మొదటి నుంచి మెదక్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని భావించారు. కానీ అనూహ్యంగా రసవత్తర పోరులోకి బీజేపీ వచ్చి చేరింది. ఎలాగైనా జిల్లాలో పాగా వేయాలని బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. నియోజకవర్గ నాయకులతో పాటు పక్క రాష్ట్రాల నేతలు కూడా బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య విజయానికి కృషి చేస్తున్నారు. వీళ్లకుతోడు ఆ పార్టీ అనుబంధ సంఘాలు ఏబీవీపీ, విశ్వహిందూ పరిషత్, హిందూవాహిని, సేవాభారతి, బజరంగ్‌దళ్ నాయకులు చాపకింద నీరులా ప్రచారం సాగిస్తున్నారు. నియోజకవర్గంలో బీసీలదే కీలకపాత్ర. బీజేపీ అభ్యర్థి బీసీ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో అనుకూలించే అంశంగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ.. గెలిస్తే ఏం అభివృద్ధి పనులు చేస్తారో వివరిస్తూ.. మెదక్‌ను బీజేపీ ఖాతాలో వేసుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
సాక్షి, మెదక్: జిల్లాలో ఎలాగైనా పాగావేయాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. ప్రత్యేకంగా మెదక్ నియోజయకవర్గంపై దృష్టి కేంద్రీకరించింది. ఈ సీటును కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల రాజయ్య గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు సర్వశక్తులు ఓడ్డుతున్నారు. రాజయ్యకు వెన్నుదన్నుగా సంఘ్‌పరివార్ సభ్యులతోపాటు కర్ణాటక బీజేపీ నాయకులు కూడా రంగంలోకి దిగారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌లు మెదక్‌లో మకాం వేశారు. బీజేపీ అనుబంధ సంఘాలతో సమావేశమై తెరవెనుక ప్రచారం చేస్తున్నారు. అన్ని గ్రామాల్లోకి వెళ్తూ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానంపై గురిపెట్టిన బీజేపీ అంతకంటే ముందు మెదక్ అసెంబ్లీని కైవసం చేసుకునేందకు పావులు కదుపుతోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మెదక్ అభ్యర్థి ఎంపిక నుంచే బీజేపీ తగు జాగ్రత్తలు తీసుకుంది. మెదక్ పార్లమెంట్ నుంచి రాజయ్యను పోటీలో నిలపాలని భావించిన బీజేపీ అధిష్టానం మెదక్ అసెంబ్లీ బరిలో దింపింది. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గంలో బీసీలు ఓటర్లు అత్యధికం.
బీసీ ఓటర్ల ఎటువైపు ఉంటే వారికి విజయం వరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన రాజయ్యను బరిలో దింపటం బీజేపీకి అనుకూలించనుంది. పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన మొదలు రాజయ్య నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. తన అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉన్న స్థానిక నేతలతో మాట్లాడి తనవైపు తిప్పకున్నారు. జిల్లా అధ్యక్షుడు సహా పార్టీలోని నాయకులందరికీ ప్రచార బాధ్యతలను అప్పగించి రోజుకు ఒక మండలంలో ప్రచారం సాగిస్తున్నారు.
చాపకింద నీరులా..
రాజయ్యకు మద్దతుగా తెరవెనుక ఆర్‌ఎస్‌ఎస్, కర్ణాటక నుంచి బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన విభాగ్ ప్రచారక్‌లు ముగ్గురు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. ప్రతి మండలానికి ఇద్దరు ప్రచారక్‌లు ఇన్‌చార్జిలుగా వ్యవహిరిస్తూ రాజయ్య గెలుపుకు కృషి చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, గుల్బార్గా జిల్లాల నుంచి 50 మందికిపైగా బీజేపీ నాయకులు మెదక్‌లో ప్రచారం సాగిస్తున్నారు.
పదిరోజులుగా వీళ్లు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ బీజేపీ గెలుపుకోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. వీరితోపాటు ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలైన ఏబీవీసీ, విశ్వహిందూ పరిషత్, హిందూవాహిని, సేవాభారతి, బజరంగ్‌దళ్ నాయకులు చాపకింద నీరులా బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. బీజేపీ నేతలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వీరంతా సొంతంగా ప్రచారం సాగిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో బీజేపీ అనుకూలతతోపాటు ఎన్నికలను ప్రభావితం చేసే ఓటర్లను కలుస్తున్నారు.
బీజేపీ గెలుపొందితే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఓటర్లకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీ గెలుపుకు అవసరమైన వాతావరణాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో చోటు చేసుకుంటున్న సమన్వయలోపం, అభ్యర్థి తీరుతెన్నులు, ప్రచారంలో లోటుపాట్లపైనా ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌లు ఎప్పటికప్పుడు రహస్యనివేదికలు బీజేపీ అధిష్టానానికి పంపుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment