vijayanagarm
-
మరో మూడు జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. మరో మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులుగా శత్రుచర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.ఇదీ చదవండి: ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్కాగా, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, (ఎమ్మెల్సీ), నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఖలీల్ అహ్మద్ నియమితులయిన సంగతి తెలిసిందే. -
పట్టాలపై పసికందు
కొత్తవలస రూరల్: అప్పుడే పుట్టిన పసికందును రైలు పట్టాల పక్కన విడిచి వెళ్లిన సంఘటనతో కొత్తవలస ప్రజలు హతాశులయ్యారు. కొత్తవలస–విశాఖ రహదారిలో గల కరెంట్ ఆఫీస్ సమీపంలో గల రైల్వేట్రాక్ వద్ద ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ఓ పసికందును బ్యాగ్‌లో ఉంచి పడవేశారు. అక్కడే పండ్ల వ్యపారం చేస్తూ జీవనం సాగిస్తున్న మల్లి అనే వ్యక్తి బ్యాగ్‌లో ఉన్న శిశువును గుర్తించి, స్థానిక పరమేశ్వరి అస్పత్రికి తీసుకువెళ్లి వైద్యపరీక్షలు చేయించాడు. పొలీసుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఐసీడీఎస్ పీఓ బి.ఉర్మిళ, సూపర్వైజర్ సునీత ఆస్పత్రికి వచ్చి బిడ్డను స్వాధీనం చేసుకుని విజయనగరంలోని ఘోషాఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి, శిశుగృహకు అప్పగించారు. పసికందును వదిలి వేయడం అమానుషం అప్పుడే పట్టిన పసికందును రైల్వే ట్రాక్‌పై వదిలివేయడం అమానుషమని, సభ్యసమాజం తల దించుకునే చర్య అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తవలస రైల్వే ట్రాక్ పక్కన వదిలిపెట్టిన పసికందును ఘోషా ఆస్పత్రి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచిన సమాచారం తెలుసుకున్న ఆమె ఆస్పత్రికి వచ్చి పసికందును చూసి డాక్టర్‌ను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. -
టీడీపీలో రాజీనామాల పర్వం..
టీడీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ జిల్లాలోని కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో కార్యకర్తలు, నాయకుల్లో నైరాశ్యం ఆవహించింది. ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన పార్టీలో కొనసాగాలా.. వద్దా అన్న సందిగ్ధం నెలకుంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీకి జిల్లాలో గడ్డు పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రజాదరణ కోల్పోయిన పార్టీ ప్రతిష్ట క్రమక్రమంగా క్షీణిస్తోంది. అవసరం తీరిన తరువాత తన, మన అనే తేడా లేకుండా... సీనియర్లనే కనీస గౌరవం లేకుండా పూచిక పుల్లను వాడిప డేసినట్లు పక్కన పడేయడం ఆ పార్టీ అధినేతల సంప్రదాయం. దశాబ్దాలుగా అక్కడ అదే జరుగుతోంది. దీనిని జీర్ణీంచుకోలేని కొందరు సీనియర్లు పార్టీని వీడుతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉంటూ తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పడాల అరుణ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. చదవండి: టీడీపీకి అభ్యర్థులు కరువు.. బాబు హైరానా.. గజపతినగరంలోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 1985లో రాజకీయ రంగ ప్రవేశం చేశానని, ఎన్నో పదవులు చేపట్టి ప్రజలకు ఎంతో సేవ చేశానని, కానీ వాటిని ఈ రోజు తెలుగు దేశం పార్టీ కనీసం గుర్తించక పోవడం వల్లనే రాజీనామా చేస్తున్నానని అరుణ వివరించారు. మూడు దశాబ్దాలుగా ఆమెకు టీడీపీతో అనుబంధం ఉంది. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ నేతల బరితెగింపు.. 1987లో బొండపల్లి మండల అధ్యక్షురాలిగా, 1989, 1994లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1996లో మంత్రి పదవి చేపట్టారు. 1999 నుంచి చాలా పదవులు నిర్వహించారు. అంతటి క్రియాశీలకంగా ఉండే పడాల అరుణకు 2013 నుంచి పారీ్టలో ప్రాధాన్యం తగ్గడం మొదలైంది. ‘‘పార్టీ కోసం అంకిత భావంతో పని చేసిన నన్ను రోజురోజుకు గుర్తింపు లేనివిధంగా చేశారు’’... అంటూ ఆమె విలేకరుల ఎదుట కన్నీటిపర్యంతమవ్వడం టీడీపీలో సీనియర్లు, పారీ్టకి కట్టుబడి ఉన్నవారి పరిస్థితికి అద్ధం పట్టింది. అందిరిదీ అదే వేదన... ఒక్క అరుణకే ఈ పరిస్థితి కాదు. జిల్లాలో అనేక మంది టీడీపీ నాయకులు, సీనియర్ల పరిస్థితి కూడా ఇదే. మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావును కూడా ఇదే విధంగా పార్టీని వీడేలా చేశారు. ఆయన కూడా చాలా కాలం పాటు టీడీపీకి సేవచేసి, చివరికి తనకు పారీ్టలో కనీస గుర్తింపు లేదని మదనపడి రాజీనామా చేసి ఇటీవలే బయటకు వచ్చేశారు. ఆ తరువాత మరో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తిరుగుబావుటా ఎగురవేశారు. ఆమెకు ఇంకో ఎమ్మెలే కె.ఎ.నాయుడు జతకలిశారు. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్ష పదవిని జూనియర్ అయిన కిమిడి నాగార్జునకు ఇవ్వడాన్ని నిరసిస్తూ గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ. నాయుడు తానే వేరుగా విజయనగరం పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేశారు. ఆయన బాటలోనే విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కొందరు నేతలతో కలిసి ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకుని విజయనగరం పార్టీ కార్యాలయాన్ని స్థాపించారు. అప్పటికే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లాలో నగరపార్టీ కార్యాలయం నడుస్తోంది. ఈ పంచాయితీ టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదు. మీసాల గీతకు లభించాల్సిన గుర్తింపు ఇప్పటికీ దక్కలేదన్న వాదన వినిపిస్తోంది. పోనీ అశోక్ పెద్దరికమైనా నిలిచిందా అంటే అదీ లేదు. అశోక్మీద అమిత గౌరవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పార్టీ కార్యాలయం విషయంలో అశోక్ పెద్దరికాన్ని స్థానిక నేతలు ధిక్కరిస్తున్నా ఏమీ చేయలేదు. ఆయన గౌరవాన్ని కాపాడలేదు. ఈ విషయంలో సీనియర్‌గా అశోక్ తన అనుచరుల వద్ద వాపో యారు. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడైన మహంతి చిన్నంనాయుడు పార్టీ కార్యకలాపాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. ఇలా సీనియర్లకు, ముఖ్య నేతలకు టీడీపీలో విలువ ఉండకపోవడంతో ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. కొందరు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు. -
సాక్షి ఎఫెక్ట్: కొండలెక్కిన పీఓ..
సాలూరు: ఆయనో జిల్లా స్థాయి అధికారి.. ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకోవాలనే ఉత్సాహంతో కొండ కోనల్లో పర్యటించారు. కిలోమీటర్ల కొద్దీ నడిచి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. గిరిజనుల ఇబ్బందులపై ఈ నెల 25న ‘అరణ్య రోదన’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, ఇతర అధికారులు స్పందించారు. కొదమ పంచాయతీ పర్యటనకు బయలుదేరిన అధికారులు చింతామల జంక్షన్ వరకు చేరుకున్నారు. గ్రామస్తులు చందాలు పోగుచేసుకుని నిర్మించుకున్న రోడ్డు చినుకులకు బురదమయంగా మారడంతో వాహనాలు ముందుకెళ్లలేదు. దీంతో పీఓ కూర్మనాథ్, తదితరులు సుమారు మూడు కిలోమీటర్లు నడిచి చింతామల.. మరలా వెనుకకు వచ్చి బల్ల జంక్షన్ నుంచి మరో 5 కిలోమీటర్లు నడుచుకుని కొదమ పంచాయతీ గ్రామానికి చేరుకున్నారు. చింతామల, కొదమ గ్రామాలలో ప్రజలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అయితే గిరిజనులకు తెలుగు అంతగా రాకపోవడంతో స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు చోడిపల్లి బీసు ప్రజల మాటలను అధికారులకు.. అధికారుల వివరణను ప్రజలకు తర్జుమా చేసి చెప్పారు. రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు పాఠశాల, అంగన్వాడీ భవనాలు, చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. దీనికి పీఓ స్పందిస్తూ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర సూచనల మేరకు ఇక్కడి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా నంద నుంచి చింతామలకు రోడ్డు మంజూరైందని.. అయితే ఈ నిర్మాణం ఎందుకు పూర్తికాలేదో కారణాలు తెలుసుకుని పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. గిరిజన గ్రామాల్లో రహదారులు, వైద్యం, విద్యలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. చందాలతో వేసుకున్న చింతామల రోడ్డుకు సంబంధించి వారం రోజుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వచ్చే నెల 1వ తేదీన ప్రభుత్వ రేషన్ బియ్యం ఈ రెండు గ్రామాల్లో పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అటవీశాఖ అడ్డంకుల వల్ల గిరిశిఖర గ్రామాల్లో రహదారుల నిర్మాణం ముందుకు సాగడం లేదని, అధికారులు దీనిపై దృష్టి సారించాలని వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనువాసరావు కోరారు. గిరిజనులతో సహపంక్తి భోజనం.. కొదమలో స్థానిక గిరిజన నాయకులు ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంలో పీఓ కూర్మనాథ్, తదితరులు పాల్గొన్నారు. పీఓ తన వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను అక్కడి చిన్నారులు, మహిళలకు అందించారు. అలాగే ప్రజాచైతన్య వేదిక కన్వీనర్ కూనిశెట్టి అప్పలనాయుడు సమకూర్చిన రూ. 25 వేల నగదును యువతకు అందజేశారు. ఈ పర్యటనలో పీఓ కూర్మనాథ్ తన కుమారుడిని తీసుకువచ్చి గిరిజనుల ఆహార వ్యవహారాలు, కష్టసుఖాలను వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ కిరణ్‌కుమార్, డ్వామా పీడీ నాగేశ్వరరావు, తహసీల్దార్ ఇబ్రహీం, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఆశలు ఆ‘వరి’ !
ఖరీఫ్ సీజన్లో అప్పుడే రెండున్నర నెలలు గడచిపోయాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. సిద్ధం చేసుకున్న నారుమడులు ఎండిపోతున్నాయి. నీటితడులున్న ప్రాంతాల్లో వరినాట్లు వేసినా... మండుతున్న ఎండలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రాజెక్టుల ఎగువప్రాంతాల్లో అరకొరగా కురిసిన వర్షాలవల్ల నీటిమట్టాలు పెరగడం లేదు. మరో నెల రోజుల్లో విస్తారంగా వర్షాలు కురవని పక్షంలో ఇక కరువు పరిస్థితులు తలెత్తకమానవని రైతాంగం ఆందోళన చెందుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నా యి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారా యి. జిల్లాలో శుక్రవారం 3.1మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జలాశయాల్లో 70 శాతానికి మించి నీటి మట్టం లేదు. దీనివల్ల సాగు అవసరాలకు నీటిని విడుదల చేయలేకపోతున్నారు. ఇప్పటికే నాట్లు వేయడం ఆలస్యమైంది. వాటికి ఆశించిన మేర నీరు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. నీరు లేక ఇంకా కొన్నిచోట్ల నాట్లు పడనేలేదు. ఈ వారం దాటిపోతే ఇక నాట్లు వేసినా ప్రయోజనం ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. జిల్లాలో వరి పంట సాధారణ విస్తీర్ణం 1,22,977 హెక్టార్లు కాగా ఇంతవరకూ 35,519 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఇందులో 22,875 హెక్టార్లలో వెదజల్లే పద్ధతిని అనుసరించారు. 12,644 హెక్టార్లలో వరి నాట్లు వేశా రు. నాట్లు వేసిన చోట వరి పంట ఎండిపోతోం ది. దత్తిరాజేరు మండలంలో కొన్ని చోట్ల నారు ఎండుతున్నట్టు వ్యవసాయ అధికారుల దృష్టికి కూడా వచ్చింది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడానికి ఈ నెల 15వ తేదీ వరకు చూడాలని వ్యవసాయశాఖ కమిషనర్ చెప్పినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆందోళనకరంగా జలాశయాలు.. జిల్లాలో జలాశయాలున్నప్పటికీ వాటిలో సరిపడా నీరులేదు. పెద్ద గెడ్డ నీటిని నేటికీ విడుదల చేయలేదు. వెంగళరాయ సాగర్ నీటిని విడుదల చేసినా తక్కువ స్థాయిలో ఆరుతడి పంటలకు పనికివచ్చేలా విడుదల చేస్తున్నారు. వీఆర్ఎస్ కాలువలు 23 కిలోమీటర్ల పొడవయితే వారం రోజుల క్రితం విడుదల చేసిన సాగునీరు బొబ్బిలి మండలానికి శుక్రవారమే చేరింది. 12వ కిలోమీటర్ వద్దే సాగునీరు ఇంకా ఉండటంతో వర్షాలు పడకుంటే జలాశయంలో ఉన్న కొద్ది పాటి నీరు కూడా అయిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కంటితుడుపు వానలు.. జిల్లాలో కురుస్తున్న వర్షాలు కేవలం కంటి తుడుపుగానే ఉన్నాయి. శుక్రవారం నమోదైన వర్షపాతం వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలోని 19 మండలాల్లో చుక్క రాలలేదు. కురిసిన చోట కూడా మెంటాడలో 32.2 మిల్లీమీటర్లు, పాచిపెంటలో 21.4 మిల్లీమీటర్లు, బొండపల్లిలో 18.2 మిల్లీమీటర్లు మినహా మిగిలిని అన్ని మండలాల్లో 1.2 మిల్లీమీటర్లు నుంచి 8.2 మిల్లీమీటర్ల వరకే నమోదైంది. వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం.. జిల్లాలో వర్షాలు లేకపోవడం వల్ల రిజర్వాయర్లలోని నీటిని కూడా విడిచిపెట్టే సాహసం చేయలేకపోతున్నాం. పెద్ద గెడ్డ నీటిని నేటికీ విడిచిపెట్టలేకపోయాం. జిల్లాలో ఉన్న మొత్తం రిజర్వాయర్లన్నిటిలో 70 శాతం లోపే నీటి నిల్వలున్నాయి. వర్షాలు పడుతూ తెరిపి ఇ చ్చినప్పుడు వినియోగించే ప్రాజెక్టులే మనవి. పూర్తిగా రిజర్వాయర్ల నీటిని వినియోగించుకునే అవకాశం లేదు. వర్షాలు కురుస్తాయని ఎదురు చూస్తున్నాం. – కె.రాంబాబు, ఎస్ఈ, బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్. -
ఏపీని ముంచెత్తిన భారీ వర్షాలు..
సాక్షి, విశాఖ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురిసింది. భీమిలి, పద్మనాభం, పాడేరు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. విజయ నగరం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఏజెన్సీ ప్రాంతాలైనా జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన వర్షాలతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడడంతో రోడ్లన్ని జలమయమయ్యాయి.అకాల వర్షాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు మొక్కజొన్న, అరటి తోటలు దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లాలో భారీగా ఈదురుగాలు వీస్తుండటంతో పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణశాఖ హెచ్చరించింది. సచివాలయంలోకి మళ్లీ వర్షపు నీరు భారీ వర్షంతో ఏపీ సచివాలయంలోకి మళ్లీ వర్షపు నీరు చేరింది. భవనాలు పూర్తిగా తడిసిపోవడంతో అక్కడక్కడ సీలింగ్ ఊడిపోయి నీరు కార్యాలయంలోకి ప్రవేశించింది. మున్సిపల్ మంత్రి నారాయణ ఛాంబర్లో సీలింగ్ ఎగిరిపోవడంతో సిబ్బంది ఛాంబర్ తలుపులు మూశారు. సచివాలయంలోకి వర్షం నీరురావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. సీలింగ్‌లు ఊడిపోవడంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పట్టుకొని కాపలా కాస్తున్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఛాంబర్ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఛాంబర్లోకి ఎవరూ వెళ్లకూడదని, ఫోటోలు, వీడియోలు తీయకూడదని ఆంక్షలు విధించారు. -
'ఆయన తిన్నది ప్రభుత్వ సొమ్మేగా...'
మెరకముడిదాం: ఉపాధి హామీ కూలీల కోసం తెచ్చిన నిధుల్లో రూ.11 లక్షలను ఓ పోస్ట్ మాస్టర్ పక్కదారి పట్టించగా దాన్ని సమర్థిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ‘ పోస్ట్ మాస్టర్ మింగింది ప్రభుత్వ ధనమేగా, ప్రజాధనం కాదుగా’ అంటూ ఆడిట్‌కు వచ్చిన ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు.. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి గ్రామంలోని సబ్ పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ మాస్టర్‌గా పనిచేసే బొత్స రామారావు రూ.11 లక్షల మేర పక్కదారి పట్టించినట్టు ఆడిట్లో వెల్లడైంది. కూలీలకు ఇవ్వాల్సిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు డ్రా చేసి తీసుకెళుతున్న పోస్ట్ మాస్టర్... అదనంగా తీసుకెళుతున్న మొత్తానికి లెక్కలు తేలకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో మూడు రోజులుగా ఆడిట్ నిర్వహించగా అసలు విషయం బయటపడింది. అదనంగా తీసుకొచ్చిన మొత్తాన్ని అతడు జేబులో వేసుకుంటున్నట్టు తేలింది. దీనిపై ఆడిట్‌కు వచ్చిన ఓ ఇన్స్పెక్టర్ను ‘సాక్షి’ ప్రతినిధి వివరణ అడగగా పోస్ట్ మాస్టర్ తిన్నది ప్రభుత్వ ధనమేగా, ప్రజాధనం కాదుగా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. -
విజయనగరం ఏజెన్సీలో కూంబింగ్
విజయనగరం: మావోయిస్టుల కదలికలున్నాయనే సమాచారంతో విజయనగరం జిల్లాలో భద్రతా దళాల తనిఖీలు ముమ్మరం చేశాయి. గురువారం ఉదయం నుంచి ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించారు. అదే విధంగా మక్కువ మండలంలోని దుగ్గేరు గ్రామ వార సంతలో బీఎస్ఎఫ్ బలగాలు, పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ కమాండెంట్ జగన్మోహన్రావు, ఎస్సై సిరిపురపు రాజు పాల్గొన్నారు.