ఖరీఫ్ సీజన్‌లో అప్పుడే రెండున్నర నెలలు గడచిపోయాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. సిద్ధం చేసుకున్న నారుమడులు ఎండిపోతున్నాయి. నీటితడులున్న ప్రాంతాల్లో వరినాట్లు వేసినా... మండుతున్న ఎండలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రాజెక్టుల ఎగువప్రాంతాల్లో అరకొరగా కురిసిన వర్షాలవల్ల నీటిమట్టాలు పెరగడం లేదు. మరో నెల రోజుల్లో విస్తారంగా వర్షాలు కురవని పక్షంలో ఇక కరువు పరిస్థితులు తలెత్తకమానవని రైతాంగం ఆందోళన చెందుతోంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నా యి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారా యి. జిల్లాలో శుక్రవారం 3.1మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జలాశయాల్లో 70 శాతానికి మించి నీటి మట్టం లేదు. దీనివల్ల సాగు అవసరాలకు నీటిని విడుదల చేయలేకపోతున్నారు. ఇప్పటికే నాట్లు వేయడం ఆలస్యమైంది. వాటికి ఆశించిన మేర నీరు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. నీరు లేక ఇంకా కొన్నిచోట్ల నాట్లు పడనేలేదు. ఈ వారం దాటిపోతే ఇక నాట్లు వేసినా ప్రయోజనం ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. జిల్లాలో వరి పంట సాధారణ విస్తీర్ణం 1,22,977 హెక్టార్లు కాగా ఇంతవరకూ 35,519 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఇందులో 22,875 హెక్టార్లలో వెదజల్లే పద్ధతిని అనుసరించారు. 12,644 హెక్టార్లలో వరి నాట్లు వేశా రు. నాట్లు వేసిన చోట వరి పంట ఎండిపోతోం ది. దత్తిరాజేరు మండలంలో కొన్ని చోట్ల నారు ఎండుతున్నట్టు వ్యవసాయ అధికారుల దృష్టికి కూడా వచ్చింది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడానికి ఈ నెల 15వ తేదీ వరకు చూడాలని వ్యవసాయశాఖ కమిషనర్ చెప్పినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ఆందోళనకరంగా జలాశయాలు..
జిల్లాలో జలాశయాలున్నప్పటికీ వాటిలో సరిపడా నీరులేదు. పెద్ద గెడ్డ నీటిని నేటికీ విడుదల చేయలేదు. వెంగళరాయ సాగర్ నీటిని విడుదల చేసినా తక్కువ స్థాయిలో ఆరుతడి పంటలకు పనికివచ్చేలా విడుదల చేస్తున్నారు. వీఆర్‌ఎస్ కాలువలు 23 కిలోమీటర్ల పొడవయితే వారం రోజుల క్రితం విడుదల చేసిన సాగునీరు బొబ్బిలి మండలానికి శుక్రవారమే చేరింది. 12వ కిలోమీటర్ వద్దే సాగునీరు ఇంకా ఉండటంతో వర్షాలు పడకుంటే జలాశయంలో ఉన్న కొద్ది పాటి నీరు కూడా అయిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
కంటితుడుపు వానలు..
జిల్లాలో కురుస్తున్న వర్షాలు కేవలం కంటి తుడుపుగానే ఉన్నాయి. శుక్రవారం నమోదైన వర్షపాతం వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలోని 19 మండలాల్లో చుక్క రాలలేదు. కురిసిన చోట కూడా మెంటాడలో 32.2 మిల్లీమీటర్లు, పాచిపెంటలో 21.4 మిల్లీమీటర్లు, బొండపల్లిలో 18.2 మిల్లీమీటర్లు మినహా మిగిలిని అన్ని మండలాల్లో 1.2 మిల్లీమీటర్లు నుంచి 8.2 మిల్లీమీటర్ల వరకే నమోదైంది.
వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం..
జిల్లాలో వర్షాలు లేకపోవడం వల్ల రిజర్వాయర్లలోని నీటిని కూడా విడిచిపెట్టే సాహసం చేయలేకపోతున్నాం. పెద్ద గెడ్డ నీటిని నేటికీ విడిచిపెట్టలేకపోయాం. జిల్లాలో ఉన్న మొత్తం రిజర్వాయర్లన్నిటిలో 70 శాతం లోపే నీటి నిల్వలున్నాయి. వర్షాలు పడుతూ తెరిపి ఇ చ్చినప్పుడు వినియోగించే ప్రాజెక్టులే మనవి. పూర్తిగా రిజర్వాయర్ల నీటిని వినియోగించుకునే అవకాశం లేదు. వర్షాలు కురుస్తాయని ఎదురు చూస్తున్నాం.
– కె.రాంబాబు, ఎస్‌ఈ, బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్.
Comments
Please login to add a commentAdd a comment