సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన పన్ను పోటుతో రిలయన్స్, ఓఎన్‌జీసీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్గతంగా ఇంధన కొరతను నివారించేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి పన్నులు, దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం లేదా విండ్‌ఫాల్ పన్ను విధించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓఎన్‌జీసీ షేర్లు శుక్రవారం కుప్పకూలాయి.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరడంతో భారీగా లాభపడిన చమురు ఉత్పత్తిదారులపై ఇండియా విండ్‌ఫాల్ పన్నును ప్రవేశ పెట్టింది. అలాగే గ్యాసోయిల్, గ్యాసోలిన్ జెట్ ఇంధనం దిగుమతులపై సుంకాలను విధించింది. దీంతో రిలయన్స్ స్టాక్ 8.7 శాతం వరకు పడిపోయింది. 2020, నవంబర్ 2 తరువాత ఇదే అతిపెద్ద ఇంట్రాడే పతనం. ఫలితంగా దేశంలోని ఆయిల్-టు-రిటైల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువలో 19.35 బిలియన్ డాలర్ల మేర తగ్గిందని రాయిటర్స్ నివేదించింది. బీఎస్‌ఈలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ 16.5 లక్షల కోట్లుగా ఉంది.
ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్‌జీసీ ఏకంగా 12.3 శాతం క్షీణించింది 2020 మార్చి 23 తరువాత ఇదే అతిపెద్ద పతనం. ఆయిల్ ఇండియా దాదాపు 11 శాతం క్షీణించగా, మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్ 10 శాతం క్షీణించాయి.
కాగాపెట్రోల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లీటరుకు రూ. 6, డీజిల్ ఎగుమతిపై లీటర్‌కు రూ. 13 పన్ను విధించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ. 23,250 అదనపు పన్ను విధించింది. మరోవైపు డాలర్‌తో రూపాయి శుక్రవారం మరో ఆల్‌టైమ్ కనిష్టం 79.11కి చేరుకుంది, గత కొన్ని వారాలుగా ఆల్ టైమ్ కనిష్టానికి చేరుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment