మాకు ‘పోటీ’ లేదు | KCR Campaigning At Medak | Sakshi
Sakshi News home page

మాకు ‘పోటీ’ లేదు

Published Thu, Nov 22 2018 10:23 AM | Last Updated on Thu, Nov 22 2018 11:16 AM

KCR Campaigning At Medak - Sakshi

నేనూ రైతునే..  కాపుదనపు బిడ్డనే.. నా పొలంలోనూ మోటార్లు కాలిపోయాయి. కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంటు కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డం. వాళ్ల పాలనలో ప్రజలను ఏడిపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వ్యవసాయం, పరిశ్రమలతోపాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నం. కరెంటు సరఫరాలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉంది.            

సాక్షి, మెదక్‌: మెదక్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి పోటీయేలేదని, లక్ష మెజార్టీతో పద్మాదేవేందర్‌రెడ్డిని గెలిపిస్తే ఉన్నతమైన స్థానం ఆమెకు లభిస్తుందని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి అధ్యక్షతన ప్రజా ఆశీర్వాద బహిరంగసభ జరిగింది. ఈ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ పద్మాదేవేందర్‌రెడ్డి చురుగ్గా పనిచేసే మహిళా నాయకురాలని, పద్మాదేవేందర్‌రెడ్డిని మళ్లీ గెలిపిస్తే మెదక్‌ను వరుసబెట్టి అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. మెదక్‌లో ఇది వరకే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు సాగుతున్నట్లు వివరించారు. నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాల దశల్లో ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మెదక్‌కు మెడికల్, ఇంజినీరింగ్‌ కాలేజీలు వస్తాయని హామీ ఇచ్చారు. 

ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు..
2014 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే తాను మెదక్‌ జిల్లాను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. కేసీఆర్‌ సీఎం కాకపోయుంటే జన్మలో మెదక్‌ జిల్లా ఏర్పాటు అయ్యేది కాదన్నారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఘనపురం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశాయన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఘనపురం కాల్వల దుస్థితిని కళ్లారా చూసి వాటిని అభివృద్ధి చేసే కొత్త ప్రయత్నం చేసినట్లు చెప్పారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఘనపురం ప్రాజెక్టును, కాల్వలను అభివృద్ధి చేసినట్లు వివరించారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. వచ్చే ఏడాది జూన్‌ నెలలో కాళేశ్వరం నీళ్లు జిల్లాకు వస్తాయన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మైనింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి కోరిక మేరకు మంజీరా నదిపై 14 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేసినట్లు చెప్పారు.

  రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. పింఛన్లు మొత్తాన్ని రూ.2016 కు పెంచనున్నట్లు వివరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిందన్నారు.  బలహీనవర్గాలు దళితులు, గిరిజనుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నామన్నారు. ముస్లిం పిల్లల కోసం రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

సమావేశంలో నీటిపారుల శాఖ మంత్రి హరీశ్‌రావు, జెడ్పీచైర్మన్‌ రాజమణి మురళీయాదవ్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి, మైనింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి,  మాజీ ఎమ్మెల్యేలు కరణం ఉమాదేవి, ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు దేవేందర్‌రెడ్డి, మురళీయాదవ్, మున్సిపల్‌చైర్మన్‌ మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: పద్మాదేవేందర్‌రెడ్డి
గత ఎన్నికల్లో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తానని హామీ నిచ్చిన కేసీఆర్‌ మాట నిలబెట్టుకున్నారని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. అలాగే జిల్లా కేంద్రంతోపాటు కలెక్టరెట్‌ను మంజూరు చేశారని తెలిపారు. మహా కూటమి కుమ్ములాటలతోనే ఉందన్నారు. ఆ కూటమిలో నుంచి ఎవరు నిలబడ్డారో వారికే తెలియడం లేదన్నారు. అలాంటి కూటమికి అడ్రస్‌ లేకుండా తరిమి కొట్టాలన్నారు.

అక్కా చెలెల్లు, అన్నా దమ్ములు ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని  కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, జెడ్పీచైర్మన్‌ రాజమణి, మాజీ ఎమ్మెల్యేలు ముత్యంరెడ్డి, కరుణం ఉమాదేవి, మెదక్‌ మున్సిపల్‌చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్, రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మెదక్‌ అర్బన్‌:  సాయంత్రం 4 గంటలకు రావాల్సిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సాయంత్రం 5.49 గంటలకు వచ్చారు.

కేసీఆర్‌ వస్తున్న హెలీక్యాప్టర్‌ను చూసి ప్రజలు, కార్యకర్తల నినాదాలు, చప్పట్లు, ఈలలతో కేరింతలు కొట్టారు

సభావేదిక మీదకు కేసీఆర్‌ 5.56 గంటలకు చేరుకొని... 5.58 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

కేసీఆర్‌ కేవలం 15 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. కేసీఆర్‌ సభా వేదిక వద్దకు చేరుకోగానే మెదక్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు.

కేసీఆర్‌ హెలీక్యాప్టర్‌ దిగగానే మాజీ మంత్రి హరీష్‌రావు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి హెలీప్యాడ్‌ వద్దకు పరుగెత్తుకు వెళ్ళి వేదిక వద్దకు తీసుకువచ్చారు.

కేసీఆర్‌ పద్మ నా బిడ్డ... 2014 ఎన్నికల్లో గెలిపించారు. మళ్లీ గెలిపించండి అని అనడంతో కార్యకర్తలు, అభిమానులు గట్టిగా నినాదాలు చేశారు.   ప్రజా ఆశీర్వాద సభకు మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

సభ ప్రారంభానికి ముందు వేదికపై కళాకారుల ఆటపాటలు సభికులను ఆకట్టుకున్నాయి. వీరు మెదక్‌ అభివృద్ధిపై పాటలు పాడి అలరించారు. 

టీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ అధ్యక్షులు మందుగుల గంగాధర్‌ వేదికపై పాడిన పాటలు అలరించాయి. 

చిన్నశంకరంపేట మండలం రామాయిపల్లి నుంచి బోనంతో వచ్చిన మహిళ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

పద్మాదేవేందర్‌రెడ్డి కోడలు దీపిక, తల్లిదండ్రులతో కలిసి టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు వచ్చారు.

మెదక్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి మాజీ మంత్రి కరణం రామచంద్రారావు సతీమణి కరణం ఉమాదేవిని స్వయంగా వేదికపైకి తీసుకెళ్లారు.

‘‘కాళేశ్వరం నీళ్లు వస్తే హల్ధీ, మంజీరాలు ఎన్నటికీ ఎండిపోవు. ఆ నీళ్లతో తూర్పుగోదావరి, డెల్టా ప్రాంతలకంటే మెదక్‌ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఇది జరిగితే బంగారు తెలంగాణ వచ్చినట్లే.’’

‘‘రైతులు, ప్రజలకు మేలు చేసే పార్టీని గెలిపించాలి. పొరపాటున కాంగ్రెస్‌ అ«ధికారంలోకి వస్తే కరెంటు ఆగమైతది. తాగు, సాగునీరులో ఇబ్బందులు వస్తయి.  ఎన్నికల సమయంలో ఎవరో ఏదో చెబితే ప్రజలు నమ్మొద్దు.  మెదక్‌ ప్రజలు  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి.’’ 

‘‘ఎన్నికల్లో ఏం ఫలితం వస్తుందోనని మెదక్‌ నియోజకవర్గంలో సర్వే చేయించిన. పద్మాదేవేందర్‌రెడ్డికి 64 శాతం అనుకూలత ఉంటే, ఇతరులకు 20 నుంచి 30 శాతం ఉంది. మెదక్‌లో ప్రత్యక్షంగా పోటీ ఉన్నప్పుడే అలా ఉంటే.. ఇప్పుడే జోకర్, బ్రోకర్‌ కథ అయ్యింది. పద్మను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి.’’
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

హెలీక్యాప్టర్‌ని చూసి కేరింతలు కొడుతున్న కార్యకర్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement