
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు నుంచి కిరోసిన్ బాటిల్‌ను లాక్కుంటున్న ఎస్‌ఐ
సాక్షి, నర్సాపూర్(మెదక్): తన భూమిలో సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన రైతు ముచ్చర్ల లక్ష్మయ్య నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి కారు ఎదుట సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం స్థానిక మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొని వెళ్తున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తన కారు వద్దకు వచ్చిన పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఆయన కారుకు ఎదురుగా పట్టణానికి చెందిన రైతు లక్ష్మయ్య కూర్చుని తలపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
పలువురు నాయకులు గమనించి అక్కడే ఉన్న ఎస్‌ఐ సత్యనారాయణతో చెప్పడంతో ఆయన రైతు వద్దకు వెళ్లి అతని చేతిలో నుంచి కిరోసిన్ బాటిల్‌ను లాక్కొని పక్కన పారవేశారు. అప్పటికే లక్ష్మయ్య తలపై కిరోసిన్ పడడంతో అతడిని ఎస్‌ఐతో పాటు పలువురు టీఆర్‌ఎస్ నాయకులు అక్కడి నుంచి పక్కకు తీసుకుపోయారు. కాగా రైతు ముచ్చర్ల లక్ష్మయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అక్కడే ఉన్న అతని భార్య చంద్రకళను టీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వద్దకు తీసుకుపోయి మీ సమస్యను చెప్పాలని సూచించారు.
తమకు నర్సాపూర్‌లో కొంత భూమి ఉందని అందులో దున్నకుండా తమ దాయాదులు అడ్డుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా కారుకు అడ్డంగా కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా అని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆమెను ప్రశ్నించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. చంద్రకళ చెప్పిన భూముల వివరాలను స్థానిక ఆర్‌డీఓ, తహసీల్దార్‌కు ఎమ్మెల్యే వివరించి లక్ష్మయ్య, చంద్రకళ దంపతులకు న్యాయం చేయాలని ఆయన సూచించారు.