ఒక్క సారి స్థానిక సంస్థల ప్రతినిధి అయితేనే లక్షలు, కోట్ల రూపాయల సంపాదనకు పరుగులెత్తుతున్నారు. కానీ చేగుంటకు చెందిన మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డి అలాంటి వారికి పూర్తిగా భిన్నం. నేటి నేతలకు ఆదర్శం. వారసత్వంగా వచ్చిన భూమికి వచ్చే కౌలు పైసలతోనే ఆయన సాధారణ జీవితం సాగుతోంది. పుట్టిన ఊరిలో, అందరిలో ఒకడిగా ఉండడమే తనకు ఆనందం అంటున్నారు ఆయన. ఉప సర్పంచ్ నుంచి శాసనసభ్యుడి వరకు ఎదిగి ఒదిగిన మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డి ప్రస్థానం, ప్రస్తుత జీవితంపై ప్రత్యేక కథనం..
చేగుంట(తూప్రాన్) : 2001లో తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఏర్పాటైన ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌లో వాసురెడ్డి చేరారు. నియోజకవర్గం వ్యాప్తంగా అప్పటి సర్పంచ్‌తో పాటు అనేక మంది నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్పించడానికి కృషి చేశారు. ఆ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించారు. నేటి మెదక్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మదేవేందర్‌రెడ్డిని రామాయంపేట జెడ్పీటీసీగా గెలిపించడంలో కీలకంగా వ్యవహరించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాసురెడ్డికి టీఆర్‌ఎస్ తరపున టికెట్ వస్తుందన్న చర్చ జోరుగా సాగింది. కానీ ఆ సమయంలో పద్మదేవేందర్‌రెడ్డికి ఆ పార్టీ తరపున అభ్యర్థిత్వం దక్కింది. అప్పటి నుంచి వాసిరెడ్డి క్రియా శీలక రాజకీయాల నుంచి దూరంగా ఉం టూ వస్తున్నారు. తనకు రాజ కీయ జీవితం ఇచ్చిన పార్టీ బీజేపీపై అభిమానంతో ఆ పార్టీలో తిరిగి చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సాధారణ కార్యకర్తలా పనిచేస్తున్నారు.
సాధారణ కుటుంబం నుంచి..
చేగుంట మండలంలోని పొలంపల్లిలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వాసు రెడ్డి 1962లో హెచ్‌ఎస్సీని పూర్తిచేశారు. 1967లో తన మేనమామ కొండల్‌రెడ్డి సమితి అధ్యక్షుడిగా గెలుపొందగా అప్పటి నుంచి రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి పెంచుకున్నారు. 1982లో బీజేపీ నుంచి చేగుంట ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఎల్‌ఎన్‌బీ డైరెక్టర్‌గా సైతం పనిచేశారు.
అనూహ్యంగా అభ్యర్థిత్వం..
1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ సమయంలో రామాయంపేట స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. కరీంనగర్‌కు చెందిన బీజేపీ నేత రాంపూర్ పురుషోత్తం సూచనలతో ఆ పార్టీ వాసురెడ్డిని తమ అభ్యర్థిగా బరిలో దింపింది. కాంగ్రెస్ తరపున పోటీచేసిన ముత్యంరెడ్డిపై 15వేల మెజార్టీలో వాసురెడ్డి గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. పదవీ కాలం ముగిసిన అనంతరం మరో సారి టికెట్ దక్కక పోవడం.. బీజేపీ కూటమి పరాజయం పొందడంతో వాసురెడ్డి కొద్దిరోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
కరెంట్, నీటి సదుపాయం కల్పన..
వాసిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని 30 గ్రామాలకు కరెంట్ సౌకర్యం కల్పించడానికి కృషి చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి 250 బోరుబావులను తవ్వించి చేతి పంపులను ఏర్పాటు చేయడం తనకు సంతప్తినిచ్చిన పథకాలని వాసురెడ్డి తెలిపారు. ఇప్పటికీ నియోజక వర్గంలో ఎక్కడికి వెళ్లినా అందరూ తనను గౌరవంగా చూడడం ఆనందం కలిగిస్తుందని చెప్పారు.
వాజ్‌పేయి ఆదర్శం..
నేను పోటీ చేసిన సమయంలో చెరు కు అమ్మితే వచ్చిన డబ్బులు రూ. 30 వేల ను మాత్రమే ఖర్చు చేశా. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు ఇంతకు అనేక రెట్లు పెరిగింది. బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయిని ఆదర్శం తీసుకుని సాధారణ జీవితం గడపాలని నిర్ణయించున్నా. వాజ్‌పేయ్ పేరు చిరస్మరనీయంగా ఉంచాలనే ఉద్ధేశంతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఉన్న 44వ నంబర్ జాతీయ రహదారికి ఆయన పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందించా. గ్రామంలోని స్థానికుల పలకరింపులు నాకు ఎంతో సంతోషాన్ని కల్పిస్తాయి. అందు కే గ్రామంలోనే ఉంటున్నా. –వాసురెడ్డి, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment