
సాక్షి, ఒంగోలు: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఉదయం నాలుగున్నర గంటల నుంచే తెల్లవారి వెలుగు కన్పిస్తోంది. ఒక్క సారిగా వడగాడ్పులు మొదలవుతున్నాయి. రోహిణి కార్తె ముగిసినా ఉష్ణ తీవ్రత తగ్గడం లేదు. ఈ ఏడాది రుతుపవనాలు కచ్చిత సమయానికే వచ్చాయని బావించినా వాటి జాడే లేకుండా పోయింది. చినుకు రాలలేదు. జిల్లాలో మార్కాపురం, కందుకూరు డివిజన్లలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురిశాయి. అక్కడక్కడ చినుకులు రాలాయి. పిడుగులు పడి కొందరు మృత్యువాతపడ్డారు.
పశు నష్టం వాటిల్లింది. జిల్లాలో 40 డిగ్రిల ఉష్ణోగ్రతలు తగ్గడంలేదు. గురువారం టంగుటూరు, ముండ్లమూరు, దొనకొండ, ఇంకొల్లు, వేటపాలెంలోని దేశాయిపేటలో 45 డిగ్రిల ఉష్ణోగ్రత నమోదైంది. త్రిపురాంతకం, దొనకొండ,తర్లుపాడు, ముండ్లమూరు, మార్టూరు, వేటపాలెం, జె.పంగులూరు, కొరిశపాడు, మద్దిపాడులో 50–70 కి.మీ వేగంతో వడగాడ్పులు నమోదయ్యాయి. ఉదయాన్నే ఎండ తీవ్రంగా వస్తుంది. ఆరు,ఏడు గంటలలోపే ప్రచండ వెలుగు కన్పిస్తోంది. వడగాడ్పులు మొదలవుతున్నాయి. వేడి గాలులకు ఇల్లు విడిచి రావాలంటే భయపడ్తున్నారు. ఒక మధ్యాహ్నం 12–1 గంట మధ్యలో జన సంచారం ఉండటం లేదు. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి.
ఈ ఏడాది తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్నడు లేని విధంగా వేడి తాపాన్ని ఎదుర్కొన్నారు. మే,జూన్ నెలల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువ పర్యాయాలు నమోదయ్యాయి. గురువారం 37 మండలాల్లో 40–42.3 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏసీలు పని చేయడం లేదు. వడగాడ్పులను పోలిన బెట్ట వాతావరణమే గదుల్లోనూ నెలకుంటోంది. ఉష్ణోగ్రతలు, వడగాడ్పులకు బయటకు తిరిగే పరిస్థితి లేదు. ఇళ్లల్లో ఉందామన్నా వాతావరణం సహకరించడం లేదు.
పగటి పూట ఉష్ణోగ్రతలు, ఉక్క దెబ్బకి జనం బెంబేలెత్తిపోతున్నారు. రైళ్లు, బస్సుల్లో ఏసీలు పని చేయడం లేదు. కనిగిరి ప్రాంతంలో ఇటీవల ఏసీ బస్సులో ఏసీ అంతరాయం వచ్చి నిలిచిపోయింది. అర్ధరాత్రి ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారుల దృష్టికి రాత్రి 12 గంటల ప్రాంతంలో సమస్యను తీసుకెళ్లినా ప్రత్యమ్నాయం చేయలేకపోయారు. రైళ్లల్లోని ఏసీ కంపార్టుమెంట్లలో ఏసీలు సరిగ్గా పని చేయక అధికారులకు తరుచూ ఫిర్యాదులు వస్తున్నాయి.
మరో 48 గంటలు వడగాడ్పుల తీవ్రత ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. మృగశిర కార్తె వచ్చినా ఇంత వరకు వ్యవసాయ పనులు మొదలు కాలేదు.. నీళ్లు లేవు. సాగుకు ఈ ఏడాది నీళ్లు వస్తాయో లేదో తెలియదు. అధికారులు తాగునీటి గండం ఎలా గట్టెక్కాలని చూస్తున్నారు. వ్యవసాయ విస్తీర్ణం లక్ష్యాలను నిర్ణయించినా ఇంత వరకు అడుగు ముందుకు పడలేదు.
Comments
Please login to add a commentAdd a comment