తిరిగి వెళ్లడం ప్రారంభించారు. వారి వెంటబడి మరో 10 కిలో మీటర్ల దూరం తరిమి కొట్టారు. వారు వదిలి పెట్టి వెళ్లిన వలలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సముద్రంలో బోటు ద్వారా వెళ్లిన వారిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు సముద్ర తీర మత్స్యకార్మిక యూనియన్ అధ్యక్షుడు గొల్లపోతు నాగార్జున, జిల్లా మత్స్య శాఖ సహకార సంఘం అధ్యక్షుడు వాయల శ్రీనివాసరావు, కాపులు తంబు వెంకటేశ్వర్లు, సింగోతు వెంకటేశ్వర్లు, సైకం పోతురాజు, సొసైటీ అధ్యక్షుడు గొల్లపోతు పేరయ్య, పెదసింగు వెంకటేశ్వర్లు, కొక్కిలగడ్డ చిన్న లక్ష్మణ, మెరైన్ సీఐ కట్టా శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఏడీ ఉషాకిరణ్, ఎఫ్‌డీవో ఆషా, విలేజి ఫిషరీస్ అసిస్టెంట్లు, సాగర్ మిత్రలు, మెరైన్ పోలీసులు, మత్స్యకార సిబ్బంది ఉన్నారు. వారానికి ఒక రోజు సముద్రంలో గస్తీ వారానికి ఒక రోజు సముద్రంలో బోట్ల ద్వారా గస్తీ తిరిగితే చెన్నై బోట్లు మన ప్రాంతానికి రావటానికి భయపడతాయి. మన మత్స్య సంపద కోల్పోము. బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో మత్స్యకారులకు మంచి జరిగింది. ఆయనకు కృతజ్ఞతలు. – గొల్లపోతు నాగార్జున, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు మత్స్యకార్మిక యూనియన్ అధ్యక్షుడు బోట్ల ద్వారా ఎప్పుడూ తరిమికొట్టలేదు సోనా బోట్లను తరిమి కొట్టండి అని బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులకు మంచి సూచనలు ఇచ్చారు. ఇటువంటి ప్రయత్నం గతంలో ఎప్పుడూ చేయలేదు. ఆయన సొంత నగదు ఇస్తానని భరోసా ఇవ్వటం మత్స్యకారులకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా తరచూ బోట్ల ద్వారా సోనా బోట్లను వెంటాడితే స్థానిక మత్స్యకారులకు మేలు జరుగుతుంది. – వాయల శ్రీనివాసరావు, మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు -
ఐదేళ్లు..ఐదొందలకోట్లు.!
సాక్షి, నెల్లూరు: గూడూరు డివిజన్లోని సముద్రతీర ప్రాంతంలో చిల్లకూరు, కోట మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల వరకు సిలికా భూములు విస్తరించి ఉన్నాయి. ఆయా భూముల్లో ఉన్న సిలికాపై జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశిం సునీల్‌కుమార్ కన్నేసి ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మైనింగ్‌కు అనుమతులు ఉన్న యజమానుల వద్ద లీజుల పేరుతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. చిల్లకూరు మండలంలో సుమారు 60 మైన్లు, కోట మండలంలో సుమారు 11 మైన్లను లీజుకు తీసుకున్నారు. వీటిలో ఇప్పటికే కొన్నింటికి కాలపరిమితి మించిపోయి ఉండగా కొన్నింటికి ఇంకా పదేళ్ల వరకు తవ్వకాలు చేసుకునే వీలుంది. దీనిని ఆసరా చేసుకున్న అధికారపార్టీ నాయకులు లీజుదారులను ప్రలోభపెట్టి వారి మీదనే మైన్లు ఉండగా అగ్రిమెంట్లు మీద మైన్లు సొంత చేసుకున్నారు. రూ.500 కోట్ల దోపిడీ సిలికా మైన్స్ లీజు పేరుతో కొన్ని, కాలపరిమితి అయినపోయిన మరికొన్ని మైన్స్ యజమానులను అదిరించి, బెదిరించి సొంతం చేసుకున్న అధికారపార్టీ నేతలు ఐదేళ్లపాటు యథేచ్ఛగా తవ్వకాలు జరిపారు. మైన్‌లో పరిమితికి మించి తవ్వకాలు జరపడంతో లోతైన గుంతలతోపాటు చెరువులను తలపించేలా భారీ యంత్రాలతో తవ్వేశారు. మొత్తం మీద 71 మైన్స్ ద్వారా సిలికాను తవ్వేసి నిత్యం 500 వాహనాలతో తరలించేవారు. చెన్నై, బెంగుళూరు, ముంబాయి, హైదరాబాద్, పూనే ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు తరలించేవారు. దీంతోపాటుç పక్క రాష్ట్రాల్లో పెద్ద భవంతుల నిర్మాణాలకు ఇసుక బదులుగా సిలికాను తరలించి సొమ్ము చేసుకున్నారు. సిలికా ఇసుకను పోలి ఉండడంతో దీనిని ఇసుకగా చూపి విక్రయించారు. దీంతో ఇక్కడ టన్ను రూ.600 వంతున దొరికే సిలికాను పక్క రాష్ట్రాల్లో టన్ను రూ.3 వేలకు పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రోజుకు సుమారు 500 లారీల వరకు సిలికాను తరలించేవారు. ఇలా ఐదేళ్లపాటు సిలికా తరలింపు ద్వారా దాదాపు రూ.500 కోట్ల వరకు నేతల జేబుల్లోకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కావడంతో గనులశాఖ అధికారులు సైతం సిలికా అక్రమ రవాణాకు రాచబాట వేసి వారిచ్చే నెలవారీ మామూళ్లతో సరిపెట్టుకున్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలు తూట్లు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు తూట్లు పొడిచేలా సిలికా మైన్స్‌లో దోపిడీ సాగింది. అనుమతులు ఉన్న మైన్స్‌కు హద్దులు ఏర్పాటు చేసి 10 అడుగులకు మించి తవ్వకాలు చేపట్ట వద్దని గతంలో ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అధికారపార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు కావడంతో వారు నిబంధనలు పాటించకున్నా అధికారులు పట్టించుకోలేదు. 10 అడుగులకు మించి గోతులు తీయకూడదనే నిబంధన ఉన్నా 40 అడుగుల తోతైన గుంతలు తవ్వేశారు. దీని వల్ల భూగర్భ జలమట్టం పూర్తిగా పడిపోయింది. అంతేకాదు కాలుష్యం వెదజల్లి భూగర్భజలాలు కలుషితమయ్యాయి. సాగు, తాగునీటికి కటకట సిలికా గనుల నుంచి వచ్చే ఊట నీటితో సొనకాలువలు ఎప్పుడూ నీటితో నిండి ఉండేవి. టీడీపీ పెద్దలు గనులను లీజులు తీసుకున్న తరువాత మండలంలో పలు గ్రామాలకు తాగు, సాగు అందించే 13 సొన కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో దాదాపు ఆయా కాలువల ద్వారా సాగయ్యే 2 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయిన దుస్థితి నెలకొంది. ఐదేళ్లపాటు కాలువలు ఎండి ఆ ప్రాంత రైతుల భూముల్లో పంటలు సాగు చేసుకోలేకపోయారు. సాగునీరుతోపాటు తాగునీటికి అష్టకష్టాలు పడ్డారు. వేసవి వస్తుందంటే తాగునీటికి ఆయా గ్రామస్తుల ఇబ్బందులు అన్నీఇన్నీకావు. -
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి దుర్మరణం
మెల్బోర్న్: భారతీయ విద్యార్థి ఒకరు సెల్ఫీ తీసు కుంటూ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోయి చనిపోయిన విషాద ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అంకిత్ అనే 20 ఏళ్ల భారతీయ విద్యార్థి పశ్చిమ ఆస్ట్రేలియాలోని అల్బనీ పట్టణం దగ్గర్లోని ప్రఖ్యాత పర్యాటక సముద్ర తీరం వద్ద ఉన్న రాళ్లపై స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు వెల్లడించారు. ఐదుగురు స్నేహితులతో కలిసి గురువారం అక్కడికి వెళ్లిన అంకిత్, అక్కడి రాళ్లపై ఉత్సాహంగా దూకుతూ ఉన్న సమయంలో, 40 అడుగుల ఎత్తైన రాతి శిఖరం నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
