జిల్లాలోని అభ్యర్థుల భవితవ్యం యువకుల చేతిలో కేంద్రీకృతమైంది. మొత్తం ఓటర్లలో సగానిపైగా యువ ఓటర్లే ఉన్నారు. మరో ఆసక్తికర విషయమేమంటే ఇందులో యువతుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో అభ్యర్థులు యువమంత్రాన్ని జపిస్తున్నారు. వారిని ఆకర్షించడానికి ఎత్తుగడలను సిద్ధం చేసుకుంటున్నారు. వారితో మాట్లాడేందుకు యువ నాయకులను రంగంలోకి దించుతున్నారు. తమ ప్రచారాల్లోనూ యువకులను ఎక్కువగా కలుస్తూ ఆదరించాలని కోరతున్నారు. యువత మరి ఎటువైపు మొగ్గు చూపుతారో.. వేచి చూడాలి..
సాక్షి మెదక్: అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో యువ ఓటర్లు కీలకంగా మారనున్నారు. అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో యువ ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 39 ఏళ్లలోపు వయస్సు ఓటర్లు జిల్లాలో 2,21,713 మంది ఉన్నారు. ఈ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే వారిది గెలుపు ఖాయమని విశ్లేషిస్తున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 3,92,606 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,21,713 మంది యువకులే ఉన్నారు. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు తీర్పుపై రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఉన్నారు.
వారి మద్దతు కూడగట్టేందుకు అన్ని రాజకీయపార్టీలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు యువ ఓటర్లను ఆకర్శించేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థులు తమ ప్రచారంలో యువ ఓటర్లు తమ వెంట ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో పాటు వారినే ఎక్కువగా కలుస్తున్నారు. అలాగే యువజన సంఘాలు, మహిళా సంఘాలను దగ్గర చేసుకుని యువతరంను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు తమ పార్టీలోని యువనేతలను రంగంలోకి దించుతున్నారు. ఇదిలా ఉంటే యువ ఓటర్లలో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
ఆకర్షణకు ప్రత్యేకంగా..
మెదక్, నర్సాపూర్ నియోకజవర్గాల్లో యువ ఓటర్లదే పైచేయి. 18 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 2,21,713 మంది ఉన్నారు. ఇందులో మెదక్ నియోకజవర్గంలో 1,03,610 మంది ఉన్నారు. వీరిలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 5163, 20 నుంచి 29 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 43,644, 30 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 54,803 మంది ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మొత్తం యువ ఓటర్లు 1,18,103 మంది ఉన్నారు. వీరిలో 18–19 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 5775, 20 నుంచి 25 ఏళ్ల ఓటర్లు 50,697 మంది, 30 నుంచి 39 ఏళ్లు ఉన్న ఓటర్లు 61,631 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో యువ ఓటర్ల శాతం ఎక్కువగా ఉండటంతో మెదక్, నర్సాపూర్ నియోకజవర్గాల్లోని రాజకీయపార్టీలు యువ ఓటర్లను ఆకర్శించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
అధికారుల ప్రచారం విజయవంతం
మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో 10,938 మంది యువ ఓటర్లు మొదటి సారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఓటు సవరణ చేపట్టారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే జిల్లా యంత్రాంగం 18 నుంచి 19 ఏళ్ల ఓటర్ల పేర్లను ఓటరు జాబితాలో చేర్పించేందుకు ఎక్కువగా కృషి చేసింది. కళాశాలల్లో ప్రచారం చేయడంతోపాటు రాజకీయ పార్టీలకు కొత్త ఓటర్లను చేర్పించాల్సిందిగా సూచించింది. జిల్లాలో కొత్త ఓటర్లుగా 10,938 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో పురుషులు 6,311 మంది ఉండగా మహిళలు 4,627 మంది ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో కొత్త ఓటర్లు 5,163 మంది ఉండగా నర్సాపూర్ నియోజకవర్గంలో 5,777 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment