
చింతలవలస సమీపంలోని పినా చెరువు
సాక్షి, మెంటాడ (విజయనగరం): వరుణుడు ముఖం చాటేయడంతో మండలంలోని చెరువులు చుక్కనీరు లేక వెలవెలబోతున్నాయి. ఖరీఫ్ వరిసాగుకు సిద్ధపడే రైతులను వర్షాభావ పరిస్థితి సందిగ్ధంలోకి నెట్టేసింది. ఇటీవల అడపా, దడపా వర్షాలు కురిసినా చెరువుల్లోకి నీరు చేరే స్థాయిలో కురవకపోవడంతో రైతన్నలు దిగులుచెందుతున్నారు. వరినార్లు పోసేం దుకు సాహించడం లేదు. దమ్ముల సంగతి పక్కనపెడితే నారుమడులకు కూడా నీరందుతుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏటా ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చేపట్టి చెరువులను లోతు చేయిస్తున్నా వర్షాలు లేకపోవడంతో ఆ పనులవల్ల ఎటువంటి ఫలితం దక్కడం లేదని రైతులు అంటున్నారు. మండలంలో చిన్న పెద్ద చెరువులు, బందలు కలిపి సుమారు 400 వరకు ఉన్నాయి. వీటి కింద సుమారు 3,600 ఎకరాల వరకు ఖరీఫ్ వరి సాగు చేసేవారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆసన్నమవుతున్నా నేటికీ సరైన వర్షాలు కురవకపోవడంతో వరి విత్తనాలు రైతుల వద్ద సిద్ధంగా ఉన్నప్పటికీ చల్లేందుకు సాహసించలేకపోతున్నారు.
గోపీ పట్నాయిక్ చెరువు
మండలంలోని గోపీ పట్నాయిక్ చెరువు పరిధిలో సుమారు 500 ఎకరాల ఆయకట్టు ఉంది. బడేవలస, మీసాలపేట, కొంపంగి, ఇద్దనవలస రాబం ద గ్రామాలకు చెందిన భూములను ఈ చెరువు ఆధారంగానే సాగుచేస్తుంటారు. ప్రస్తుతం ఈ చెరువులో చుక్క నీరు లేకపోవడం ఆయకట్టు రైతులను ఆందోళనలోకి నెట్టింది.
పొట్టి బంద చెరువు
అమరాయివలస,కైలాం గ్రామాల పొలాలకు పొట్టి బంద చెరువు ద్వారానే నీరు అందుతుంది. ఈ చెరువు కింద సుమారు 250 ఎకరాలు సాగవుతోంది. ప్రస్తుతం ఈ చెరు వు ఎడారిని తలపిస్తోంది. ఆయకట్టు రైతులు కనీసం నారు మడులు కూడా తయారు చేయలేదు.
గండివాని, పినా చెరువులు
కైలాం గ్రామ రైతులు గండివాని చెరువు ఆధారంగానే వరి సాగు చేస్తుంటారు. సుమారు 400 ఎకరాల ఆయకట్టు ఈ చెరువు కింద సాగువుతోంది. ఈ ఏడాది నేటికీ చెరువులోకి చుక్క నీరు చేరలేదు. చింతలవలస రెవెన్యూ పరిధిలో ఉన్న పినా చెరువు కింద సుమారు 200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరవు పరిస్థితి కూడా అలాగే ఉంది. విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప ఈ ఏడాది ఉభాలు జరిగేలా లేవని రైతులు అంటున్నారు.

గండినాథుని పట్నాయిక్ చెరువు