బతుకు నావ.. బంగారు తోవ
పసిడి జలసిరికి పంచెవన్నెల రంగులద్దినట్టు.. సముద్ర తీరంలో బంగారం పారుతున్నట్టు.. భలే ముచ్చటగా ఉంది కదూ ఈ చిత్రం. పడమటి సూరీడు నాగాయలంక సముద్ర తీరానికి ఇలా విలక్షణమైన వన్నెలద్దిన వేళ, బంగారు తరంగాలపై సాగే నావ.. ప్రకృతి గీసిన అద్భుత చి్రత్రం.. వెరసి.. మనిషి దిద్దిన మనోహరమైన మెరుగులా ఉంది కదూ. (నేడు మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా..) -
కూర్మాల మృత్యుఘోష..!!
కోడూరు : సముద్రంలో సందడి చేసే భారీ తాబేళ్లు హంసలదీవి బీచ్ దగ్గర నుంచి నాగాయలంకలోని ఎదురుమొండి వరకు సాగరతీరం వెంట నిత్యం పదుల సంఖ్యలో మృత్యువాతకు గురవుతున్నాయి. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల మరపడవలకు కింద భాగంలో ఉండే ఫ్యాన్ రెక్కలు తాబేళ్లకు తగిలి మృతిచెందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఆదివారం సాగరసంగమం ప్రాంతంలో సుమారు పది తాబేళ్ల కాళేబరాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. తాబేళ్లను పునరుత్పత్తి చేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసే అధికారులు, వాటి సంరక్షణ కోసం ఏవిధమైన చర్యలు తీసుకోవడం లేదని పర్యటకులు ఆరోపించారు. మత్స్యకారులకు తగిన సూచనలిచ్చి తాబేళ్ల ఉనికిని కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
తీరంలో తెల్లతాచు
నరసాపురం అర్బన్/మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీరంలో శనివారం తెల్లతాచు ప్రత్యక్షమైంది. 5 అడుగుల పొడవున్న ఈ పాము మొగల్తూరు మండలం ఇంజేటివారి పాలెం పుంత రోడ్డులో కనిపించింది. జనం అలికిడితో కొద్దిసేపు పడగవిప్పి, బుసలు కొట్టి హడావుడి చేసింది. తరువాత చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. అరుదైన తెల్ల తాచు నాగుల చవితికి ముందురోజు కనిపించడంతో స్థానికులు దానిని చూడటానికి ఆసక్తి కనబర్చారు. ఇండియన్ కోబ్రాగా పిలిచే తెల్లతాచు శాస్త్రీయ నామం నాజా నాజా అని నరసాపురం వైఎన్ కళాశాల ప్రిన్సిపాల్, జువాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ కేవీసీఎస్ అప్పారావు చెప్పారు. దీని వయసు 5 నుంచి 8 సంవత్సరాల వరకూ ఉంటుందన్నారు. ఆసియా ఖండంలోని భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో ఈ జాతి పాములు ఉంటాయన్నారు. మన రాష్ట్రంలో ఇలాంటి పాములు ఇటీవల కాలంలో కనిపించడం లేదని చెప్పారు. -
'అవగాహన లేకుండా మాట్లాడొద్దు'
విశాఖపట్నం: సముద్రతీరం కోతకు పోర్ట్ కారణమనడం సరికాదు విశాఖపట్నం పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు అన్నారు. అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజల్లో భయాందోళన రేగుతుందన్నారు. సంక్రాంతి సంబరాలకు రూ. 300 కోట్లు ఖర్చు పెడతామంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సముద్రం కోత నివారణ చర్యలకు డబ్బులు లేవనడం సరికాదన్నారు. డబ్బుల సమస్య లేదని ముఖ్యమంత్రి స్పష్టం చెప్పారని తెలిపారు. -
తీరంలో అపార చమురు నిక్షేపాలు?
