కరువు మండలాలు అరవై ఆరేనా?
ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కలెక్టర్లు
అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 35.. తక్కువగా మెదక్‌లో 13 మండలాలు
సర్కారు చెప్పినట్లుగా కలెక్టర్లు నివేదిక తయారుచేశారన్న విమర్శలు
269 మండలాల్లో కరువు ఉందన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం
217 మండలాల్లో తీవ్ర వర్షాభావముందన్న వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్:
తీవ్ర వర్షాభావం.. వేలాది ఎకరాల్లో ఎండిపోయిన పంటలు... వందలాది మంది రైతుల ఆత్మహత్యలు.. సాగుకే కాదు కొన్ని ప్రాంతాల్లో తాగునీటికీ కరువే. ఇదీ రాష్ట్రంలో కరువు పరిస్థితుల బీభత్సం. కానీ రాష్ట్రవ్యాప్తంగా 66 మండలాల్లో మాత్రమే కరువు నెలకొందంటూ జిల్లా కలెక్టర్లు నిర్ధారణకు వచ్చారు. ఈమేరకు తాజాగా సర్కారుకు నివేదిక సమర్పించారు కూడా. అయితే 217 మండలాల్లో తీవ్ర వర్షాభావం ఉందని వాతావరణ శాఖ, 269 మండలాల్లో కరువు ఉందని వ్యవసాయ యూనివర్సిటీలు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. కానీ 9 జిల్లాల్లోని 443 మండలాల్లో కేవలం 66 మండలాల్లోనే కరువు ఉందంటూ జిల్లా కలెక్టర్లు నివేదిక ఇవ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సర్కారు పెద్దల అభీష్టం మేరకే కరువు మండలాల సంఖ్యను బాగా తగ్గించి చూపారన్న ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ల నివేదికను రాష్ట్రస్థాయి కరువు పర్యవేక్షణ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత కేంద్రానికి అందజేస్తారు. కరువు మండలాల సంఖ్యను తక్కువగా చూపడం వల్ల అన్నదాతకు అందాల్సిన సాయం దూరం కానుంది. ఫలితంగా ఆత్మహత్యలు పెరిగే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కలెక్టర్లు సర్కారుకు అందజేసిన నివేదిక వివరాలను వ్యవసాయాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.
పాలమూరులో అత్యధికంగా..
కలెక్టర్ల నివేదిక ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలోని 64 మండలాల్లో అత్యధికంగా 35 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయి. వాస్తవానికి జిల్లా మొత్తాన్ని కరువుగా ప్రకటించాలని అధికారులు అంతర్గత నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఇక సీఎం జిల్లా మెదక్‌లో 46 మండలాలకు కేవలం 13 మండలాల్లోనే కరువు చూపారు. ఇక్కడా జిల్లా మొత్తం కరువు ప్రకటించాల్సిన పరిస్థితులున్నాయని అంటున్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎక్కడా కరువు ఛాయలే లేవని తేల్చారు. కరీంనగర్ జిల్లాలో 40 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయని అంతర్గత నివేదికలు చెబుతుంటే... 3 మండలాలకే పరిమితం చేశారు. వాస్తవానికి వాతావరణశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 217 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులను లెక్కలోకి తీసుకోకుండా సాంకేతిక, రాజకీయ కారణాలతో సంఖ్యను తక్కువ చేసి చూపారన్న విమర్శలున్నాయి. ఇక జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం శాటిలైట్ చిత్రాల ఆధారంగా కరువు మండలాలను ధ్రువీకరించినట్లు తెలిసింది. వారు 269 మండలాల్లో ఒక మోస్తరు నుంచి తీవ్ర కరువు ఉందని తేల్చినట్లు సమాచారం.
కలెక్టర్లు నిర్ధారించిన కరువు మండలాలు..
ఆదిలాబాద్: లక్ష్మణచాంద, మామ్‌దా (2)
నిజామాబాద్: మోర్తాడ్ (1)
రంగారెడ్డి: శేరిలింగంపల్లి, బాలానగర్, శామీర్‌పేట్, ఉప్పల్, దోమ, మంచాల్, కందుకూర్ (7)
మహబూబ్‌నగర్: దామరగిద్ద, మద్దూరు, బాలానగర్, కొందుర్గు, కొత్తూరు, తలకొండపల్లి, ఆమనగల్, మాడ్గుల్, వంగూర్, వెల్దండ, కల్వకుర్తి, మిడ్జిల్, జడ్చర్ల, భూత్‌పూర్, చిన్నచింతకుంట, పెద్దమందాడి, ఘన్‌పూర్, బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, తాడూర్, తెల్కపల్లె, ఉప్పునుంతాల, అచ్చంపేట, బల్మూర్, లింగాల్, పెద్దకొత్తపల్లి, కొడేర్, గోపాల్‌పేట, వనపర్తి, పెబ్బేరు, దారూర్, మల్దకల్, అయిజా, వడ్డేపల్లి, ఇటిక్యాల (35)
నల్లగొండ: బొమ్మలరామారం, భువనగిరి, నారాయణపూర్, గుండ్లపల్లి, చందంపేట (5)
మెదక్: కల్హేర్, నారాయణఖేడ్, చిన్నకోడూరు, జగదేవ్‌పూర్, వెల్దుర్తి, కౌడిపల్లి, జహీరాబాద్, పుల్కల్, సంగారెడ్డి, పటాన్‌చెరువు, శివంపేట, ములుగు, తొగుట (13)
కరీంనగర్: మేడిపల్లి, మెట్‌పల్లి, రామడుగు (3)