కొత్తపట్నం సముద్ర తీరం
సాక్షి, ఒంగోలు: జిల్లాలోని పది మండలాల పరిధిలో 102 కిలో మీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి 75 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల మత్స్యకారులు సముద్ర వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. మొత్తంగా 88 వేల మంది సముద్ర తీరం వెంబడి జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో 39 మెకనైజ్డ్ బోట్లు, మోటరైజ్డ్ బోట్లు 2,200, తెప్పలు 620 వరకు ఉన్నాయి.
నెరవేరనున్న మత్స్యకారుల కల
జిల్లా మత్స్యకారుల ఏళ్లనాటి కల వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నెరవేరనుంది. అందుకు జిల్లా కేంద్రం ఒంగోలుకు అతి సమీపంలో ఉన్న కొత్తపట్నం సముద్ర తీరం వేదిక కానుంది. మత్స్యకారుల సంప్రదాయ వృత్తి సముద్రపు వేటకు అనువైన వసతులు లేక జిల్లా మత్స్యకారులు నానా అవస్థలు పడుతున్నారు. మత్స్య పారిశ్రామికవేత్తలు, మత్స్యకార సంఘాల నేతలు ఎప్పటి నుంచో ఆశిస్తున్న కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీర్చనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఫిష్షింగ్ హార్బర్లలో జిల్లాలోని కొత్తపట్నంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేవు.
నిజాంపట్నం వెళ్తున్న మత్స్య పారిశ్రామికవేత్తలు
జిల్లాలోని సముద్ర తీరంలో మెకనైజ్డ్ బోట్లు (మర పడవలు) నిలుపుకునేందుకు హార్బర్ లేకపోవడంతో జిల్లాలోని మత్స్య పారిశ్రామిక వేత్తలు పక్క జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని ఫిష్షింగ్ హార్బర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. సముద్రంలో మూడు రకాల పడవలతో మత్స్య సంపద కోసం వేట సాగిస్తారు. వాటిలో ఒకటి తెరచాపలు, తెడ్ల సాయంతో సంప్రదాయ కొయ్య తెప్పల (కంట్రీ బోట్లు)తో వేట సాగిస్తారు. రెండోది ఆ కొయ్య తెప్పలకే మోటారు అమర్చి వేగంగా సముద్రంలోకి వెళ్లి వేట సాగించటం. ఈ రెండు రకాల బోట్లలో తెల్లవారు జామున వేటకు వెళ్తే మధ్యాహ్నానికో, సాయంత్రానికో తిరిగి ఇంటికి చేరుకోవాల్సిందే. అంతకు మించి సముద్రంలో ఉంటే మత్స్యకారులకు అన్నపానీయాలు ఉండవు. ఇక మూడో రకం మెకనైజ్డ్ బోట్లు. ఈ బోట్లలో రెండు, మూడు నెలలపాటు సముద్రంలో వేట కొనసాగించే విధంగా అన్నీ సమకూర్చుకొని సముద్రంలోకి వెళ్లవచ్చు.
ఆ బోటులోనే ఉండేందుకు, పట్టిన మత్స్య సంపదను నిల్వ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఇలాంటి ఒక్కో బోటులో ఏడు నుంచి పది మంది వరకు మత్స్యకారులు వేట సాగించేందుకు వీలుంటుంది. అలాంటి మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేందుకు జిల్లాలో ఫిష్షింగ్ హార్బర్ లేక ఓడరేవు నుంచి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో నిలుపుకొంటున్నారు. సముద్రంలో వేటకు వెళ్లాలంటే మన జిల్లా నుంచి మత్స్యకారులు నిజాంపట్నం వెళ్లి అక్కడి నుంచి బోటులో సముద్రంలోకి వెళ్తారు. సముద్ర నియంత్రణ చట్టం ప్రకారం తీరం నుంచి ఆరు కిలో మీటర్లు అవతలే ఈ బోట్లు వేట సాగించాలి.
ఉపాధి మెరుగుపడే అవకాశం
జిల్లాలో ఫిష్షింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునే అవకాశం ఉంటే మత్స్య పారిశ్రామికవేత్తలు అలాంటి బోట్లు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తారు. జిల్లాలో ఆ అవకాశం లేకపోవడంతో కేవలం 39 మెకనైజ్డ్ బోట్లు మాత్రమే ఉన్నాయి. అదే ఇక్కడైతే వందల సంఖ్యలో బోట్లు కొనేందుకు అనేక మంది ముందుకొస్తారు. ఫలితంగా వేలాది మంది మత్స్యకార్మికులకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 26 వేల మంది సముద్రంలో వేటకు వెళ్తారు. అందులో కూడా దాదాపు 10 వేల మంది పక్క జిల్లాలు, చెన్నై, ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలసలు వెళ్తుంటారు. ఇక్కడే హార్బర్ ఏర్పాటు చేస్తే వలసలు వెళ్లాల్సిన పని ఉండదు. అంతేకాకుండా ప్రస్తుతం వేటకు వెళ్లే వారి సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.
మత్స్యకారులకు పూర్తి స్థాయిలో ఉపాధి:
కొత్తపట్నం సముద్ర తీరంలో హార్బర్ ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు పూర్తి స్థాయిలో ఉపాధి దొరుకుతుంది. పక్క జిల్లాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఉన్న మత్స్య పారిశ్రామికవేత్తల కంటే ఇంకా ఎక్కువ మంది మెకనైజ్డ్ బోట్లలో వేట సాగించేందుకు ఆసక్తి చూపుతారు. దీనిద్వారా అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పడతాయి. మత్స్యకార యువత, మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మత్స్య సంపద ఉత్పత్తి కూడా ఐదు నుంచి పదిరెట్లు పెరిగే అవకాశం ఉంది.
– ఆవుల చంద్రశేఖరరెడ్డి, జేడీ, మత్స్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment