కొనసాగుతున్న ఆదివాసీల దీక్ష
Published Thu, Sep 1 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
బేల : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివాసీ సంక్షేమ, విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 11వ రోజు గురువారం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు ఆడే శంకర్, ప్రధాన కార్యదర్శి పుసాం రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు ఆడే సంతోష్, సోన్‌కాస్ సర్పంచ్ గేడాం బాపురావు, బాది మాజీ సర్పంచ్ సలాం దేవ్‌రావు, ఆదివాసీ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు పెందుర్ రాందాస్, ప్రధాన కార్యదర్శి కొవ విజయ్, నాయకులు గోద్రు పటేల్, ఫక్రుపటేల్, తదితరులు పాల్గొన్నారు.
దీక్షాశిబిరాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్
మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొనసాగుతున్న ఆదివాసీల రిలే నిరహార దీక్షాశిబిరాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ గురువారం సందర్శించారు. దీక్షలో కూర్చున్న వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్లుగా పెండింగ్ ఉన్న విరాసత్ జాబితా ఇవ్వాలని, 15 రోజుల్లో ఆదివాసీలకు పట్టాలను అందిస్తామని పేర్కొన్నారు. ఈ నెలాఖరిలోపు పీటీజీ పరిధిలోని స్థానిక కొలాం ఆదివాసీలకు అంత్యదోయ కార్డులను అందిస్తామని హామీ ఇచ్చారు. స్థానికంగా ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాల జాబితాను సమాచార హక్కు చట్టం ద్వారా అందిస్తామని పేర్కొన్నారు.
దొంగ ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలను రద్దు చేస్తామని తెలిపారు. 1/70 అమలు, ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటున్న భూముల అటవీ హక్కు పత్రాల విషయంపై ఐటీడీఏ పీవోకు తెలిపానని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా బేల ఐటీడీఏ పీవో, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్‌లు వచ్చి ఈ సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామని సూచించారు.
ఆదివాసీల విషయంలో తప్పిదం చేసిన అధికారికి మెమో ఇచ్చినట్లు వివరించారు. దీక్ష విరమించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ కారారు. అందుకు ఆదివాసీలు నిరాకరించారు. ఐటీడీఏ పీవో వచ్చే వరకూ, సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ దీక్షను విరమించమని తెలపడంతో జాయింట కలెక్టర్ వెనుతిరిగారు. ఆయన వెంట డీఆర్వో సంజీవ్ రెడ్డి, డెప్యూటీ తహసీల్దార్ కన్నం రాజశేఖర్, ఆర్‌ఐలు బి. మహేశ్, జి. రమేశ్, మండల కో–ఆప్షన్ సభ్యుడు తన్వీర్‌ఖాన్, వీఆర్వోలు, తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement