మహిళా ఎమ్మెల్యేలు ఏడుగురే | Seven Women MLAs In Medak Constituency | Sakshi
Sakshi News home page

మహిళా ఎమ్మెల్యేలు ఏడుగురే

Published Mon, Nov 12 2018 10:38 AM | Last Updated on Mon, Nov 12 2018 10:56 AM

Seven Women MLAs In Medak Constituency - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: 1952 నాటి హైదరాబాద్‌ స్టేట్‌ మొదలుకుని 2014లో జరిగిన తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికల వరకు రాష్ట్ర శాసనసభకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి కేవలం ఏడుగురు మహిళలు మాత్రమే శాసనసభలో అడుగు పెట్టారు. 1962 (మూడో శాసనసభ), 2004 (పన్నెండో శాసనసభ)కు జిల్లా నుంచి అత్యధికంగా ముగ్గురు చొప్పున మహిళలు ఎన్నికయ్యారు. వారిలో గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి మాత్రమే మంత్రి పదవులు నిర్వర్తించారు. జిల్లా నుంచి అత్యధికంగా నాలుగు సార్లు గీతారెడ్డి శాసనసభకు ఎన్నికయ్యారు. సిద్దిపేట, దొమ్మాట (ప్రస్తుతం దుబ్బాక), సంగారెడ్డి, నారాయణఖేడ్, పటాన్‌చెరు అసెంబ్లీ స్థానాల నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళా కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించలేదు.

1962–67 (మూడో శాసనసభ)లో రాష్ట్ర అసెంబ్లీకి మొత్తం ఆరుగురు మహిళలు ఎన్నిక కాగా, వీరిలో ముగ్గురు మెదక్‌ జిల్లా నుంచి ఎన్నికైన వారే కావడం గమనార్హం. అందోలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగం లక్ష్మిదేవి, 1967లో జరిగిన మెదక్‌ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 2004–09 (పన్నెండో శాసనసభ) ఎన్నికల్లోనూ జిల్లా నుంచి ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

1962, 1967 ఎన్నికల్లో రామాయంపేట ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన రెడ్డి రత్నమ్మ 1972 ఎన్నికల్లో ఓటమి పాలై, క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

1999, 2004, 2009 ఎన్నికల్లో నర్సాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వి.సునీత లక్ష్మారెడ్డి వరుస విజయాలు నమోదు చేసి హ్యాట్రిక్‌ సాధించారు. 2014 ఎన్నికల్లో నాలుగో పర్యా యం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

మాజీ మంత్రి జె.గీతారెడ్డి 1989 ఎన్నికల్లో గజ్వేల్‌ (ఎస్సీ) స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. తిరిగి 1994, 1999 ఎన్నికల్లో వరుస ఓటమి చవిచూసి తిరిగి 2004లో రెండో పర్యాయం ఎన్నికయ్యారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా గజ్వేల్‌ జనరల్‌ స్థానంగా మారడంతో ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారిన జహీరాబాద్‌ నుంచి గీతారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 2014లోనూ ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ పక్షాన మరోమారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి విజయం సాధించిన ఘనతను సాధించారు.

2014 (పద్నాలుగో శాసనసభ)లో మెదక్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలుపొందిన పద్మా దేవేందర్‌రెడ్డి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2004లో టీఆర్‌ఎస్‌ పక్షాన రామాయంపేట అసెంబ్లీ స్తానం నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మా దేవేందర్‌రెడ్డి 2008లో జరిగిన ఉప ఎన్నికలో పరాజయం పాలయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో మెదక్‌ నుంచి 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఓటమి చెందగా, 2014లో టీఆర్‌ఎస్‌ పక్షాన పోటీ చేసి విజయం సాధించారు.

1999లో మెదక్‌ నుంచి ఎన్నికై చంద్రబాబు కేబినెట్‌లో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా ఉన్న కరణం రామచంద్రరావు 2002 మేలో మరణించారు. అదే ఏడాది జూలైలో మెదక్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి కరణం ఉమాదేవి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 

వివిధ పదవులు చేపట్టిన మహిళామణులు..
గల్ఫ్‌ దేశాల్లో వైద్య వృత్తిలో ఉన్న గీతారెడ్డి 1989 ఎన్నికల్లో గజ్వెల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో పర్యాటక, సాంస్కృతిక, సాంఘిక సంక్షేమం, క్రీడలు, మాధ్యమిక విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. తిరిగి 2004లో వైఎస్‌ మంత్రివర్గంలో భారీ పరిశ్రమలు, 2009లో వైఎస్, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గాల్లో సమాచార, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.

 1999, 2004, 2009 ఎన్నికల్లో నర్సాపూర్‌ నుంచి వరుస విజయాలు సాధించిన సునీత లక్ష్మారెడ్డి 2009–14 మధ్యకాలంలో వైఎస్, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. వైఎస్, రోశయ్య కేబినెట్‌లో చిన్న నీటి పారుదల, కిరణ్‌ కేబినెట్‌లో స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు.

2004లో రామాయంపేట, 2014లో మెదక్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన పద్మా దేవేందర్‌రెడ్డి పద్నాలుగో శాసనసభ (2014–18)లో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement