మద్దులవాయి చందం చెరువులోకి కొద్దిగా వచ్చిన నీరు
- ఖరీఫ్ ప్రారంభమైనా భారీ వర్షాలు కరువు
- ‘బోరు’మంటున్న జిల్లాలో బావులు
- ‘ఆరుతడి’ సాగుకే పరిమితమవుతున్న రైతన్నలు
- ఖాళీగానే దర్శనమిస్తున్న నీటి వనరులు
మెదక్/మెదక్ రూరల్: ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా జిల్లాలో నేటికి భారీ వర్షాలే లేవు. అడపా దడపా కురుస్తున్న వర్షాలతో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, కంది, జొన్న, కూరగాయల పంటలను మాత్రమే రైతులు సాగుచేశారు. వర్షాలు అనుకున్న స్థాయిలో కురియక పోవడంతో చెరువులు, కుంటలతోపాటు జిల్లాలోని సింగూర్, ఘనపురం ప్రాజెక్ట్, రాయిన్‌పల్లి తదితర మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి కొద్దిపాటి నీరు మాత్రమే చేరింది.
గత రెండేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో బోరుబావులు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో వేలాది బోర్లు మూలన పడ్డాయి. భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లో నీరు చేరితే బోరు బావుల్లో నీటి ఊటలు పెరిగేవి. దీంతో జిల్లాలో తక్కువ స్థాయిలోనైనా బోర్ల ఆధారంగా రైతులు వరిపంటలు సాగుచేస్తున్నారు. మిగతా రైతులంతా ఆరుతడి పంటలతో సరిపెడుతున్నారు. జిల్లాలో ప్రధాన పంట వరిసాగే. గడిచిన రెండేళ్లలో కరువు పరిస్థితుల వల్ల రైతులు ఎలాంటి పంటలు సాగుచేయలేదు.
ఈయేడు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని గంపెడాశతో అన్నదాతలు బోరుబావుల వద్ద, చెరువులు,కుంటల వద్ద నార్లు పోసి, దుక్కులు దున్ని సాగుకు సిద్ధమయ్యారు. కాని భారీ వర్షాలు లేకపోవడంతో అన్నదాతల ఆశలు ఆవిరై పోతున్నాయి. ఆగస్టు మాసంలోనైనా భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లోకి నీరు వస్తే పంటలు బాగాపండి తమ కష్టాలు తీరుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బోర్లలో నీళ్లు లేవు
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా భారీ వర్షాల జాడేలేదు. ఏడాదిగా నా పొలంలోని రెండు బోర్లలో నీటి ఊటలు ఏ మాత్రం పెరగలేదు. దీంతో మూడెకరాల్లో మొక్కజొన్నే వేసుకున్నా. - నీల్యా, గిరిజన రైతు, ఔరంగాబాద్ తండా
రూ.20వేలు అప్పుచేశా
రెండేళ్లుగా వర్షాలు లేక పంటలు వేయలేదు. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయన్న ఆశతో అప్పు చేసి ఎకరన్నర పొలంలో వరి పంట సాగుచేశా. వర్షాలు కురవకపోవడంతో పంట మొలకదశలోనే ఎండిపోయింది. గతంలోనే రూ.2లక్షల అప్పులున్నాయి. ఈసారి సాగుకోసం చేసిన అప్పులు మీదపడేలా ఉన్నాయి. - సిద్దమ్మ, మహిళా రైతు, బ్యాతోల్
మొలక దశలో ఎండుతున్నాయి
వర్షాలు పడతాయన్న ధైర్యంతో అప్పు చేసి పంటలు వేశాం. కాని వర్షాలే పడలేదు. మూడెకరాల వ్యవసాయభూమి ఉండగా రెండెకరాల్లో వరి పంట వేశా. వర్షాలు లేకపోవడంతో బోరుబావిలో నీటి ఊటలు పెరగలేదు. వరినాట్లు వేసేందుకు రూ.30వేల అప్పులయ్యాయి.
- కెతావత్‌శ్రీను, రైతు, బ్యాతోల్ తండా
వర్షాలు లేక కూలీకి వెళ్తున్నా
నాకు రెండెకరాల వ్యవసాయ పొలం ఉంది. సరైన వర్షాలు లేక ఎలాంటి పంటలు సాగుచేయలేదు. దీంతో పూట గడవటమే కష్టంగా మారింది. చేసేది లేక నిత్యం కూలి పనులకు వెళ్తున్నా.. ఈసారైనా వరుణదేవుడు కరుణిస్తాడనుకుంటే సరైన వర్షాలు కురియక పోవడంతో కూలిగా మారాల్సి వచ్చింది. - వీరమణి, బ్యాతోల్