బీచ్ ఆవరణలో వినాయక నిమజ్జనానికి అడ్డంగా ఉన్న వలలు, పడవలు
ప్రకాశం, కొత్తపట్నం: ఒంగోలు నగరానికి సమీపంలో ఉన్న కొత్త పట్నం బీచ్ అంటే అందరికీ ఇష్టమే. అయితే తీరంలో వసతుల లేమితో పర్యాటకులతో పాటు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు ఎంలాంటి చర్యలు తీసుకోవడంలేదు. సముద్ర స్నానాకి వచ్చిన వారు ఉప్పు నీటి బట్టలతోనే తిరిగి ఇంటి బాట పడుతున్నారు. మంచి నీటితో స్నానం చేద్దామన్నా వసతి లేక తడి బట్టలతో అలాగే ఉండిపోతున్నారు. ఒంగోలు నగరం చుట్టు పక్కల గ్రామాల నుంచి కొత్తపట్నం బీచ్‌కు నిత్యం వేలాది మంది వస్తుంటారు. సెలవు దినాల్లో అయితే తాకిడి ఎక్కువగా ఉంటుంది. కార్తీక పౌర్ణమిలో నెలరోజులు, రంజాన్, బక్రీద్ వివిధ రకాల పండగలకు కూడా తీరం జనసంద్రంగా మారుతుంది.
కొంత మంది బీచ్‌కు వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో సేదతీరుతుంటారు. అధికారులు కూడా కుటుంబ సభ్యులతో వస్తుంటారు. కానీ బీచ్‌లో ఎలాంటి సౌకర్యాలు కనిపించవు. బహిర్భూమికి వెళ్లాలంటే మరుగుదొడ్లు ఉపయోగంలో లేవు. ఉన్నా వాటికి తాళాలు వేసి ఉంచుతున్నారు. అత్యవసర సమయాల్లో మహిళలు ఆరుబయట మలవిసర్జన చేయాల్సిన దారుణ సందర్భాలు అనేకం. ఇక మహిళలు దుస్తులు మార్చుకోవడానికి, స్నానం చేయడానికి కూడా ఇబ్బందులే. చీరలు అడ్డం పడ్డుకుని స్నానం చేస్తున్న దుస్థితి కొత్తపట్నం బీచ్‌లో కొనసాగుతోంది. ఈ సమస్యను అనేక సార్లు అధికారులు దృష్టికి తీసికెళ్లినా పట్టించుకోవడంలేదని భక్తులంటున్నారు.
21 రోజులు..
వినాయ చవితి అనంతరం వేలాది విగ్రహాలు నిమజ్జనానికి కొత్తపట్నం బీచ్‌కు తరలివస్తుంటాయి. పండగ రోజు నుంచి 21 రోజులు పాటు నిమజ్జన ఘట్టం కొనసాగుతుంది. ఒక్కో వినాయకుడి వెంబడి ట్రాక్టుర్లు, లారీలు, ఆటోల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అలాగే సూరారెడ్డిపాలెం వైపు నుంచి ఈతముక్కల బీచ్‌కు వస్తారు. ఈ బీచ్ దగ్గర కూడా కనీసం వసతులు కల్పించలేదని భక్తులు వాపోతున్నారు. కొత్తపట్నం, ఈతముక్కల బీచ్‌లకు ఈ ఏడాది సుమారు 1200 గణేష్ విగ్రహాలు రానున్నట్లు అంచినవేస్తున్నారు. వాటి వెంట 1.50 లక్షల మంది భక్తులు సముద్రస్నానానికి రానున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.
బీచ్ కాదు చెత్త కుప్పలవాడ
తీరం వెంబడి పారిశుద్ధ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీచ్ రోడ్డు పొడవునా వలలు, పడవలు తీయకుండా అడ్డంగా ఉంచుతున్నారు. పది రోజుల నుంచి చాపలు పడటం వల్ల తీరం అంతా దుర్వాసన వస్తోంది. బ్లీచింగ్, సున్నం చల్లితే భక్తులకు ఇబ్బందులు ఉండవు. అలాగే పిచ్చి చెట్లు, కాగితాలు పేరుకుపోయాయి. పడవలు, వలలు తొలగించకపోతే విగ్రహాలను సముద్రంలోనికి తీసికెళ్లడానికి వీలుండదని భక్తులు చెబుతున్నారు. అవి తొలగిస్తే ట్రాఫిక్‌కు అంతరాయం కలగుకుండా భక్తులు త్వరగా వెళ్లడానికి వీలుంటుందని భక్తులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment