కాలినడకన వెళ్తున్న ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, అధికారులు-గిరిజన మహిళలతో సహపంక్తి భోజనం చేస్తున్న అధికారులు
సాలూరు: ఆయనో జిల్లా స్థాయి అధికారి.. ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకోవాలనే ఉత్సాహంతో కొండ కోనల్లో పర్యటించారు. కిలోమీటర్ల కొద్దీ నడిచి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. గిరిజనుల ఇబ్బందులపై ఈ నెల 25న ‘అరణ్య రోదన’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, ఇతర అధికారులు స్పందించారు. కొదమ పంచాయతీ పర్యటనకు బయలుదేరిన అధికారులు చింతామల జంక్షన్ వరకు చేరుకున్నారు. గ్రామస్తులు చందాలు పోగుచేసుకుని నిర్మించుకున్న రోడ్డు చినుకులకు బురదమయంగా మారడంతో వాహనాలు ముందుకెళ్లలేదు.
దీంతో పీఓ కూర్మనాథ్, తదితరులు సుమారు మూడు కిలోమీటర్లు నడిచి చింతామల.. మరలా వెనుకకు వచ్చి బల్ల జంక్షన్ నుంచి మరో 5 కిలోమీటర్లు నడుచుకుని కొదమ పంచాయతీ గ్రామానికి చేరుకున్నారు. చింతామల, కొదమ గ్రామాలలో ప్రజలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అయితే గిరిజనులకు తెలుగు అంతగా రాకపోవడంతో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు చోడిపల్లి బీసు ప్రజల మాటలను అధికారులకు.. అధికారుల వివరణను ప్రజలకు తర్జుమా చేసి చెప్పారు. రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు పాఠశాల, అంగన్‌వాడీ భవనాలు, చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. దీనికి పీఓ స్పందిస్తూ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర సూచనల మేరకు ఇక్కడి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా నంద నుంచి చింతామలకు రోడ్డు మంజూరైందని.. అయితే ఈ నిర్మాణం ఎందుకు పూర్తికాలేదో కారణాలు తెలుసుకుని పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
గిరిజన గ్రామాల్లో రహదారులు, వైద్యం, విద్యలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. చందాలతో వేసుకున్న చింతామల రోడ్డుకు సంబంధించి వారం రోజుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వచ్చే నెల 1వ తేదీన ప్రభుత్వ రేషన్ బియ్యం ఈ రెండు గ్రామాల్లో పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అటవీశాఖ అడ్డంకుల వల్ల గిరిశిఖర గ్రామాల్లో రహదారుల నిర్మాణం ముందుకు సాగడం లేదని, అధికారులు దీనిపై దృష్టి సారించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనువాసరావు కోరారు.
గిరిజనులతో సహపంక్తి భోజనం..
కొదమలో స్థానిక గిరిజన నాయకులు ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంలో పీఓ కూర్మనాథ్, తదితరులు పాల్గొన్నారు. పీఓ తన వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను అక్కడి చిన్నారులు, మహిళలకు అందించారు. అలాగే ప్రజాచైతన్య వేదిక కన్వీనర్ కూనిశెట్టి అప్పలనాయుడు సమకూర్చిన రూ. 25 వేల నగదును యువతకు అందజేశారు. ఈ పర్యటనలో పీఓ కూర్మనాథ్ తన కుమారుడిని తీసుకువచ్చి గిరిజనుల ఆహార వ్యవహారాలు, కష్టసుఖాలను వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ కిరణ్‌కుమార్, డ్వామా పీడీ నాగేశ్వరరావు, తహసీల్దార్ ఇబ్రహీం, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment