పార్లమెంట్ ఎన్నికల్లో మెతుకుసీమ ప్రస్థానం
సాక్షి, మెదక్: రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండటం, శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి చెందిన ప్రాంతం మెదక్. 1952 తొలి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మెదక్ పార్లమెంట్‌లో నిజాం సంస్థానాధీశుల ఆదిపత్యం కొనసాగుతూ వచ్చింది. అప్పుడు మెదక్ పార్లమెంట్ మెదక్, అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయఖేడ్, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడింది. తర్వాత 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత మెదక్ పార్లమెంట్ ముఖచిత్రం మారిపోయింది.
పూర్వం మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న పటాన్‌చెరు, సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు తోడుగా అప్పటివరకు సిద్దిపేట పార్లమెంట్‌గా కొనసాగిన సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలు మొత్తం ఏడు నియోజకవర్గాలు కలుపుకొని నూతన మెదక్ పార్లమెంట్‌గా ఆవిర్భవించింది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో మరింత ప్రత్యేకత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మెదక్ పార్లమెంట్ స్థానం తెలంగాణ ప్రత్యేక వాద నినాదంతో గొంతు కలిపి ఉద్యమకారులకు అండగా నిలిచింది. తర్వాత స్వరాష్ట్ర సాధన, అనంతరం నూతన జిల్లాల ఆవిర్భావంతో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు మండలాలు మూడు జిల్లాల పరిధిలోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు, కార్మికుల గొంతుక పటాన్‌చెరు మెదక్ పార్లమెంట్ పరిధిలోనే నిలిచి పోయింది. మెదక్ జిల్లా కేంద్రంతోపాటు వెనకబడిన ప్రాంతంగా పేరున్న నర్సాపూర్ నియోజకవర్గం ఇందులోనే ఉంది.
వీటితోపాటు సిద్దిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలు మెదక్‌లోకి వచ్చాయి. అంటే సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ మూడు జిల్లా కేంద్రాలు ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతం, రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న గజ్వేల్‌తోపాటు, వెనకబడిన ప్రాంతాలైన దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాలు ఈ మెదక్ పరిధిలోకే వచ్చాయి. అంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో అటు పట్టణ వాసులు, ఇటు పల్లె జనాల కలగలుపు, అభివృద్ధి, వెనకబాటుతనం ఇలా ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం పారిశ్రామిక రంగాల్లో కలగలుపుగా ఉన్న మెదక్ ఏంపీ స్థానం ఉండటం గమనార్హం.
నాడు సామాజిక వేత్తలు.. నేడు ప్రత్యేక ఉద్యమ కర్తలు
భారత పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పాటు నుంచి నేటి వరకు మెదక్ ప్రత్యేకతను సంతరించుకుంటూ వస్తోంది. నాడు ఎన్.ఎం.జయసూర్య, సంగం లక్ష్మీబాయి వంటి సామాజిక వేత్తలకు ఆతిధ్యమిచ్చి పార్లమెంట్‌కు పంపించిన చరిత్ర ఈ గడ్డకు ఉంది. తర్వాత కాలంలో దేశంలోనే రాజకీయకల్లోల పరిస్థితి ఏర్పడిన సందర్భంలో 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థి ఇందిరాగాంధీని గెలిపించారు.
ఇక్కడి నుంచి గెలిచిన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కొనసాగుతూనే మృతి చెందారు. అనంతరం ప్రత్యేక తెలంగాణ వాదమే నినాదంగా ఒక్కడి నుంచి పోటీ చేసిన నరేంద్ర, విజయశాంతిలను రాష్ట్ర ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గెలిపించి ప్రత్యేకతను చాటుకుంది.
Comments
Please login to add a commentAdd a comment