కొండకరకాంలో ఇంకా ఉభాలు జరగని పంట పొలాలు కనికరించని వరుణుడు
ఆదుకోని అల్పపీడనం
Published Wed, Aug 31 2016 9:51 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
ఆగస్టులో 30మండలాల్లో చినుకు జాడ కరువు
అంతంతమాత్రంగా వరినాట్లు.. ఉభాలపై ప్రభావం
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రమంతా వర్షాలు అదరగొట్టేస్తుంటే... ఇక్కడ చిన్నపాటి జల్లులే పడుతున్నాయి. నీటి తడికోసం అల్లాడుతున్న వరినారుమళ్లు... నెర్రెలుగా మారుతున్నాయి. అదను దాటుతున్నా... చినుకు జాడ కరువై అన్నదాత అల్లాడుతున్నాడు. ఉభాలు వేసే సాహసం చేయలేక... నారుమళ్లు బతికించుకోలేక సతమతమవుతున్నాడు. అల్పపీడన ప్రభావం వల్ల జిల్లాలో ఐదారు రోజులుగా చెదురుమదురుగా కురుస్తున్న చిన్నపాటి వానలు అన్నదాతను ఆదుకోలేకపోయాయి. ఆగస్టు నెల వర్షపాతం లోటులోనే ఉంది. 30మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నట్లు ప్రణాళికాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖరీఫ్ మూడు నెలలకు సంబంధించి మాత్రం సాధారణ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఆగస్టు నెలలో మెంటాడ, గజపతినగరం, బొండపల్లి, గుర్ల మండలాల్లో మాత్రమే సాధారణ వర్షాలు పడ్డాయి. మిగతా 30మండలాల్లో గురుగుబిల్లి, సీతానగరం, బలిజిపేట, చీపురుపల్లి, వేపాడ మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మిగతాచోట్ల వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి.
వరిపంటపై తీవ్ర ప్రభావం
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు వరిపైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏనెలలో వర్షాలు సక్రమంగా లేకపోయినా పంటలు నష్టపోక తప్పదు. కీలకమైన ఆగస్టులో వర్షపాతం జిల్లాలో చాలా తక్కువగా నమోదైంది. ఈ నెలలో మొత్తం 6,634.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 4078.3మిల్లీమీటర్లే నమోదైంది. సగటున చూస్తే 195.1 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా 120మిల్లీమీటర్లు పడింది. కొన్ని మండలాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ నెలాఖరు, జులై ఆరంభంలో వరినారు పోసిన విషయం విదితమే. జులై నెలాఖరు నాటికి ఉభాలు జరిగి నాట్లు పడాలి. కానీ వర్షాలు సక్రమంగా పడకపోవడం వల్ల అవి ఊపందుకోలేదు. వరినారు కొన్ని చోట్ల పూర్తిగా పోగా మరికొన్ని చోట్ల ముదిరిపోయింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నాలుగైదు రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు ముదిరిన వరినారుతోనే ఉభాలు కానిచ్చేస్తున్నారు. సెప్టెంబర్, ఆక్టోబర్‌లో వర్షాలు అనుకూలించినా పూర్తిస్థాయి దిగుబడి రావడం కష్టమే.
మూడు నెలల్లో సాధారణం
ఖరీఫ్‌లో ఇప్పటివరకు ముగిసిన జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాలు సాధారణంగా నమోదయ్యాయి. సగటున జూన్‌లో 128.4 మిల్లీమీటర్లుకు 182.7మిల్లీమీటర్లు, జూలైలో 178.7మిల్లీమీటర్లకు 184.6మిల్లీమీటర్లు పడింది. ఆగస్టు నెలలో 195.1మిల్లీమీటర్లుకు 120మిల్లీమీటర్లు నమోదు కావడంతో మూడు నెలల్లో సగటున సాధారణ వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూస్తే 502.2మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 487.2మిల్లీమీటర్లు నమోదైంది. ఈ లెక్కన ఇప్పటివరకు కురవాల్సిన వర్షాల కంటే కేవలం 3శాతం మాత్రమే తక్కువ నమోదైంది. అయినా వరిపంటకు ఫలితం లేకపోయింది. రైతులకు అవసరమైన సమయంలో పడకపోవడంతో ఉభాలు సరిగ్గా జరగలేదు. కురుస్తున్న వర్షాలు కరువు ప్రకటనకు విఘాతం కలిగిస్తాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే పంటలు కోల్పోయిన రైతన్నకు సర్కారునుంచి ఊరట లభించే అవకాశం కానరావడంలేదు.
Advertisement
Advertisement