పారిశ్రామిక అభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రోత్సాహం
కోవిడ్ సమయంలోనూ పరిశ్రమలకు చేయూత
జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో భారీగా పరిశ్రమలు రాక
2021 నుంచి 2024 మే వరకు రూ.61,295 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు
ఇదే సమయంలో 179 యూనిట్ల ప్రారంభం
వాస్తవ రూపంలోకి రూ.76,278 కోట్ల పెట్టుబడులు
2022లో రూ.45,301 కోట్ల పెట్టుబడులతో అగ్ర స్థానంలో రాష్ట్రం
డీపీఐఐటీ తాజా గణాంకాల్లో వెల్లడి
స్పష్టమైన విధానాలు, ప్రోత్సాహకాలు, పక్కా ప్రణాళికతో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వేలాది మందికి ఉపాధి లభించింది. కోవిడ్ సృష్టించిన సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగం దెబ్బతిన్న సమయంలోనూ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పరిశ్రమలు నిలదొక్కుకొనేలా చర్యలు చేపట్టింది. ప్రోత్సాహకాలతో పారిశ్రామిక రంగాన్ని ఆదుకొంది.
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కూడా వెల్లడించింది. కోవిడ్ తర్వాత పెట్టుబడులను ఆకర్షించడం, వాస్తవ రూపంలోకి తేవడంలో ఏపీ దూకుడును ప్రదర్శించినట్లు డీపీఐఐటీ విడుదల చేసిన తాజా గణాంకాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు వాస్తవ రూపంలోకి వస్తూ నిర్మాణ పనులు ప్రారంభించిన వాటిని మాత్రమే డీపీఐఐటీ వాస్తవ పెట్టుబడులుగా పరిగణనలోకి తీసుకుంటుంది.
డీపీఐఐటీ తాజా నివేదిక ప్రకారం.. కోవిడ్ అనంతరం 2021 నుంచి ఈ ఏడాది మే వరకు రాష్ట్రంలో కొత్తగా 171 భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.61,295 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో మరో 179 భారీ పరిశ్రమలు నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. దీంతో గడిచిన మూడున్నరేళ్ల కాలంలో రూ.76,278 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో అత్యధికంగా 2022లో రూ.45,301 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి తేవడం ద్వారా దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. కోవిడ్ సమయంలో ఏ ఒక్క పరిశ్రమ మూత పడకూడదన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రీస్టార్ట్ ప్యాకేజీతో పరిశ్రమలను చేయిపట్టి నడిపించారు.
వేగంగా అనుమతులు మంజూరు చేయడం ద్వారా ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. తద్వారా ఏటీసీ టైర్స్, సెంచురీ ప్లైవుడ్స్, బ్లూస్టార్, డైకిన్, డిక్సన్, ఆదిత్యబిర్లా ఫ్యాషన్స్, గ్రాసిం, ఐటీసీ, గోద్రేజ్, ఓఎన్‌జీసీ, లైఫిస్, క్యూలే ఫార్మా వంటి అనేక భారీ ప్రాజెక్టులు తమ వాణిజ్య కార్యకలాపాలను విజయవంతంగా ప్రారంభించాయి.
ఈ ఏడాది రూ.23,547 కోట్ల కొత్త పెట్టుబడులు
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ 2024లో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో ఏపీ సత్తాను చాటుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఐదు నెలల్లో కొత్తగా 19 భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.23,547 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు డీపీఐఐటీ వెల్లడించింది. ఇదే సమయంలో 34 ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.4,908 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇవి కాకుండా 2023లో విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు వాస్తవ రూపంలోకి వస్తున్నాయని డీపీఐఐటీ తెలిపింది.
ఇండ్రస్టియల్ ఎంటర్‌ప్రెన్యూర్ మెమోరాండం
దేశంలో పెట్టుబడులు పెట్టే సంస్థ డీపీఐఐటీలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకోసం ఇండ్రస్టియల్ ఎంటర్‌ప్రెన్యూర్ మెమోరాండం (ఐఈఎం) సమర్పించాలి. ఇందులో పార్ట్–ఏ, పార్ట్–బీ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని నిర్మాణం ప్రారంభించే ముందు పెట్టుబడి మొత్తం, ఏమి ఉత్పత్తి చేస్తారు, సామర్థ్యం వంటి వివరాలతో పార్ట్–ఏ ఇవ్వాలి. ఆ తర్వాత పరిశ్రమ నిర్మాణం ప్రారంభించినట్లు లెక్కలు, నిర్మాణ పనులు, ట్రయిల్ రన్ పూర్తి చేసి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించినప్పుడు పార్ట్–బీ దరఖాస్తు చేయాలి. పార్ట్–బీ దరఖాస్తు చేస్తే ఆ పెట్టుబడి పూర్తిస్థాయిలో వాస్తవ రూపంలోకి వచ్చినట్లు లెక్క.
Comments
Please login to add a commentAdd a comment