ఎన్నికల నోటిఫికేషన్ రెండు రోజుల్లో విడుదల కానుంది. టీఆర్‌ఎస్, బీఎల్‌ఎఫ్ మినహా ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి మహాకూటమి, బీజేపీ నుంచి ఎవరు ఎన్నికల బరిలో ఉంటారన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ శనివారం అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. దీంతో అందరి దృష్టి పీసీసీ ప్రకటించబోయే జాబితాపైనే ఉంది. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ లేనందున తొలి అభ్యర్థుల జాబితాలో సునీతాలక్ష్మారెడ్డి పేరు ఉండనుంది. మెదక్ అసెంబ్లీ స్థానంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. మహాకూటమిలో భాగంగా మెదక్ అసెంబ్లీ స్థానాన్ని టీజేఎస్ కోరుతోంది. ఎట్టిపరిస్థితుల్లో టీజేఎస్‌కే దక్కుతుందని, వదులుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జనార్ధన్‌రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం మెదక్ అసెంబ్లీ స్థానం ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదంటున్నారు.
సాక్షి, మెదక్ : నేడు ప్రకటించనున్న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాతో జిల్లాలో కొంత క్లారిటీ వచ్చే అవశాశం ఉంది. అయితే అందరి దృష్టి మాత్రం మెదక్ టికెట్‌పై ఉంది. మాజీ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నాయకులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు బట్టి జగపతి, సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణతోపాటు నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో తాను జరిపిన చర్చల వివరాలను నేతలకు వివరించారు.
మహాకూటమిలో భాగంగా టీజేఎస్‌కు మెదక్ స్థానం కేటాయించారని జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించొద్దని, కాంగ్రెస్ పోటీ చేయటం ఖాయమని విజయశాంతి చెప్పినట్లు సమాచారం. మెదక్ నుంచి తాను పోటీచేసే అవకాశం లేదని మెదక్ నియోకజవర్గ నాయకులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఢిల్లీలోనూ ఉంటూ టికెట్ కోసం ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. శుక్రవారం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు ముకుల్ వాస్నిక్, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీలను కలిసి మెదక్ టికెట్ ఇప్పించాలని కోరారు. కాంగ్రెస్ టికెట్ దక్కని పక్షంలో రెబెల్‌గానే పోటీచేయాలనే అంశంపై శశిధర్‌రెడ్డి తన మద్దతుదారులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
11న బీజేపీ అభ్యర్థుల ప్రకటన
బీజేపీ పార్టీ సైతం ఇప్పటి వరకు మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదు. మెదక్ టికెట్ కోసం నియోజకవర్గ నాయకులు రాంచరణ్‌యాదవ్, కటికె శ్రీనివాస్ తదితరులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర నాయకులు ఆకుల రాజయ్య సైతం మెదక్ నుంచి పోటీచేసేందుకు ఆసక్తితో ఉన్నారు. ఆకుల రాజయ్యకు టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నర్సాపూర్ నుంచి బీజేపీ నాయకులు గోపీ, రఘువీర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. 11వ తేదీన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
నామినేషన్లు వేసేందుకు టీఆర్‌ఎస్..
రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 11వ తేదీన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ , నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలకు బీఫామ్ అందజేయనున్నారు. బీఫామ్ అందుకున్న అనంతరం 17, 18, 19 తేదీల్లో వరుసగా మూడుసెట్ల నామినేషన్లు వేసేందుకు పద్మాదేవేందర్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి నామినేషన్ ఎప్పుడు వేయాలన్న అంశంపై మద్దతుదారులతో చర్చిస్తున్నారు. 18, 19 తేదీల్లో మదన్‌రెడ్డి కూడా నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి
Comments
Please login to add a commentAdd a comment