నాడు తొలి దశ తెలంగాణ ఉద్యమం.. తర్వాత మలి దశ ఉద్యమంలో అగ్గి పుట్టింది సిద్దిపేట జిల్లాలోనే.. ఇప్పుడు రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా సిద్దిపేట నుంచే సీఎం కేసీఆర్, కీలక మంత్రి హరీశ్‌రావు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించారు. టీజేఎస్ ఏర్పాటు తర్వాత ఆ పార్టీ అధినేత కోదండరాం ఎన్నికల అభ్యర్థుల తొలి ప్రకటన దుబ్బాకలోనే చేశారు. మరో ఉద్యమ నేత రఘునందన్‌రావు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అదేవిధంగా పెన్ను, గన్ను పట్టిన నాయకుడిగా పేరున్న సోలిపేట రామలింగారెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.. ఇక మహాకూటమిలో భాగస్వామ్యమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం నుండే పోటీ చేస్తున్నారు. ఇలా జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో అన్ని పార్టీల్లోనూ కీలక వ్యక్తులే బరిలో నిలిచారు.
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో సమీప అభ్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చాడు. అయితే ఆదే వంటేరును కాంగ్రెస్ పార్టీ తరఫున ఈసారి బరిలో దింపారు. వంటేరు ప్రతాప్‌రెడ్డిని గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులు గల్లీ నుండి ఢిల్లీ వరకు మద్దతు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఇది పసిగట్టిన టీఆర్‌ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గజ్వేల్‌పై ప్రత్యేక దృష్టిపెట్టారు.
కుల సంఘాలను ఏకం చేస్తూ మద్దతు సభలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇతర నాయకులు వస్తే ఏం జరుగుతుందో ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నియోజకవర్గంలోని 15వేల మంది కార్యకర్తలతో తన ఫాం హౌస్‌లో సమావేశం ఏర్పాటు చేసి ఉత్సాహాన్ని నింపారు. వీరితోపాటు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి తదితర నాయకులు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం ముమ్మరం చేశారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్ నాయకులు గజ్వేల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం చేస్తూ అందరి దృష్టి గజ్వేల్ వైపు మళ్లేలా చేస్తున్నారు.
సిద్దిపేట మెజార్టీపై లెక్కలు
దశాబ్దాలుగా గులాబీ కంచుకోటగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గంలో గెలుపు గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ఇక్కడి నుండి పోటీ చేసే మాజీ మంత్రి హరీశ్‌రావుకు మెజార్టీ ఎంత వస్తుందనే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు కేసీఆర్, ఐదు పర్యాయాలు హరీశ్‌రావు విజయం ఢంకా మోగించారు. గత ఎన్నికల్లో 95వేల మెజార్టీ సాధించిన హరీశ్‌రావు.. ఈసారి లక్ష మెజార్టీ సాధించి రికార్డు సాధించాలనే ఊపుతో ముందుకు వెళ్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా హరీశ్‌రావుకే ప్రజలు చందాలు వేసుకొని ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వడం... ఎక్కడా లేని విధంగా సబ్బండ కులాలు పోటాపోటీగా ఆశీర్వాద సభలు నిర్వహించడం విశేషం.
గతంలో ప్రధాన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉండగా ఇప్పుడు కూటమిలో భాగంగా సిద్దిపేట సీటు టీజేఎస్‌కు ఇవ్వడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై టీఆర్‌ఎస్ దృష్టి సారించారు. ఇక ఇక్కడి నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి నరోత్తం రెడ్డి అత్యధిక ఓట్లు సాధించి మార్కు చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పటి అన్నల ఇలాకాగా చెప్పుకునే దుబ్బాక నియోజకవర్గం అందరికీ ప్రతిష్టాత్మకంగానే మారింది. భూమి కోసం.. భుక్తి కోసం సాగిన పోరాటంలో గన్ను, పెన్ను పట్టిన నాయకుడిగా పేరున్న తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా కీలక భూమిక పోషించారు. దీనిని గమనించిన కేసీఆర్ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ పదవి కూడా అప్పగించారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతీ ఇంటితో అనుబంధం పెంచుకున్న సోలిపేట.. ఈ ఎన్నికల్లో కూడా తనను గెలిపించాలని తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పాటు తర్వాత దుబ్బాకలో నిర్వహించిన తొలి సభలో కోదండరాం ప్రసంగిస్తూ తన పార్టీ అభ్యర్థి దుబ్బాక నుండి పోటీ చేస్తాడని ప్రకటించారు. దానికి కట్టుబడి కూటమి నాయకులను ఒప్పించి దుబ్బాక సీటును టీజేఎస్‌కు కేటాయించేలా చేశారు. ప్రకటన చేయడమే ముఖ్యం కాదు. నియోజకవర్గంలో తన అభ్యర్థికి ఓటు బ్యాంకు పెంచుకోవడం, పార్టీ సత్తా చాటడం కోదండరాంకు ప్రతిష్టాత్మకంగా మారింది.
ఇక మరో ఉద్యమ నాయకుడు రఘునందన్ బీజేపీ నుండి పోటీలో ఉన్నారు. ఆ పార్టీలో కీలక వ్యక్తిగా గుర్తింపు పొంది మొదటి జాబితాలో సీటు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికలు తన రాజకీయ భవిష్యత్‌తో ముడిపడి ఉందని ప్రతిష్టాత్మకంగా భావించి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి ముత్యం రెడ్డి కూడా చివరిసారి పోటీలో ఉండి అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటూ గ్రామాలను పర్యటిస్తున్నారు. కూటమిలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించకపోయినా.. స్వతంత్రంగా పోటీ చేసి సత్తాచాటుతానని చెబుతున్నాడు.
హుస్నాబాద్‌లో కామ్రేడ్స్‌కు పరీక్ష
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి భాగస్వామ్య పార్టీ సీపీఐకి హుస్నాబాద్ కీలకం. పొత్తులో భాగంగా పోరాడి మరీ హుస్నాబాద్ టికెట్ సాధించుకున్నారు. ఇక్కడి నుండి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పోటీలో ఉంటున్నారు. పార్టీకి కీలకమైన హుస్నాబాద్‌ను గెలిపించుకొని మిత్రుల మధ్య గౌరవం పెంచుకోవాలని ఆ పార్టీ కేడర్ అంటున్నారు. అయితే గత నెలన్నర నుండి తాజా మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో సభ పెట్టించి కార్యకర్తలకు నూతనోత్సాహం నింపారు. ఇంటింటి ప్రచారం చేసి ఓటరుకు దగ్గరయ్యామని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. పొత్తులో భాగంగా హుస్నాబాద్ టికెట్ సీపీఐకి కేటాయించినా.. తాను పోటీ ఉండి తీరుతానని, స్నేహ పూర్వక పోటీలో ఉండి తన సత్తా చాటుతానని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment