పారిశ్రామిక, ఐటీ అభివృద్ధికే ప్రభుత్వ ప్రోత్సాహకాలు
పనులు ప్రారంభించని ఇందూ టెక్ జోన్, బ్రాహ్మణి.. స్టార్‌గేజ్, అనంత టెక్నాలజీ, జేటీ హోల్డింగ్స్‌లకు భూ కేటాయింపు రద్దు చేసి స్వాదీనం చేసుకోవాలి
2001–2006 మధ్య 4,156 ఎకరాల భూ కేటాయింపులు
వేలం లేకుండా, కారు చౌకగా ఇచ్చారని 2007లో పిటిషన్
17 ఏళ్లకుపైగా సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు
62 కంపెనీలు, పిటిషన్ల వాదనలు విన్న ధర్మాసనం
ఎట్టకేలకు తుదితీర్పు వెల్లడించిన సీజే బెంచ్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 2001 నుంచి 2006 మధ్య పరిశ్రమలకు జరిగిన భూ కేటాయింపుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహా వివిధ పరిశ్రమల అభివృద్ధికే సర్కార్ రాయితీ, ప్రోత్సాహకాలు కల్పించిందని స్పష్టం చేసింది. అయితే భూ కేటాయింపు జరిగినా, ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం, కార్యకలాపాలు ప్రారంభించని ఇందూటెక్ జోన్, బ్రాహ్మణి, స్టార్‌గేజ్, అనంత టెక్నాలజీ, జేటీ హోల్డింగ్స్.. కంపెనీల నుంచి దాదాపు 850 ఎకరాలను నాలుగు నెలల్లోగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సుదీర్ఘ విచారణ అనంతరం సీజే ధర్మాసనం తీర్పు ఇస్తూ వాదనలను ముగించింది. ఎలాంటి టెండర్లు, ప్రకటనలు లేకుండా పలు కంపెనీలకు ప్రభుత్వం భూ కేటాయింపు జరిపిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన ఛత్రి స్వచ్ఛంద సంస్థతోపాటు మరో ఇద్దరు హైకోర్టులో 2007లో పిటిషన్ దాఖలు చేశారు.
గత పదేళ్లలో జరిపిన భూ కేటాయింపులపై సమీక్ష జరిపి మార్కెట్ విలువ ప్రకారం వసూలు చేయాలని, కార్యకలాపాలు ప్రారంభించని కంపెనీల నుంచి భూమి వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. లీజు/అమ్మకం జరిపే ముందు టెండర్లు పిలిచిన తర్వాతే కేటాయింపులు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్‌పై 17 ఏళ్లకుపైగా విచారణ కొనసాగగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే.శ్రీనివాస్‌రావు ధర్మాసనం తాజాగా 72 పేజీల తీర్పు వెలువరించింది.
వేలాది మందికి ఉద్యోగావకాశాలు..
‘పిటిషనర్ వాదనల మేరకు.. çసహజ వనరులైన భూమి, గాలి, నీరు అత్యధిక ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ) ఏర్పాటైంది. 2001 నుంచి 2006 మధ్య నామినేషన్ ప్రాతిపదికన టెండర్లు లేకుండా 4,156.81 ఎకరాలను కార్పొరేషన్ పలు కంపెనీలకు కేటాయించింది.
అభివృద్ధి ముసుగులో వేల ఎకరాలను ప్రభుత్వం ప్రైవేట్‌కు కారుచౌకగా కేటాయించింది. ప్రభుత్వ వాదన మేరకు.. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి భూ కేటాయింపులు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో హైదరాబాద్‌లోనూ పరిశ్రమల ఏర్పాటు సహకరించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ రంగ అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుతో ఆర్థిక ప్రగతి పెంపొందించడానికి ప్రభుత్వం పలు విధానాలను రూపొందించింది.
ఈ కేటాయింపులు చేసిన ఏడాది తర్వాత పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో ఉండగా, అనేక పరిశ్రమలు కార్యకలాపాలను ప్రారంభించాయి. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ఆ భూమికి ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సొమ్ము వసూలు చేయాలని ఆదేశిస్తే.. అది ప్రభుత్వ విధాన నిర్ణయాలకు విరుద్ధం అవుతుంది. ఈ దశలో జోక్యం చేసుకొని ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా, అన్ని కంపెనీలపైనే కాదు దానిపై ఆధారపడిన వారిపైనా ప్రభావం చూపుతుంది.
ఇప్పుడు భూ కేటాయింపుపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం. అయితే, భూ కేటాయింపులు జరిగినా ఇప్పటివరకు కార్యకలాపాలు ప్రారంభించని ఐదు కంపెనీల నుంచి దాదాపు 840 ఎకరాలను అధికారులు నాలుగు నెలల్లో వెనక్కి తీసుకోవాలి’అని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పరిశ్రమల అభివృద్ధికి ఏపీఐఐసీ...
‘పారిశ్రామిక అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం 1973, సెపె్టంబర్ 26న ఏపీఐఐసీని ఏర్పాటు చేసింది. ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో భాగంగా పరిశ్రమలను ఆకర్షించడమే రాష్ట్ర ప్రభుత్వ విధానంలోని ప్రధాన ఉద్దేశం. అయితే, ప్రభుత్వ ఆస్తుల కేటాయింపు విషయంలో విధానం పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఉండాలి (ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ధర్మాసనం ప్రస్తావించింది).
భూకేటాయింపులకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తూ 2000, మే 25న జీవో 3 విడుదల చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఐటీ రంగానికి ప్రోత్సాహకాలు కల్పించడంలో అర్హతలు, విధివిధానాలు, దరఖాస్తులు, వాటి పరిశీలనా విధానం, షరతులు తదితరాలతో ప్రభుత్వ విధానానికి రూపకల్పన జరిగిందని చెప్పింది. రాష్ట్రంలో ఐటీ రంగం 2004–05లో 64.05 వృద్ధి సాధించగా, జాతీయ సగటు 34 శాతమే.
2007–08లో పరిశ్రమల ఎగుమతి రూ.8,270 కోట్లతో 41 శాతం ఉండగా జాతీయ సగటు 33.88 మాత్రమే.. ఐటీ రంగానికి సంబంధించి 1997 నుంచి 2007–08 దాకా 1584 యూనిట్లు ఏర్పాటు కాగా, రూ.26,122 కోట్ల ఎగుమతులు, రూ.10,101 కోట్ల పెట్టుబడులు, 2.39 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు పేర్కొంది.
2002–05, 2005–10 మధ్య ఐటీ పాలసీ కారణంగా హైటెక్ సిటీ, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలు మాదాపూర్‌లో, బహుళ జాతీయ సంస్థలు, మైక్రో సాఫ్ట్, సీఏ, కాన్బో, యుబీఎస్, ఫ్రాంక్లిన్ అండ్ టెంపుల్టన్, విప్రో, హనీవెల్, అమెజాన్, తదితర బహుళజాతి కంపెనీలు ఏర్పాటయ్యాయి. రూ వందల కోట్ల పెట్టుబడులతో వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి లభించింది’అని పేర్కొంది.
భూ కేటాయింపుల్లో వివక్ష లేదు..
‘భూకేటాయింపుల్లో దురుద్దేశాలు, వివక్ష ఉన్నట్టు పిటిషనర్ చెప్పలేదు. ఇవి లేకుండా ప్రభుత్వ నిర్ణయాలు ఏకపక్షమని చెప్పలేం. ఈ కారణంగా పారిశ్రామిక అభివృద్ధికి రాయితీ మీద భూకేటాయింపులో ప్రభుత్వ విధానంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వం విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భూకేటాయింపులపై చర్యలు తీసుకోంటోంది. భూకేటాయింపులకు సంబంధించి ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోలేం అంటూ పిటిషన్‌లో విచారణ ముగిస్తున్నాం’అని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment