అక్కడ జోరువాన.. ఇక్కడ జీరోవాన
హైదరాబాద్ నగరంలో వర్షం అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక ప్రాంతంలో వర్షం విపరీతంగా పడితే.. ఆ పక్కనే ఉన్న ప్రాంతంలో ఒక్క చినుకు కూడా ఉండదు. అలాంటి విచిత్ర పరిస్థితే తాజాగా కనిపించింది. దిల్సుఖ్ నగర్ నుంచి వనస్థలిపురం వరకు విపరీతంగా వర్షం కురిసింది. రోడ్ల మీద నీళ్లు బాగా నిలిచిపోయాయి. పాదచారులతో పాటు వాహనచోదకులు కూడా బాగా ఇబ్బందిపడ్డారు.
అయితే, వనస్థలిపురానికి పక్కనే ఉండే హయత్నగర్ ప్రాంతంలో మాత్రం అసలు వర్షమన్నదే కనిపించలేదు. విపరీతంగా మబ్బుపట్టి, ఏ క్షణంలో వర్షం పడిపోతుందో అన్నట్లు అనిపించింది. కానీ, పేరుకు ఒకటి రెండు చినుకులు పడి.. కామ్గా ఊరుకుంది. దాంతో, మంచి వర్షం పడుతుందని ఆశించిన వాళ్లంతా నిరాశకు గురయ్యారు. బయటకు వచ్చి చూస్తే, కూతవేటు దూరంలో మొత్తం కుంభవృష్టి. అలాగే నాగారం ప్రాంతంలో విపరీతంగా వర్షం పడింది, ఆ పక్కనే ఉన్న చర్లపల్లిలో మాత్రం ఒక్క చుక్క కూడా వాన పడలేదు. అదీ హైదరాబాద్లో పరిస్థితి.