అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి తొమ్మిది మంది మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 139 మంది అభ్యర్థుల్లో తొమ్మిది మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సిద్దిపేట, నర్సాపూర్ నుంచి ఇద్దరు చొప్పున, మెదక్, అందోల్, జహీరాబాద్, దుబ్బాక, గజ్వేల్ నుంచి ఒక్కొక్కరు చొప్పున బరిలో నిలిచా రు. ప్రధానంగా మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, మాజీ డిప్యూ టీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. మరి ప్రజలు వీరిని ఏమేరకు ఆదరిస్తారో.. వేచి చూడాలి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో వివిధ పార్టీలు, స్వంతంత్రులుగా 11అసెంబ్లీ స్థానాలకు గాను 139మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే వీరిలో ప్రధాన పార్టీలతో పాటు వివిధ పక్షాల తరఫున కేవలం తొమ్మిది మంది మహిళలు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు. అంటే ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మహిళా అభ్యర్థుల శాతం 6.47 మాత్రమే.
ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు
హుస్నాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా పోటీలో లేకపోవడం గమనార్హం. సిద్దిపేట, నర్సాపూర్ అసెంబ్లీ స్థానాల్లో ఇద్దరేసి మహిళలు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పక్షం టీఆర్‌ఎస్ తరఫున పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్) పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రులు సునీతాలక్ష్మారెడ్డి (నర్సాపూర్), గీతారెడ్డి (జహీరాబాద్) బరిలో ఉన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌తో తలపడుతున్నారు. బీఎల్‌ఎఫ్ తరఫున అంగన్‌వాడీ కార్యకర్తల హక్కులకోసం ఉద్యమించిన పోతురాజు జయలక్ష్మి (అందోలు) పోటీ చేస్తున్నారు.
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి బంగపడిన సోమన్నగారి లక్ష్మి ప్రస్తుతం బీఎస్పీ అభ్యర్థిగా నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. శ్రమజీవి పార్టీ నుంచి ఎం.పుష్పలత (సిద్దిపేట), స్వతంత్ర అభ్యర్థులుగా మద్దుల రజనీరెడ్డి (దుబ్బాక) పోటీ చేస్తున్నారు. అయితే మద్దుల రజనీరెడ్డి దుబ్బాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మద్దుల నాగేశ్వర్‌రెడ్డి సతీమణి కావడం గమనార్హం. భర్తకు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రజనీరెడ్డి తన అభ్యర్థిత్వం ఉపసంహరించుకోక పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో మిగిలారు.
Comments
Please login to add a commentAdd a comment