కోడూరు-పెదపట్నం మధ్య సముద్రంలో చమురు నిల్వలు! 20 సంవత్సరాలుగా తీరం వెంబడి రిలయన్స్, ఓఎన్జీసీ పరిశోధనలు మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ,అనుబంధ పరిశ్రమల వెనక మర్మమిదే! మచిలీపట్నం: సముద్ర తీరంలో అపార చమురు, సహజవాయువు నిల్వలు ఉన్నాయా...పదేళ్లుగా ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలు ఈ ప్రాంతంలో చేసిన పరిశోధనల్లో అవన్నీ ఉన్నట్లు కనుగొన్నారా... కోడూరు మండలం నుంచి మచిలీపట్నం మండలం పెదపట్నం వరకు సముద్రంలో అపార చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించుకున్నారా.. అనంతరమే మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీని, అనుబంధ పరిశ్రమలను లక్ష కోట్ల వ్యయంతో మచిలీపట్నం పోర్టు పక్కనే ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నారా.. తదితర ప్రశ్నలు అందరి మెదడును తొలిచేస్తున్నాయి. ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాన మంత్రి నరేంద్రమోడిని కలిసిన సమయంలో మచిలీపట్నంలో లక్ష కోట్ల వ్యయంతో ఆయిల్ రిఫైనరీ, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. 20 ఏళ్లుగా పరిశోధనలు మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన తదితర ప్రాంతాల్లోని సముద్ర తీరాన్ని కేంద్రంగా చేసుకుని గత 20 సంవత్సరాలుగా ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలు కృష్ణా, గోదావరి బేసిన్లో చమురు, సహజవాయు నిక్షేపాల కోసం పరిశోధనలు చేస్తున్నాయి. కోడూరు- మచిలీపట్నం మధ్య సముద్రంలో చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలను ముమ్మరం చేశారు. ఈ పరిశోధనలు, ఏరియల్ సర్వేచేసే ఇంజినీర్ల కోసం ప్రతిరోజూ ఓ హెలికాఫ్టర్ మచిలీపట్నం మీదుగా తిరుగుతుండేది. సముద్రం అంతర్భాగంలో అపారమైన చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నా ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారని పలువురు ఇంజినీర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నామని, అక్కడి నిల్వలు తరిగిపోతున్న సమయానికి ఇక్కడ ఉన్న చమురు నిల్వలను వెలికితీసే పని ప్రారంభిస్తారని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పదేళ్ల క్రితమే అభిప్రాయ సేకరణ మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన తదితర ప్రాంతాల్లో చమురు, సహజవాయువుల ఆచూకీ ఉన్న నేపథ్యంలో ఇక్కడ తవ్వకాలు జరిపితే ప్రజలు ఏమైనా ఇబ్బందులు పెడతారా అనే విషయంపై పది సంవత్సరాల క్రితమే కలెక్టరేట్ వద్ద ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని పలువురు చెబుతున్నారు. అప్పుడే ఇక్కడ అపార చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని గుర్తించారని, ఇంతకాలం తరువాత వీటిని వెలికి తీసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారని ఇంజినీర్ల వాదనగా ఉంది. లక్ష కోట్లతో మచిలీపట్నం పోర్టుకు సమీపంలో ఆయిల్ రిఫైనరీ, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటుచేస్తామని ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో ఇక్కడ పెద్దమొత్తంలోనే చమురు, సహజవాయువు లభించే అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. లక్ష కోట్ల వ్యయంతో మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే జిల్లాకు చెందిన ఎందరికో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.దీంతో పాటు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలున్నాయి. ఇందుకోసం మన ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.