ఎస్.కోటలో గిరిజనదర్బార్‌లో సమస్యలు వింటున్న పీఓ లక్ష్మీశ, ఎమ్మెల్యే లలితకుమారి తదితరులు
శృంగవరపుకోట: ఐటీడీఏ చరిత్రలో కొత్త చరిత్రకు తెర తీశారు పీఓ లక్ష్మీశ. శుక్రవారం స్థానిక ఎమ్పీడివో కార్యాలయంలో గిరిజన దర్బార్ నిర్వహించిన పీఓ సుమారు మూడు గంటలపాటు చాలా ఓపికగా అందరి సమస్యలు విన్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రధానంగా ఎక్కువ మంది గిరిజనులు తమ గ్రామాలకు రోడ్లు, మంచినీటి వసతి లేదని, పోడు పట్టాలు ఇవ్వటం లేదని, మరుగుదొడ్లు మంజూరు చేయలేదని, ట్రైకార్ రుణాలు ఇప్పించాలని, ఉద్యోగావకాశాలు కల్పించాలని, ఇళ్లు కేటాయించాలని, వ్యవసాయ, ఉద్యాన శాఖల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని అర్జీలు ఇచ్చారు. కొంతమంది వికలాంగులు, వితంతువులు తమకు అర్హత ఉన్నా పింఛన్లు మంజూరు చేయలేదని ఫిర్యాదు చేశారు. మండల గిరిజన సంఘ నాయకులు జె.గౌరీష్, డి.ధోనీ, కె.అరుణ్‌కుమార్ మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో వైద్యం, విద్య, రహదారుల వంటి సమస్యలపై వినతిపత్రాలు అందించారు.
సమస్యలపై సానుకూల స్పందన
సమస్యలపై స్పందించిన పీఓ గ్రామాల్లో సీసీ రోడ్లు, సోలార్ తాగునీటి పధకాలు కేటాయిస్తామనీ, యువత, లేదా డ్వాక్రాసంఘాలు, విలేజ్ కమిటీలతో పనులు చేయించాలనీ సూచించారు. దీనిపై పక్కనే ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ గాయత్రికి చెప్పి పనులు జరిగేలా చూడాలన్నారు. సీపీఎం నేత చల్లా జగన్ గిరిశిఖర గ్రామాలకు రోడ్లువేయాలని, మంచినీరు అందించాలని. మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన సమాఖ్య నేతలు టి.అప్పలరాజు, జి.లక్ష్మణ, పి.ఎర్రయ్య, జి.పోతయ్య తదితరులు గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూముల పరిహార విషయంలో గిరిజనులకు అన్యాయం జరుగుతోందని, నేటి వరకూ పనులు ప్రారంభం కాలేదని, గిరిజనులు సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, రుణాలు, ఉపాధి అవకాశాలు పెంచాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నేత కేత వీరన్న మండలంలో గిరిజనుల ఇబ్బందుల్ని ఏకరువు పెట్టారు.
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతితోనే సమాజాభివృద్ధి
ప్రజాదర్బార్‌లో పీఓ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్టీ, ఎస్సీలు అభివృద్ధి చెందితేనే సమాజాభివృద్ధి సాధ్యమౌతుందని చెప్పారు. రాజ్యాంగమే వారి అభివృద్ధి కాంక్షిస్తూ రిజర్వేషన్లు కల్పించినపుడు మనమెందుకు వెనకడుగు వేయాలని ప్రశ్నించారు. ప్రభుత్వం నిధులిస్తున్నా కిందిస్థాయిలో అనుమతులే అడ్డంకులుగా మారాయని చెప్పారు. ప్రతి గిరిజన కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరాలని చెప్పారు. గిరిజన సమస్యలు ఏం గుర్తించినా తనకు ఫోన్‌చేస్తే స్పందిస్తానని తెలిపారు.,ఎస్.కోట సీహెచ్‌సీలో ట్రైబల్ కోఆర్డినేటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో డీడీ వి.నారాయణుడు, ఐటీడీఏ అధికారులు ఎన్.శ్రీనివాసరావు, ఆర్.వి.ఎస్.ప్రసాదరావు, ఎస్.వి.రమణ, ఎం.నారాయణరావు, ఎస్.కోట ఎంపీడీవో మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment