కొలమానాలే కొంపముంచాయి
నిబంధనల వల్లే తగ్గిన కరువు మండలాల సంఖ్య
రాష్ట్రంలో 217 మండలాల్లో వర్షాభావం
వాస్తవ పరిస్థితిని వివరించిన కలెక్టర్లు
సాగు విస్తీర్ణం, ఎన్‌డీవీఐ, ఎన్‌డీడబ్ల్యూఐ అంచనాల వల్లే సమస్య
వాస్తవాలను పక్కనపెట్టి కరువును నిర్ధారించిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు మండలాల నిర్ధారణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 66 మండలాల్లోనే కరువు ఉన్నట్లు తేల్చడం వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే కలెక్టర్లు జిల్లాల్లో వాస్తవ పరిస్థితులను సర్కారుకు నివేదించారు. వర్షాభావం, వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రైస్పెల్), తగ్గిన సాగు విస్తీర్ణం ఆధారంగా వేర్వేరు కేటగిరీల్లో మండలాల సంఖ్యను పేర్కొన్నారు. ఖరీఫ్ పంటల దిగుబడి ఇంకా రానందున ఆ అంశాన్ని వదిలేశారు. కానీ కలెక్టర్లు పంపిన ఈ వివరాలకు సర్కారు నిబంధనలను జోడించడంతో కరువు మండలాల ప్రకటన పక్కదారి పట్టింది. కరువు మండలాల సంఖ్య అత్యల్పంగా 66కే పరిమితమైంది.
వాస్తవాలు పక్కదారి: కలెక్టర్లు పంపించిన నివేదికల ప్రకారం రాష్ట్రంలో వర్షాభావ మండలాలు 217 ఉన్నాయి. డ్రైస్పెల్ ఉన్న మండలాలు 152 ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 42 డ్రైస్పెల్ మండలాలున్నాయని ఆ జిల్లా కలెక్టర్ నివేదించారు. సాగు విసీర్ణం 50% కంటే తగ్గిన మండలాలు రాష్ట్రంలో కేవలం 31 ఉన్నట్లుగా కలెక్టర్ల నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే కొంప ముంచింది. వాస్తవంగా జూన్‌లో వర్షాలు విస్తారంగా కురవడంతో పెద్ద ఎత్తున పంటల సాగు ప్రారంభమైంది. మొత్తంగా ఖరీఫ్‌లో 86% సాగు జరిగింది. పత్తి 104%, సోయాబీన్ 142% జరి గింది. దీంతో 50% కన్నా సాగు విస్తీర్ణం తగ్గిన మండలాలు 31 మాత్రమే నమోదయ్యాయి. కరువు మండలాల ప్రకటనకు ఇదే ప్రధాన అడ్డంకిగా మారింది. వీటితో పాటు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ 269 మండలాల్లో కరువు ఉన్నట్లుగా చెప్పి నా.. అందులో తీవ్రతను బట్టి 73 మండలాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది.
మరోవైపు నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ (ఎన్‌డీవీఐ), నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్ (ఎన్‌డీడబ్ల్యుఐ)ల ప్రకారం రాష్ట్రంలో కరువు మండలాలను తక్కువగా చూపింది. కలెక్టర్లు పంపిన మూడు అంశాలతోపాటు వ్యవసాయ వర్సిటీ, ఎన్‌డీవీఐ, ఎన్‌డీడబ్ల్యుఐల అంచనాలను కలిపి పరిశీలించారు. దీంతో కరువు మండలాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. వ్యవసాయ వర్సిటీ, ఎన్‌డీవీఐ, ఎన్‌డీడబ్ల్యుఐలను పక్కన పెడితే కరువు మండలాల సంఖ్య ఎక్కువగా ఉండేదని చెబుతున్నారు. ఒకవేళ సాగు విస్తీర్ణంపరంగా చూసినా... జూలై, ఆగస్టు నెలల్లో వర్షాభావంతో పంటలన్నీ సగానికిపైగా ఎండిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోనైతే నూటికి నూరు శాతం దెబ్బతిన్నాయి. దీనిని బట్టి సాగు విస్తీర్ణం వంటి సాంకేతిక అంశాలు కాకుండా వాస్తవ పరిస్థితిని బట్టి కరువు అంచనా వేస్తే బాగుండేది. కానీ సర్కారు నిబంధనల సాకుతో వాస్తవాలను మరుగున పెట్టిందన్న ఆరోపణలు వస్తున్నాయి.