తీరంలో అపార చమురు నిక్షేపాలు?
కోడూరు-పెదపట్నం మధ్య సముద్రంలో చమురు నిల్వలు!
20 సంవత్సరాలుగా తీరం వెంబడి రిలయన్స్, ఓఎన్‌జీసీ పరిశోధనలు
మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ,అనుబంధ పరిశ్రమల వెనక మర్మమిదే!
మచిలీపట్నం: సముద్ర తీరంలో అపార చమురు, సహజవాయువు నిల్వలు ఉన్నాయా...పదేళ్లుగా ఓఎన్‌జీసీ, రిలయన్స్ సంస్థలు ఈ ప్రాంతంలో చేసిన పరిశోధనల్లో అవన్నీ ఉన్నట్లు కనుగొన్నారా... కోడూరు మండలం నుంచి మచిలీపట్నం మండలం పెదపట్నం వరకు సముద్రంలో అపార చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించుకున్నారా.. అనంతరమే మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీని, అనుబంధ పరిశ్రమలను లక్ష కోట్ల వ్యయంతో మచిలీపట్నం పోర్టు పక్కనే ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నారా.. తదితర ప్రశ్నలు అందరి మెదడును తొలిచేస్తున్నాయి. ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాన మంత్రి నరేంద్రమోడిని కలిసిన సమయంలో మచిలీపట్నంలో లక్ష కోట్ల వ్యయంతో ఆయిల్ రిఫైనరీ, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.
20 ఏళ్లుగా పరిశోధనలు
మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన తదితర ప్రాంతాల్లోని సముద్ర తీరాన్ని కేంద్రంగా చేసుకుని గత 20 సంవత్సరాలుగా ఓఎన్‌జీసీ, రిలయన్స్ సంస్థలు కృష్ణా, గోదావరి బేసిన్‌లో చమురు, సహజవాయు నిక్షేపాల కోసం పరిశోధనలు చేస్తున్నాయి. కోడూరు- మచిలీపట్నం మధ్య సముద్రంలో చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలను ముమ్మరం చేశారు. ఈ పరిశోధనలు, ఏరియల్ సర్వేచేసే ఇంజినీర్ల కోసం ప్రతిరోజూ ఓ హెలికాఫ్టర్ మచిలీపట్నం మీదుగా తిరుగుతుండేది. సముద్రం అంతర్భాగంలో అపారమైన చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నా ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారని పలువురు ఇంజినీర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నామని, అక్కడి నిల్వలు తరిగిపోతున్న సమయానికి ఇక్కడ ఉన్న చమురు నిల్వలను వెలికితీసే పని ప్రారంభిస్తారని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
పదేళ్ల క్రితమే అభిప్రాయ సేకరణ
మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన తదితర ప్రాంతాల్లో చమురు, సహజవాయువుల ఆచూకీ ఉన్న నేపథ్యంలో ఇక్కడ తవ్వకాలు జరిపితే ప్రజలు ఏమైనా ఇబ్బందులు పెడతారా అనే విషయంపై పది సంవత్సరాల క్రితమే కలెక్టరేట్ వద్ద ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని పలువురు చెబుతున్నారు. అప్పుడే ఇక్కడ అపార చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని గుర్తించారని, ఇంతకాలం తరువాత వీటిని వెలికి తీసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారని ఇంజినీర్ల వాదనగా ఉంది.
లక్ష కోట్లతో మచిలీపట్నం పోర్టుకు సమీపంలో ఆయిల్ రిఫైనరీ, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటుచేస్తామని ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో ఇక్కడ పెద్దమొత్తంలోనే చమురు, సహజవాయువు లభించే అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. లక్ష కోట్ల వ్యయంతో మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే జిల్లాకు చెందిన ఎందరికో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.దీంతో పాటు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలున్నాయి. ఇందుకోసం మన ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.